సాక్షి, గన్నవరం : నేషనల్ ఇనిస్టిట్యూట్ డిజాస్టర్ మేనేజిమెంట్ సౌత్ క్యాంపస్ కార్యాలయానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఏపీ పునర్విభజనలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను కేంద్ర ప్రభుత్వం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ ఈ ప్రాంత ప్రతిష్ట పెంచనుంది. ఎన్‌ఐడీఎం చుట్టుపక్కల చాలా ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. 400 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వివిధ సంస్థలు వస్తున్నాయి. గతేడాది శంకుస్థాపన చేసిన ఎన్డీయేఎఫ్ బెటాలియన్ నిర్మాణాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజును కోరుతున్నా.
కాలం గతి తప్పుతోంది. రుతువులు క్రమం తప్పుతున్నాయి. దీనికి మనం చేస్తున్న పనులు కూడా కారణం. ప్రకృతితో సహజీవనం చేయటం అలవర్చుకోవాలి. భూమి,నీరు, ఆకాశం, వెలుతురుని సద్వినియోగం చేసుకోవాలి. అతిపెద్ద కోస్త తీరప్రాంతం ఉన్న ఏపీకి ఎన్‌ఐడీఎం ఎంతో అవసరం. అతి తక్కువ కాలంలో ఎక్కువ సంస్థలు రాష్ట్రానికి వచ్చేలా చూసా. ప్రకృతి వైపరీత్యాల నివారణలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. విపత్తులను ఎదుర్కోవడంలో ఏపీ అధికారులకు అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు పెను సవాల్‌గా పరిణమించాయి.’ అని అన్నారు.
ఏడాదిలోపే ఎన్‌ఐడీఎం నిర్మాణం: రిజిజు
విపత్తు నిర్వహణ విషయంలో దేశవ్యాప్తంగా రెండువేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు కింద పనులు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అందులో ఏపీలో మెజార్టీ కార్యాకలాపాలు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. కొండపావులూరులో ఎన్‌ఐడీఎం నిర్మాణం ఏడాదిలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని తెలిపారు.
కాగా అతి పెద్ద కోస్తా తీరం, దక్కన్ పీఠభూమి, పశ్చిమ కనుమలతో ఉండే దక్షిణ భారతదేశంలో విపత్తులకు ఆస్కారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సెంటర్ ద్వారా విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడంతో పాటు ఎదుర్కొనే సత్తా ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు ఉంది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment