‘ఆప్షన్’తోనే ఉద్యోగుల ‘విభజన’
జిల్లా, జోనల్ కేడర్ ఉద్యోగులపై ప్రభావం ఉండదు
రాష్ట్ర కేడర్, సచివాలయ ఉద్యోగుల సంఖ్య 78 వేలు
తెలంగాణకు 32.76 వేలు, సీమాంధ్రకు 45.24 వేలు
రెండు రాష్ట్రాల్లోనూ జోనల్ వ్యవస్థ కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ‘ఆప్షన్’ అవకాశం ఇచ్చి ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించనున్నారు. జిల్లా, జోనల్ కేడర్ పోస్టులపై విభజన ప్రభావం ఉండదు. మల్టీజోనల్ కేడర్ పోస్టుల విషయంలో మాత్రం స్వల్ప ప్రభావం తప్పదు. రాష్ట్ర కేడర్ అధికారులతో పాటు సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ సిబ్బంది, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచనున్నారు. ఈ విభాగాల్లో ప్రస్తుతం 78 వేల మంది పనిచేస్తున్నారని లెక్క తేల్చారు. వారిని జనాభా ప్రాతిపదికన 42 శాతం తెలంగాణకు, 58 శాతం సీమాంధ్రకు విభజించాల్సి ఉంటుంది.
అంటే 32.76 వేల మందిని తెలంగాణకు, 45.24 వేల మందిని సీమాంధ్రకు కేటాయించనున్నారు. ఈమేరకు శాఖల వారీగా స్టాఫ్ ప్యాట్రన్‌ను నిర్ధారిస్తారు. తర్వాత ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకొనే అవకాశం ఇస్తారు. తొలుత ఎస్టీ, ఎస్సీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. ఎస్సీ, ఎస్టీల ఖాళీలు భర్తీ అయిన తర్వాత మిగిలిన ఖాళీలను మిగతా ఉద్యోగులతో భర్తీ చేస్తారు. ఎక్కువ మంది హైదరాబాద్ (తెలంగాణ)లో ఉండాలని కోరుకుంటే ఖాళీల కన్నా ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. అప్పుడు సొంత రాష్ట్రం వారికి ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు.
సర్వీసులో అత్యంత జూనియర్ అయిన ఉద్యోగి అనివార్యంగా బదిలీ కావాల్సి ఉంటుంది. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, హోం, ఆర్థిక శాఖల అధికారులతో కూడిన కమిటీ ఇవ్వనున్న మార్గదర్శకాల ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. దీన్ని పూర్తి చేయడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి కమల్‌నాథన్ అధ్యక్షతన కమిటీ త్వరలోనే ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ 371(డి) ఉంటుందని, అంటే జోనల్ వ్యవస్థ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న జోన్లనే కొనసాగిస్తారా? లేక జోన్లను పునర్‌వ్యవస్థీకరించే అధికారం ఉన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ‘సాక్షి’కి చెప్పారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించాలని డిమాండ్ చేస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు 52 శాతం లేరని, వారికి ఉద్యోగాల్లో న్యాయమైన వాటా లేదని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు.
అఖిలభారత సర్వీసు అధికారులకూ ఆప్షన్...
అఖిలభారత సర్వీసు అధికారులను స్థానికత ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఏపీ క్యాడర్ అధికారులకు మాత్రం ఆప్షన్ ఇవ్వనున్నారు.
26 నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తిచేయడానికి ఈనెల 10వరకు ఉన్న గడువును 25కు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26 నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.