ఆద్యంతం అప్రజాస్వామికం
పార్లమెంట్‌లో ఏం జరిగింది -14
(ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20.02.2014 నాడు రాజ్యసభ కార్యక్రమాల వివరాలివి. ఆరోజు చిరంజీవి చేసిన ప్రసంగంలోని తదుపరి భాగం.)
చిరంజీవి: కానీ జరుగుతున్న విధానం, రాష్ట్రాన్ని విడదీస్తున్న పద్ధతి - చాలా దురదృష్టకరం. తొందరపాటుతో వ్యవహరిస్తూ గబగబా నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ప్రజల్లో కోపం, వ్యతిరేకత, బాధ కలుగుతున్నాయి. శ్రీకృష్ణకమిటీ రిపోర్ట్ సబ్‌మిట్ చేసినా, దానిమీద చర్చేలేదు. శ్రీకృష్ణ రిపోర్ట్‌లో రాష్ట్రం ఒకటిగా ఉండటమే అత్యుత్తమ పరిష్కారంగా సూచించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒకటిగానే ఉంటుందని అందరూ ఊహించారు. కాని తర్వాత, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ప్రత్యేక తెలంగాణ కోసం ఒత్తిడి పెంచారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు వేర్వేరు పాదయాత్రల్లో, మీటింగుల్లో ప్రభుత్వమే తెలంగాణను ఆలస్యం చేస్తోందంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు. కొందరు ఆ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం ప్రకటించింది. అందరం హతాశులైనాం. ఒక్క ముఖ్యమంత్రితో తప్ప, ఇతర మంత్రులతో గాని, ఎంపీలతో గాని చర్చించలేదు. కేబినెట్ ముందు టేబుల్ అయిటం చేయటం కూడా చాలా బాధాకరం.
ఆఖరుగా, ఆంటోనీ కమిటీ. ఆ కమిటీ ఏర్పాటు చేయగానే, అందరి అభిప్రాయాలూ తీసుకుంటారని ఆశించాం. అదీ జరగలేదు. ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ ఏర్పాటు చేసినప్పుడూ, ప్రజల ఆకాంక్షలు పరిగణనలోకి తీసుకుంటారని ఆశించాం. అది కూడా జరగలేదు. ఏ ఒక్కరికీ సంతృప్తి కలిగించలేదు.
ఏది ఏమైనా, కాంగ్రెస్ పార్టీనొక్కదానికే బాధ్యుల్ని చేయటం అసమంజసం. ఈ నిర్ణయం తీసుకున్న చివరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం ఈ సభ జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరుగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు, బీజేపీ ఎప్పుడూ తెలంగాణ ఇస్తామని చెప్పినా, ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దాటవేసి మాట తప్పింది. ఇది సత్యం. రికార్డయిన నిజం. రెండ్రోజుల క్రితం లోక్‌సభలో తెలంగాణకు మద్దతిచ్చిన బీజేపీ, ఇక్కడ రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించి అడ్డుకుంటోంది.
ఎంఐఎం, సీపీఐ(ఎం) పార్టీలు తప్ప, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ మొత్తం అన్ని పార్టీలూ ఈ స్థితికి బాధ్యత వహించక తప్పదు. టీడీపీ మద్దతుగా ఉత్తరం ఇచ్చింది. ఇప్పుడు సగం మంది ఎంపీలు వ్యతిరేకిస్తుంటే సగం మంది మద్దతిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మరో అడుగు ముందుకేసి ఆర్టికల్-3 ఉపయోగించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమన్నారు. వారు అనేక వేదికల మీద ఈ విషయం చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ వారు రాజకీయ ప్రయోజనాల కోసం యు టర్న్ తీసుకున్నారు. ‘సమన్యాయం’ అనే బదులు టీడీపీ వారు సీమాంధ్ర కోసం ఏమి చేయాలో అడిగితే బాగుంటుంది. కాని వారు అలా చెయ్యలేదు. సీమాంధ్ర ప్రాంతానికి వారు అందరికంటే ఎక్కువ నష్టం చేశారు. మీరు టీడీపీ అగ్రనాయకుణ్ణి అడగండి. ఆయనకే స్పష్టతలేదు. ‘సమన్యాయం’ అంటే ఏమిటి? అదేమిటో స్పష్టత లేదు. ఇప్పుడు బీజేపీ సవరణలు ప్రతిపాదిస్తోంది. నేను కూడా కొన్ని ‘ఎమెండ్‌మెంట్స్’ ప్రతిపాదిస్తున్నాను. టీడీపీ ‘సుప్రిమో’కు సమన్యాయమేమిటో తెలియదు. వాళ్లేం కోరుకుంటున్నారో చెప్పాలిగదా! మొదట్లో సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించినప్పుడు ఆయన ఏం చెప్పారు.
‘రాజధానికి నాలుగు లక్షల కోట్లు ఇవ్వాలి’ అన్నారు. ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పమనండి, ఎన్నివేల కోట్లు అవసరమో.. ఆయన సంప్రదింపుల్లో పాల్గొనక పోయివుంటే రాజధానికి 4 లక్షల కోట్లు అని ఎలా అనగలిగారు? ఇదే పత్రికల్లో వచ్చింది. మీ నాయకుణ్ణి అడగండి అన్నారో లేదో.. ఈ పార్టీలు అవలంబించిన అవకాశవాద వైఖరుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నిర్ణయం వారే తీసుకోవాలి. నిర్ణయించే వరకూ ఒత్తిడి చేసి నిర్ణయించాక కాంగ్రెస్‌ని మాత్రమే తప్పుబట్టడం సరికాదు. ప్రతిపార్టీ, ప్రతి ఒక్కరూ ఇందుకు బాధ్యులే! ఆఖరికి బాధపడేది మాత్రం పార్టీలు గాదు తెలుగు ప్రజలే!! ఆఖరికి నష్టపోయింది తెలుగు ప్రజలే.
సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన రోజు నుంచీ నేను హైదరాబాద్‌ను యూటీ చెయ్యమని అడుగుతూనే ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి కారణం తెలుగు ప్రజల సమష్టి కృషి ఫలితమేనన్న విషయం మర్చిపో కూడదు. గత 58 సంవత్సరాల తెలుగు ప్రజల ఉమ్మడి కృషి ఫలితమే హైదరాబాద్. అది జాయింట్ ప్రాపర్టీ. 1972లో వెంకయ్యనాయుడు విద్యార్థిగా ఉన్నప్పుడు, జైఆంధ్ర ఉద్యమంలో ఎవ్వరూ హైదరాబాద్‌లో ఉండాలని కోరుకోలేదు. ఇప్పుడెందుకు కలిసుందామంటున్నారు? ఎందుకంటే, అందరి ప్రయోజనాలూ హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నందువల్ల. అందుకే నేను హైదరాబాద్ యూటీ కావాలంటున్నా. గత ముప్పై ఏళ్లలో సీమాంధ్ర ప్రాంతీయుల వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి.
అరుణ్ జైట్లీ : పాయింట్ ఆఫ్ ఆర్డర్
మంత్రివర్గ సభ్యుని హోదాలో సభ్యుడు మాట్లాడుతున్నారు. ఒక మంత్రివర్గ సభ్యుడు, ప్రధానమంత్రి సమక్షంలో, ‘‘నా ప్రభుత్వం తెలంగాణకు అనుకూలం నాకు మాత్రం కొన్ని అభ్యంతరాలున్నాయి’’ అని అనవచ్చా. ఆయన ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ తరఫునా? మంత్రివర్గం తరఫునా? మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక మంత్రి మాట్లాడవచ్చా? ఆయన గుండెఘోష చెప్పాలనుకుంటే, ముందు మంత్రి పదవికి రిజైన్ చెయ్యాలి. అది వదిలేసి విలువలు, మాట మీద నిలబడటం అంటూ చదువుతున్నారు. ఆయన తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణని సమర్థిస్తున్న మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయన దృష్టిలో మాట మీద నిలబడటం అంటే అదేనేమో. మేము తెలంగాణకు అనుకూలం. పూర్వమూ ఇప్పుడూ కూడా! మేము ఎందుకు సవరణలు అడుగుతున్నామంటే, ప్రభుత్వం ప్రతిపాదించినట్లు లోపాలతో కూడిన తెలంగాణా ఆపటం కోసం. రాజ్యాంగబద్ధమైన తెలంగాణ ఏర్పాటు కోసం. అదీ మా పాయింట్. సార్, ఒక మంత్రి, మంత్రిమండలి ఉమ్మడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సభలో మాట్లాడవచ్చా.. మీ ఆదేశం/ నిర్ణయం కోరుతున్నాను.
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com