పెప్పర్ స్ప్రే ఉచ్చులో సీమాంధ్ర ఎంపీలు | andhra-pradesh-bifurcation-unconstitutional | Sakshi
Sakshi News home page

పెప్పర్ స్ప్రే ఉచ్చులో సీమాంధ్ర ఎంపీలు

Published Thu, Dec 24 2015 9:04 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

పెప్పర్ స్ప్రే ఉచ్చులో సీమాంధ్ర ఎంపీలు - Sakshi

పెప్పర్ స్ప్రే ఉచ్చులో సీమాంధ్ర ఎంపీలు

పార్లమెంటులో ఏం జరిగింది -45
 
యథావిధిగా.. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడిపోయింది. మళ్లీ సభ ప్రారంభమైంది. ఆ రోజు ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు’ ప్రవేశపెడ్తారని అందరూ అనుకుంటున్నారు గానీ ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’, ఆ రోజు లోక్‌సభలో జరగవలసిన వ్యవహారాల జాబితాలో ఎ.పి. బిల్లు ప్రస్తావన లేదు! 11 నుంచి 12 గంటల మధ్య, సభ వాయిదా పడినప్పుడు, అందరమూ సెంట్రల్ హాల్ లోనే ఉన్నాం. కొంత మంది ఒడిశా సభ్యులు ‘బిల్లు ప్రవేశపెడితే సీమాంధ్ర ఎంపీలు  కొందరు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారట గదా..’ అని ప్రశ్నించారు.
 
ఈ విషయం, కొన్ని పత్రికల్లో బాగా ప్రచారం చేయబడింది. బిల్లుకు నిరసనగా స్పీకర్ సమక్షంలోనే విషం తాగి చచ్చిపోయే ప్రయత్నం కొందరు ఎంపీలు చేస్తారని గట్టిగా పుకారు నడిచింది గానీ, ఆ ఎంపీలు ఎవ్వరో మాత్రం ఎవ్వరికీ తెలియదు! 12 గంటలకు సభ మొదలవుతోందంటూ లోక్ సభ బెల్ మోగుతోంది. స్పీకర్ ముందు భాగం, రోజూ మేము నిలబడి నినాదాలు ఇచ్చే ‘వెల్’ ప్రాంతమంతా కాంగ్రెస్ ఎంపీలతో నిండిపోయి ఉంది. మొత్తం కాంగ్రెస్ ఎంపీలెవ్వరూ వారి సీట్లలో కూర్చునిలేరు.
 
అవిశ్వాస తీర్మానం చదివేటప్పుడు ఎవరి సీట్లలో వారుండాలని మేమంతా ముందే అనుకున్నాం. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడినప్పుడు, ఆ ప్రతిపాదన చదవకుండా స్పీకర్ మరే అంశమూ మొదలు పెట్టకూడదనేది.. రూల్! అవిశ్వాసాన్ని సమర్థిస్తున్న సీమాంధ్ర ఎంపీలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎంపీలూ, ఎన్డీయే భాగస్వామి శివసేన ఎంపీలూ లేచి నిలబడి మద్దతు చెప్తారని, దాంతో విభజన బిల్లు ఆగిపోతుందని, అందరూ అనుకున్నారు. ఎందుకు కాంగ్రెస్ ఎంపీలు వచ్చి ‘వెల్’లో నిలబడ్డారో నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా పెద్ద కేకలు వినబడ్డాయి.
 
‘వెల్’ అంతా యుద్ధభూమిలా మారిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే, వాళ్ల చేతుల్లోని విషం బాటిల్ లాక్కోవడానికి వ్యూహం పన్నారనుకున్నా గానీ, అవిశ్వాసం చదవకుండానే షిండేగారి చేత బిల్లు ప్రవేశ పెట్టించాలనే కపట వ్యూహం ఏర్పాటయిందని నేనూహించలేదు. క్షణకాలంలో స్పీకర్ హడావుడిగా లోపలికి వెళ్లిపోయారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు సభ్యులందరూ దగ్గుతూ, ఆయాస పడుతూ సభలోంచి బైటకొచ్చేస్తున్నారు. ఇందాక ఆత్మహత్యా ప్రయత్నం జరుగుతుందా అని ప్రశ్నించిన ఒడిశా ఎంపీ, ‘పాయిజన్ గ్యాస్ వాడతారని నువ్వు చెప్పనే లేదు’ అంటూ ముక్కు కళ్లు ఖర్చీఫ్‌తో మూసుకుంటూ వెళ్లిపోయాడు. 
 
లగడపాటి రాజగోపాల్ ‘పెప్పర్ స్ప్రే’ ఎవ్వరూ ఊహించని సంఘటన. ఈ సంఘటనతో లగడపాటి సీమాంధ్ర ప్రాంతంలో హీరో అయిపోయాడు. అని ‘హిందుస్తాన్ టైమ్స్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ బిల్లు ఆగిపోతే, మైకు విరిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్, సీమాంధ్ర ప్రాంతంలో హీరోలుగా నిలిచిపోతారని కూడా, ఉత్తరభారతంలో అత్యధిక సర్క్యు లేషన్ కల్గిన ‘హిందుస్తాన్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. ఇక్కడ నాకర్థం కాని  కొన్ని విషయాలూ, ప్రశ్నలూ మిగిలిపోయాయి. లగడపాటి రాజగోపాల్  మాలాంటి మామూలు ఎంపీ కారు! వేల కోట్ల రూపాయల లాంకో సామ్రాజ్యాధిపతి. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలనేంత బలమైన కోరిక ఉన్న వారు.
 
వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి పాదయాత్రలో, ఆయన తోపాటు, చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకూ నడిచిన వారు.. చిన్న వయస్సులోనే, విజయవంతమైన వ్యాపారవేత్తగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి పది మంది పారిశ్రామికవేత్తల్లో ఒకడిగా నిలబడే స్థాయికి చేరిన వారు. అలాంటివాడు, ఎంతో ఆలోచించకుండా, ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడతాడా! ‘‘పెప్పర్‌స్ప్రే’’తో దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి ఎక్కినవాడు, పర్యవసానంగా బిల్లు ఆగిపోతుందనే నమ్మకం లేకపోతే, ఇలా చెయ్యగలడా!?
 
నువ్వు ‘పెప్పర్‌స్ప్రే’’ కొట్టు.. బిల్లు ఆగిపోతుందని లగడపాటికి ఎవరు చెప్పివుంటారు? ఒక వేళ ‘కాంగ్రెస్’ చెప్పినా లగడపాటి వింటారా!? అప్పటికే ‘కాంగ్రెస్’ సీమాంధ్రలో ‘జీరో’ అయిపోయిందనీ, యావద్భారతంలో ‘మోదీ’ గాలి వీస్తోందని పసిపిల్లవాడిక్కూడా తెలిసిందే! అలాంటిది, సర్వేల ఎక్స్‌పర్ట్ లగడపాటి, ఆమాత్రం ఊహించలేరా! నిజానికి, ఆ సమయానికి, లగడపాటి వ్యాపార సంస్థలూ సంక్షోభంలో కూరుకునిపోయి ఉన్నాయి. కొన్నివేల కోట్ల రూపాయల బ్యాంక్ బకాయిలు చెల్లించవల్సి ఉందని అందరికీ తెలుసు. ఆ స్థాయి వ్యాపారవేత్తలు, ప్రభుత్వంతోనూ ప్రతిపక్షంతోనూ మంచి సంబంధాలు కలిగివుండాలి. అటువంటిది, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎలాగోలాగున బిల్లు పాస్ చేయించుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ‘లగడపాటి’ ఇంత తీవ్రవాద చర్యకు పాల్పడి కాంగ్రెస్, బీజేపీలను దూరం చేసుకుంటారా!
 
కాంగ్రెస్, బీజేపీలిద్దరూ లగడపాటి ‘పెప్పర్‌స్ప్రే’కి ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చివుంటారా? కాంగ్రెస్ ఎంపీలందరినీ రంగంలోకి దించకపోతే, పెప్పర్‌స్ప్రే అవకాశమే రాదు. ఎంపీల బదులుగా ‘మార్షల్స్’ని ‘వెల్’లోకి దింపినట్లైతే, కథ మరోలా నడిచి ఉండేది! ఆ ఎవ్వరినీ ‘వెల్’లోకి రాకుండా ‘మార్షల్స్’ వలయం చుట్టి ఉన్నట్లైతే, అవిశ్వాస తీర్మానం చదవక తప్పని పరిస్థితి. తీర్మానం బలపరుస్తూ యాభై మంది సభ్యులు నిలబడే పరిస్థితి, అన్ని బిల్లులూ పక్కనబెట్టి అవిశ్వాసం మీద చర్చ చేపట్టక తప్పని పరిస్థితి.. వచ్చి తీరుతాయి! లోక్‌సభ గడువు వారం రోజుల్లో ముగుస్తుంది.. అవిశ్వాసం దెబ్బతో అందరి వ్యూహాలూ దెబ్బతింటాయి!
 
లగడపాటిని కాంగ్రెస్+బీజేపీ, ఏదో తీవ్ర చర్య జరిగితే తప్ప ‘ఈ బిల్లు ఆగదు’ అని ప్రోత్సహించి ఉంటాయా!?
 
ఏం జరుగుతుందో, నిజానిజాలైతే నాకు తెలియదు గానీ, ‘పెప్పర్‌స్ప్రే’ బూచిని చూపించి సీమాంధ్ర ఎంపీలలో 15 మందిని సస్పెండ్ చేసేశారు. రాజ్‌బబ్బర్, అజారుద్దీన్ లాంటి అందరికీ మొహం తెలిసిన ప్రముఖులు కూడా ‘వెల్’లో దెబ్బలాడినా, వారినెవ్వర్నీ సస్పెండ్ చేయలేదు. ‘ఎందుకు చెయ్యలేదు’ అని విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీల వారు కూడా స్పీకర్‌ని ప్రశ్నించలేదు! ‘పెప్పర్‌స్ప్రే’ ఘటన సీమాంధ్ర ఎంపీలను ‘ఉగ్రవాదులు’గా చిత్రీకరించటానికి ఉపయోగపడిందే తప్ప ‘బిల్లు’ ఆపటానికి ఏ మాత్రం ఉపయోగపడలేదనేదే నా ఊహ! 
 
(నేనూ లగడపాటి, పలు సందర్భాల్లో చర్చించుకున్న రాజకీయ అంశాలు, ఆ రోజు సభలో ప్రవేశించబోయే ముందు, మేం మాట్లాడుకున్న విషయాలని బట్టి... లగడపాటి ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉంటారని నేను నమ్మాను. ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనే అంశంలో లగడపాటిది దృఢనిశ్చయం.. అందుకే, ‘లగడపాటి’ని వాడుకుని, సీమాంధ్ర ఎంపీలని ఏకాకులు చేశారేమోనని అనుకుంటున్నాను)
 
ఉండవల్లి అరుణ్ కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement