‘కొత్త రాజధాని’కి రాష్ట్ర కమిటీ
రంగాల వారీగా వేర్వేరు కమిటీలు
రాష్ట్ర పునర్విభజన విభాగం ఏర్పాటు
కేంద్ర కమిటీకి సహకారం అందించేందుకు ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులపై రంగాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వుుఖ్యమైన కమిటీల వివరాలు...
సీమాంధ్రకు కొత్త రాజధానిని గుర్తించేందుకు కేంద్రం నియమించే నిపుణుల కమిటీకి సహకారం అందించేందుకు వీలుగా రాష్ర్టస్థాయి కమిటీ ఏర్పాటు. జిల్లా కేంద్రాల నుంచి రైలు, జాతీయ రహదారి సంబంధాలతో పాటు కొత్త రాజధానికి హైదరాబాద్‌కు సంబంధం (కనెక్టివిటీ) ఉండేలా కొత్త రాజధాని గుర్తించాలి.
రాష్ట్రస్థాయి కమిటీకి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. మొత్తం విభజన ప్రకియ పర్యవేక్షణకు ఉన్నతస్థారుు కమిటీతో పాటు రాష్ట్ర పునర్విభజన విభాగం ఏర్పాటు. ఉన్నతస్థారుు కమిటీ కన్వీనర్‌గా టక్కర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా నాగిరెడ్డి, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, శ్యాంబాబు, రేమండ్ పీటర్, అజయ్ మిశ్రా, సమీర్ శర్మ, బి.వెంకటేశ్వరరావు, రాజీవ్ శర్మ ఉంటారు. పునర్విభజన విభాగాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమన్వయం చేస్తారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని భవనాలను, ఆస్తులను, బయట ఉన్న ఆస్తులు, భవనాలను మార్చి 15లోగా గుర్తించాలి. ఇందుకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ.
రాష్ర్టంలోని 107 శిక్షణ సంస్థలను ఇరు రాష్ట్రాలు ఏడాది పాటు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు వీలుగా రూపొందించేందుకు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ.
సీమాంధ్రలో ప్రధానంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీల రూపకల్పనకు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ.
కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ మండలి ఏర్పాటు, పనులు, ఆపరేషన్ మార్గదర్శకాలు, సిబ్బంది, బడ్జెట్, కార్యాలయాల పంపిణీపై సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన కమిటీ.
2000 సంవత్సరంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా విద్యుత్ రంగం పంపిణీ ఎలా జరిగిందో అధ్యయనం చేసి రాష్ట్రంలో విభజనపై నివేదిక ఇచ్చేందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ.
ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి సీనియారిటీ జాబితాలు, ఇరు రాష్ట్రాల ఉద్యోగుల సర్వీస్ రూల్స్ రూపకల్పనకు సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన కమిటీ.