ఆశల మోసులు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు మహర్దశ పట్టనుందనే ఆశలు రేకెత్తుతున్నాయి. కనీస సౌకర్యాలు కరువై.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన జిల్లాలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకోనుంది. గుంటూరు-విజయవాడ నగ రాల మధ్య కొత్త రాజధాని ఏర్పాట వుతుందనే వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు మన జిల్లావైపు చూస్తున్నారు. అప్పుడే చిన్నాచితక సాఫ్ట్‌వేర్ కంపెనీలు వెలుస్తున్నాయి. రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయనే ఆశతో ఇతర జిల్లాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్తులు అమ్ముకుని ఎన్నో ఏళ్ల క్రితం వెళ్లిపోయిన వారు సొంత గ్రామా లకు తిరిగొచ్చి భూములు, ఇళ్లు కొనే ఆలోచనతో ఉన్నారు.
భూముల ధరలకు రెక్కలు
నిన్నమొన్నటి వరకూ తిరోగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కొత్త రాజధాని పేరు చెప్పుకుని పురోగమనం బాట పట్టింది. జిల్లాలో సాగునీరు అందక అరకొర దిగుబడిని ఇచ్చే పంట చేలు సైతం రహదారుల పక్కన ఉన్నకారణంగా కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. కొత్త రాజధానికి కనీసం 80 కిలోమీటర్ల వరకూ అభివృద్ధి చెం దుతుందనే ఊహాగానాలతో అంతే దూరంలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. ఏలూరు నగర శివారులో గజం స్థలం రూ.7వేల నుంచి రూ.15వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నాన్ లే-అవుట్ స్థలాలు గజం రూ.4వేలు, లే-అవుట్ స్థలాలు గజం రూ.5వేలు పైబడి ఉన్నాయి. వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గరిష్టంగా ఎకరం రూ.20 లక్షలు వరకూ ఉంది. పొలంలోకి రహదారి, సాగునీటి సౌకర్యం ఉంటే ఆ ధర మరింత భారీగా ఉం టోంది. లే-అవుట్, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే భూములైతే ఎకరా నికి రూ.కోటి పైగా చెల్లించాల్సిందే.
అభివృద్ధిపై కోటి ఆశలు
రాజధాని సమీపంలో ఉంటే పశ్చిమ గోదావరి అభివృద్ధిలో దూసుకుపోతుందని స్థానికులు ఆశపడుతున్నారు. విజయవాడ-గుండుగొలను మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించేందుకు ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. మరికొన్ని రహదారుల విస్తరణతో పాటు ఎనిమిది లేన్ల రోడ్లు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాన్ని పునరుద్ధరి స్తారనే ఆశలు చిగురిస్తున్నాయి. రైల్వే లో సైతం పెనుమార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కొత్త రైళ్లు వేయటంతోపాటు, ఫాస్ట్ ట్రైన్స్ రానున్నాయి. జిల్లాలో ఏకైక నగరమైన ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వెళితే మౌలిక సదుపాయా ల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.
ఆసక్తి చూపుతున్న పారిశ్రామిక వేత్తలు
ఇప్పటివరకూ హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ సంస్థలు పశ్చిమగోదావరి జిల్లావైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఏలూరు నగరంలో చిన్నాచితకా కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. కృష్ణా, గోదావరి జలాలు, రెండు జాతీ య రహదారులు, కావాల్సినన్ని అట వీ, వ్యవసాయ భూములతోపాటు సముద్రం, రైల్వే, విమాన సదుపాయాలు అందుబాటులో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పారిశ్రామిక వర్గాలు భూముల కొనుగోలుపై దృష్టి సారించాయి.