అడవి.. అటింత.. ఇటింత | forest bifurcation in bhadrachalam district | Sakshi
Sakshi News home page

అడవి.. అటింత.. ఇటింత

Published Fri, Oct 14 2016 10:40 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

forest bifurcation in bhadrachalam district

  • అటవీ శాఖ భద్రాచలం డివిజన్ కనుమరుగేనా ?
  • మిగిలింది మూడు రేంజ్‌లు.. ఒక డీఎఫ్‌ఓ
  • పునర్విభజనతో డీఎఫ్‌ఓ, సబ్ డీఎఫ్‌ఓ బదిలీ
  • భద్రాచలం : నాడు రాష్ట్ర విభజన.. నేడు జిల్లాల పునర్విభజన.. భద్రాచలం అటవీ డివిజన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్దదిగా పేరుగాంచిన ఈ డివిజన్ నేడు నిర్వీర్యమై పోయింది. తాజా పరిణామాలతో భద్రాచలం అటవీశాఖ డివిజన్ కనుమరుగు కానుందా అనేది ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం నడిబొడ్డున విశాలంగా కనిపించే డివిజన్ కార్యాలయం ఇప్పుడు బోసిపోయింది.  
     
    రాష్ట్ర విభజనకు ముందు నార్త్, సౌత్ డివిజన్ కార్యాలయాలు భద్రాచలం కేంద్రంగా ఒకే ప్రాంగణంలో ఉండేవి. విభజన తర్వాత నాలుగు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో కలవడంతో ఇక్కడ ఉన్న సౌత్ డివిజన్‌ను చింతూరుకు మార్చారు. తాజాగా జిల్లాల పునర్విభజనతో వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలో కలపడంతో, భద్రాచలం అటవీశాఖపై ఆ ప్రభావం పడింది.
     
    భద్రాచలం నార్త్ డివిజన్‌లో సుమారు 1.20 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉండగా, ఒక్క వెంకటాపురం రేంజ్‌లోనే (దీని పరిధిలోకి వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాలు వస్తారుు) సుమారు 81 వేల హెక్టార్లు ఉంది. దీంతో భద్రాచలం డివిజన్‌లో ఉన్న 60 శాతం అడవి భూపాలపల్లి జిల్లాలో విలీనమైంది. ఇక భద్రాచలం డివిజన్ పరిధిలో చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం రేంజ్‌లు ఉన్నప్పటికీ, వీటి పరిధిలో సుమారు 40 వేల హెక్టార్ల అడవి మాత్రమే ఉంటోంది. ఈ మాత్రానికి డివిజన్ కార్యాలయం అవసరమా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.  
     
    కుర్చీలన్నీ ఖాళీ..
    భద్రాచలం అటవీశాఖ డివిజన్ నుంచి వెంకటాపురం, వాజేడు మండలాలను వేరు చేయటంతో ఆ ప్రభావం ఉద్యోగులపై కూడా పడింది. డీఎఫ్‌ఓ, సబ్ డీఎఫ్‌ఓ, ఒక సూపరింటెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్‌లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు ఆఫీసు సబార్డినేట్‌లు, ఒక డ్రైవర్‌ను ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. డీఎఫ్‌ఓ శివాల రాంబాబు,  సబ్ డీఎఫ్‌ఓగా ఆయన భార్య ప్రవీణ ఇక్కడ పనిచేశారు.
     
    అయితే రాంబాబును ఆదిలాబాద్‌కు, ప్రవీణను నిర్మల్ డివిజన్‌కు బదిలీ చేసినా, వారి స్థానంలో ఇప్పటి వరకూ అధికారులను నియమించకపోవటం గమనార్హం.  ఇక్కడికి వచ్చేందుకు అధికారులు సైతం మొగ్గు చూపటం లేదని తెలుస్తోంది. డివిజన్ కార్యాలయంలో కుర్చీలన్నీ ఖాళీ అవుతున్నా, భర్తీకి నోచుకోకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం డివిజన్‌లో మిగిలిన మూడు రేంజ్‌లను కూడా ఒకే అధికారి పర్యవేక్షిస్తుండంతో ఇది దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  
     
    డివిజన్ పరిధిలో ఉన్నది వీరే..
    మిగిలిన భద్రాచలం డివిజన్‌లో మూడు రేంజ్‌లు ఉన్నారుు. భద్రాచలం రేంజ్ పరిధి కేవలం పట్టణానికే పరిమితమైంది. దీంతో ఇక్కడి అధికారులు, సిబ్బందికి రామాలయం దర్శనం కోసం వచ్చే ఆ శాఖ  ఉన్నతాధికారుల మర్యాదలు చూసుకోవటంతోనే సరిపోతోంది. కాగా మూడు రేంజ్‌ల పరిధిలో నలుగురు డీఆర్‌ఓలు, పది మంది ఎఫ్‌ఎస్‌ఓలు, 23 మంది ఎఫ్‌బీఓలు, 19 మంది ఏబీఓలు ఉన్నారు.
     
    కార్యాలయ విధుల్లో భాగంగా ఒక సూపరింటెండెంట్, ఒక టెక్నికల్ అసిస్టెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్‌లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్‌లు, నలుగురు ఆఫీసు సబార్డినేట్‌లు పనిచేస్తున్నారు. వీరిందరినీ పర్యవేక్షించేందుకు మాత్రం ప్రస్తుతం డివిజనల్ అటవీశాఖ అధికారి లేరు.  
     
    అడవి లేదు.. అటవీ సంపదా లేదు..
    దట్టమైన అటవీ ప్రాంతానికి భద్రాచలం పెట్టింది పేరు. ఈ కారణంగానే అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం ప్రత్యేకంగా భద్రాచలం కేంధ్రంగా గిరిజన సహకార సంస్థ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా అత్యంత నాణ్యమైన తునికాకు లభించటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు సైతం భద్రాచలం ప్రాంతంలో లభించే తునికాకు కొనుగోలుకు పోటీపడేవారు.

    కానీ రాబోయే రోజుల్లో తునికాకు సేకరణ ప్రక్రియ ఎక్కడ నుంచి జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఈ మొత్తం పరిణామాలు భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భవిష్యత్‌పై బెంగతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం వాసులకు భరోసా కల్పించేందుకు పాలకులు ఏ తీరుగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement