సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న పదో వేతన సవరణ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పదో పీఆర్సీ నివేదికను వేతన సవరణ సంఘం గత మేలో గవర్నర్ నరసింహన్‌కు అందజేసిన సంగతి తెలిసిందే. జూన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు కాగానే... గవర్నర్ ఆ నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పీఆర్సీపై పెద్దగా ఒత్తిడి చేయని ఉద్యోగ సంఘాలు ఇప్పుడిప్పుడే వేతన సవరణ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెడుతున్నాయి. తనను కలసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బడ్జెట్ సమావేశాల తరువాత పీఆర్సీ సంగతి చూద్దామని సీఎం చెప్పడంతో తాజాగా ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి.
అయితే.. తెలంగాణ, ఏపీ మధ్య ఉద్యోగుల విభజన పూర్తయితే తప్ప.. వేతన సవరణ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. పదో వేతన సవరణకు సంబంధించి ఒకటే కమిషన్ రెండు రాష్ట్రాలకు సిఫార్సులు చేసిందని.. ఇప్పుడా నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగుల విభజన కంటే ముందే ఇక్కడి ప్రభుత్వం వేతన సవరణపై ఒక నిర్ణయం ప్రకటిస్తే... తర్వాత విభజనలో ఇక్కడి వారు ఆ రాష్ట్రానికి, అక్కడివారు ఇక్కడికొస్తే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఉద్యోగుల విభజన పూర్తికాకుండా వేతన సవరణ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో, ఆర్థిక శాఖలో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నందున వేతన సవరణ కష్టమని అభిప్రాయ పడ్డారు.