మరో ప్రయాణం
ఏవో.. ఏవేవో.. ఘోషలు వినబడుతున్నాయ్.. తెలుగు గుండెలు విడివడ్డాయ్. ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా.. వానకాలం ముసిరి రాగా.. నిలువు నిలువున నీరు కాలేదా.. శీతకాలం కోతపెట్టగ కొరుడుకట్టీ.. ఆకలేసి కేకలేశాం కదా. ఇదీ అంతే.. విభజన రక్కసి ఆంధ్రోళ్లను కాటేసింది. భయంలేదు మిత్రమా.. ‘విభజించు-పాలించు’ అనే సిద్ధాంతంతో కుటిల పాలన చేసిన తెల్లదొరల తుపాకీలకు గుండెల్ని ఎదురొడ్డి నిలిచిన ఆంధ్రకేసరి వారసులం మనం. శ్రీశ్రీ చెప్పినట్టు.. ‘నేను సైతం భువన భవనపు బావుటానై పైకిలేస్తాను.. నేను సైతం.. నేను సైతం..’ అంటూ తెల్లరేకై పల్లవిద్దాం. అభ్యుదయమే ఆయుధంగా పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం పైపైకి.. కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. హృదాంతరాళం గర్జిస్తూ.. మరోప్రపంచం వైపు పయనిద్దాం. నరాల బిగువూ.. కరాల సత్తువ చూపిద్దాం. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని స్వస్తి వాక్యములు సంధానిద్దాం. స్వర్ణ వాద్యములు సంరావిద్దాం. భావి వేదముల జీవనాదముల నవీన గీతికి.. నవీన రీతికి సంకల్పం చెప్పుకుందాం. ఆంధ్రజాతి మహాప్రస్థానంలో మరో ప్రయూణం మొదలెడదాం. మనం ఆశావాదులం. పురోగమనం వైపు వడివడి అడుగులు కాదు.. ఒక్క ఉదుటున పరుగెడదాం. ‘జయహో నవ్యాంధ్ర’ అంటూ నవీన గీతికను కలసికట్టుగా ఆలపిద్దాం.
సాక్షి, ఏలూరు:సువిశాల ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. మిగులు బడ్జెట్‌తో తెలంగాణ, లోటు బడ్జెట్‌తో సీమాంధ్ర తొలి అడుగులు ప్రారంభించాయి. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం మనది అనుకుని మన జిల్లా ప్రజలు రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ఇక్కడి నుంచి వలస వెళ్లి, పెట్టుబడులు పెట్టి రాజధాని నిర్మించారు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచీ ప్రయాణం ప్రారంభించాల్సి వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సదుపాయాలుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ కొత్తగా నిర్మించుకోవాలి. అవసరాలు తీర్చే వనరులు కావాలి. దాని కోసం జిల్లా ప్రజానీకం మరోసారి పునరంకితం కావాలి. నవ రాష్ర్ట నిర్మాణమనే బృహత్తర యజ్ఞంలో మన జిల్లా ప్రత్యేక భూమిక పోషించనుంది. పాడి పంటలతో తులతూగే ‘పశ్చిమ’ తాను అభివృద్ధివైపు పరుగులు తీయడంతోపాటు రాష్ట్ర ప్రజలకు అనేక అవసరాలు తీర్చనుంది.
అన్నంపెట్టే అన్నదాత
కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకలి తీర్చేందుకు జిల్లాలో 5,22,549 హెక్టార్లలో సాగుభూమి ఉంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సేద్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. కోస్తా లోని ఉభయగోదావరి జిల్లాలు ధాన్యాగారాలుగా నిలవనున్నాయి. జిల్లా విస్తీర్ణంలో 83.46 శాతం భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు. అత్యధికంగా వరి పండిస్తుండగా.. అరటి, చెరకు, కొబ్బరి, జొన్న, పొగాకు, పత్తి, మామిడి, పామాయిల్ పంటలను సైతం సాగు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను అన్ని జిల్లాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రజల ఆహార అవసరాలు తీర్చవచ్చు. అంతేకాకుండా పొగాకు, జీడి పప్పు పరిశ్రమలను విస్తరించి అంతర్జాతీయ మార్కెట్‌లో వాటా సంపాదించవచ్చు.
మానవ వనరులు
జిల్లాలో మానవ వనరులకు కొదవులేదు. దాదాపు 40 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో అత్యధికులు విద్యావంతులు, యువకులే. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు ఇక్కడి ప్రజల సొంతం. సత్యం కంప్యూటర్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రామలింగరాజు, ఆంధ్రా బిర్లాగా పేరుగడించిన ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, దివంగత ఏఎస్ రావు, బీవీ రాజు వంటి ఎందరో ప్రముఖులను అందించిన మన జిల్లాలో నేటి తరంలోనూ అంతటి ఉద్ధండులు ఉన్నారు.
పరిశ్రమలకు అనుకూలం
పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వనరులు, మౌలిక సదుపాయాలు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. 7,742 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, తూర్పున తూర్పుగోదావరి, పడమర వైపు కృష్ణా జిల్లాలు ఉండటంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు మన జిల్లా కేంద్ర బిందువు కానుంది. ఇటు గన్నవరం, అటు రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయాలు జిల్లాకు సమీపంలోనే ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో కొత్తగా విమానాశ్రయం ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు. ఓ వైపు కృష్ణా, మరోవైపు గోదావరి నదులు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించనున్నారుు. నరసాపురంలో పోర్టు అభివృద్ధి చేస్తే జల రవాణా వృద్ధి చెందుతుంది. ఇప్పటికే జిల్లాలో నూనె శుద్ధి కర్మాగారాలు, పౌల్ట్రీ, చక్కెర పరిశ్రమలు ఉన్నాయి.
పర్యాటక వైభవం
పర్యాటకంగా జిల్లాను మరింత ముం దుకు తీసుకువెళ్లవచ్చు. చిన తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన ద్వారకాతిరుమలను ఆధ్యాత్మిక రాజధాని చేయొచ్చు. పంచారామ క్షేత్రాలైన భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీరారామం ఉన్నాయి. గుంటుపల్లి బౌద్ధారామాలు, పాపికొండలు, ముఖ్యంగా కొల్లేటి సరస్సు, అక్కడకు వచ్చే విదేశీ వలస పక్షులు జిల్లాకే తలమానికం. ఈ ప్రదేశాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చవచ్చు.
సిరులు పంచే ఖనిజ సంపద
జిల్లాకు ఆదాయం సమకూర్చడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి అవసరమ్యే ఖనిజ సంపద జిల్లాలో సమృద్ధిగా ఉంది. తెల్లసుద్ద (బాల్ క్లే), బంకమట్టి నిల్వలు ద్వారకాతిరుమల వద్ద ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 6 మీటర్ల లోతులో లక్షలాది టన్నుల సుద్ద నిల్వలు ఉన్నాయి. కూచింపూడి, కొత్తపల్లి ప్రాంతాల్లోనూ ఈ నిక్షేపాలున్నట్లు అంచనా. దీంతో సిరామిక్స్ పరిశ్రమను వృద్ధి చేసుకోవచ్చు. రెడ్డి బోడేరు వద్ద గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. జిల్లాలో సున్నపురాయి, మైకా మొదలైన ఖనిజాలున్నాయి. నరసాపురంలో పెట్రోల్, సహజవాయు నిల్వలున్నట్లు కనుగొన్నారు. ఇవే కాకుండా విదేశీమారక ఆర్జించి పెట్టే ఆక్వా, లేసు వంటి ఎగుమతులు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయి. వీటన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవడంతోపాటు వీటిపై మరింత దృష్టి సారిస్తే మన ప్రాంతం, మన ప్రజలు రానున్న కాలంలో అభివృద్ధి చెందడం అంత కష్టమేమీ కాదు.