‘పునర్విభజన’ వివాదాలపై చేతులెత్తేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. చట్టంలోని నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవాలని గతంలోనే కేంద్రం సూచించింది. దీనిని రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోకుండా తలో దారిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థల విభజనతో పాటు వాటిలో పనిచేసే ఉద్యోగుల పంపిణీలో వివాదాలకు న్యాయస్థానం ద్వారా తెరదించాలని కేంద్రం భావిస్తోంది.
ఇంటర్మీడియెట్ బోర్డు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున షెడ్యూల్ 9, 10లో సంస్థల అంశాలనూ అదే న్యాయస్థానం ముందుంచాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలను జారీ చేయించిన పక్షంలో రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందనే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడగా ఉందని ఆ అధికారి పేర్కొన్నారు.
షెడ్యూల్ 9లో 89 సంస్థలున్నాయి. ఈ సంస్థల నిధులు, ఉద్యోగుల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఈ సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తి మేరకు ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంస్థల పంపిణీకి జనాభా నిష్పత్తి ప్రకారం అంగీకరిస్తోంది. కొన్ని సంస్థలకు ససేమిరా అంటోంది. అలాగే ఈ సంస్థల్లో ఉద్యోగుల పంపిణీని స్థానికత ఆధారంగా చేయాలని టీ సర్కారు పట్టుపడుతుండగా జనాభా నిష్పత్తి ప్రకారమే జరగాలని ఏపీ ప్రభుత్వం పట్టుపడుతోంది.
షెడ్యూల్ 10లో 107 సంస్థలుండగా అదనంగా మరో 35 సంస్థలను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఈ సంస్థలకు చెందిన నిధులు, ఉద్యోగుల పంపిణీలోనూ వివాదాలు నెలకొన్నాయి. కొన్ని సంస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, మరి కొన్ని సంస్థల్లోని నిధులను స్తంభింప చేసింది. ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున ఇవన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడంతో పాటు కొత్తగా ఈ సంస్థలను తాము ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపైనా కేంద్రం చేతులెత్తేసింది. ఈ వివాదాలన్నింటినీ న్యాయస్థానం ముందుకు తీసుకువెళ్లి పరిష్కరింప చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.