రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు శాఖ విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఈ పంపకాలపై అధికార వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అందరికీ అవకాశం కల్పించాలంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు శాఖ విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఈ పంపకాలపై అధికార వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న ఐపీఎస్ అధికారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలని, తెలంగాణ అధికారులు మాత్రమే ఇక్కడ ఉండాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు ఎలాట్ అయిన అధికారులకు మాత్రమే ఎక్కడ పని చేయాలని కోరుకుంటున్నారనే ఆప్షన్ ఇస్తారనే వాదనా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బుధవారం సమావేశమైన రాష్ట్ర ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ప్రధానంగా ఈ అంశం పైనే చర్చించింది. కేవలం ఇతర రాష్ట్రాల ఐపీఎస్‌లకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆప్షన్ సౌకర్యం ఉండాలని అధికారులు భావిస్తున్నారు.
ఐపీఎస్ అధికారుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అంటున్నారు. ఎవరిని, ఏ రాష్ట్రానికి కేటాయించినా అది నిబంధనల ప్రకారమే జరగాలని, ఒక్కో అధికారికి ఒక్కో విధానం వర్తింపజేయకూడదని స్పష్టం చేస్తున్నారు. అపోహలకు తావులేకుండా ఆప్షన్ కోరుకున్న అధికారికి ఆ రాష్ట్ర క్యాడర్ లభించనట్లైతే అందుకు కారణాలను సైతం కచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లాలని ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ నిర్ణయించింది.