ఔర్ ఏక్ దక్కా.. హైకోర్టు పక్కా | AP High court bifurcation | Sakshi
Sakshi News home page

ఔర్ ఏక్ దక్కా.. హైకోర్టు పక్కా

Published Thu, Mar 5 2015 12:37 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

AP High court bifurcation

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది మాసాలవుతోంది. తెలంగాణ కోర్టుల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు మాత్రం తెలంగాణలో ఉన్నట్లుగా భావించడం లేదు. పేరుకు మాత్రం హైదరాబాద్ హైకోర్టు. పరిపాలన చేస్తున్నది మాత్రం ఆంధ్ర న్యాయమూర్తులు, ఉద్యోగులు, న్యాయవాదులు. ఆధిపత్యం వాళ్లదే. ఇది ఒక్క హైకోర్టులోనే కాదు. అన్ని తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
 
 హైదరాబాద్ నగరంలో రెండు సచివాలయా లు ఇద్దరు ముఖ్యమంత్రులూ పనిచేస్తూ ఉండగా రెండు హైకోర్టులు ఏర్పాటు చేయకపోవడానికి కార ణమేమిటో బోధపడదు. రెండు హైకోర్టుల ఏర్పాటు కు ప్రస్తుత హైకోర్టు భవన సముదాయం సరిపో తుంది. ప్రస్తుతం ఉన్న భవనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇచ్చి, హైదరాబాద్ హైకోర్టును వేరే  భవ నంలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమం త్రి కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. కానీ ఆ దిశగా ఎలాంటి చలనం కనిపించడం లేదు.
 
 రాజ్యాంగంలో అధికరణ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి హైకోర్టు విధిగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయా రాష్ట్రాలు ఏర్పడిన రోజునే కొత్త హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చట్టంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయేంతవరకు హైదరాబాద్ హైకోర్టు రెండు రాష్ట్రాలకు కలిపి ఉంటుంది. అధికరణ 233లో చెప్పి నట్టుగా రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టు కాదు. పంజాబ్, హరియాణా పరిస్థితి వేరు.
 
 అది అధికరణ 233 ప్రకారం ఏర్పడిన ఉమ్మడి హైకోర్టు. హైదరా బాద్ హైకోర్టు పరిస్థితి వేరు. ఇది తాత్కాలిక వ్యవస్థ. దీన్ని ఇంకా కొనసాగించడం భావ్యం  కాదు. తెలంగాణలో ఆంధ్రా న్యాయమూర్తుల దగ్గర పనిచేస్తున్న న్యాయవాదులు చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దాని ఫలితమే మం చిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన సంఘటనలు.
 
 కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒక్క ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడుతుంది. కానీ సుప్రీం కోర్టు, ఉమ్మడి హైకోర్టు సంసిద్ధత తెలియజేయా లన్న సాకుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరగ లేదు. ఆంధ్రా, తెలంగాణ న్యాయవాదులు ఇరు వురూ తమ హైకోర్టులు తమకు కావాలని కోరుకుం టున్నారు. అయినా కోర్టులు ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించడం లేదు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీన్ని ప్రభుత్వాలు వీలైనంత త్వరగా తొలగించాలి. రెండు రాష్ట్రాలకి ప్రత్యేక హైకోర్టులను తక్షణం ఏర్పాటు చేయాలి.
 
 ఇదిలా ఉంటే న్యాయమూర్తుల పరిస్థితి మరో లా ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 77 (2) ప్రకారం రెండు రాష్ట్రాలు ఆవిర్భవించిన తేదీ తర్వాత ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకు కేటాయిం చాలి. అన్ని విభాగాల్లో అలా కేటాయింపు జరుగు తున్నా, న్యాయవ్యవస్థలో అలాంటి సూచనలు కూడా కనబడటంలేదు. హైకోర్టులో రిజిస్ట్రార్లు అం దరూ ఆంధ్రా ప్రాంతం వారే. తెలంగాణ జిల్లాల్లో ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారూ పరి శేష ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  వాళ్లే.
 
 పదవీ విరమణ చేసి రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న న్యాయమూర్తులూ ఆంధ్రావాళ్లే. తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య 25 శాతం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త నియామ కాలు చేపట్టడానికి హైకోర్టు అడుగులు వేసింది. ఇది అగ్నికి ఆజ్యం పోయడమే. రాష్ట్రంలో 220 జిల్లా న్యాయమూర్తులకు గానూ 38 మంది, 200 మంది సీనియర్ సివిల్ జడ్జీలకి గానూ 44 మంది, 500 మంది జూనియర్ న్యాయమూర్తులకు గానూ 150 మంది మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు. మొదటి నుంచీ అన్యాయానికి గురైంది వీరే.
 తెలంగాణ రాష్టంలో తెలంగాణ న్యాయవాదు లు, న్యాయమూర్తులు, ఉద్యోగులు గత 4 రోజులు గా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
 తమ కోర్టుల్లో ప్రవేశించడానికి మరో దేశం నుంచి వస్తున్న కాందిశీకుల్లా రావాల్సివస్తోంది. న్యాయమూర్తుల సంగతి సరేసరి. మాట్లాడలేరు. మాట్లాడి బతకలేరు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఒక్క న్యాయ వాదుల శక్తి సరిపోదు. ప్రజాసంఘాలు రాజకీయ జేఏసీలు, రాజకీయపక్షాలూ కలసికట్టుగా పనిచే యాలి. ‘ఔర్ ఏక్ దక్కా రెండు హైకోర్టులు పక్కా’. న్యాయవ్యవస్థలో తెలంగాణకు అన్యాయం జరుగు తున్న ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాందిశీకు ల్లా బతుకుతారో, సొంత రాష్ట్ర వాసుల్లాగా బతుకు తారో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.
 ఎల్. విక్రంరెడ్డి  న్యాయవాది, వరంగల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement