
సీఎం మినహా ఎవరితోనూ చర్చించలేదు: చిరంజీవి
రాజ్యసభలో తొలిసారిగా ప్రసంగించిన కేంద్రమంత్రి పర్యాటక మంత్రి చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడటంతో ఆయనతో పాటు.. కేంద్ర ప్రభుత్వానికీ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
విభజన నిర్ణయాన్ని రాజ్యసభలో తప్పుపట్టిన మంత్రి
న్యూఢిల్లీ: రాజ్యసభలో తొలిసారిగా ప్రసంగించిన కేంద్రమంత్రి పర్యాటక మంత్రి చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడటంతో ఆయనతో పాటు.. కేంద్ర ప్రభుత్వానికీ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. గురువారం బిల్లుపై చర్చ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ ఆకస్మికంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని, దీంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారని, విభజనకు సంబంధించి ముఖ్యమంత్రితో మినహా ఇతర నాయకులెవరితోనూ చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ‘సిగ్గు.. సిగ్గు’ అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నానని, అందులో సవరణలు చేయాలని కోరిన చిరంజీవి.. బీజేపీ కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని.. 2004లో ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటుపై వెనుకడుగు వేసిందని ప్రతిపక్షంపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘విభజనకు కాంగ్రెస్ పార్టీని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదు.
బీజేపీ ఇస్తామంది. కానీ ఎన్డీఏలో ఇవ్వలేదు. సీపీఐ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ అన్ని పార్టీలను బ్లేం చేయాలి. టీడీపీ రెండుస్లారు లేఖలు ఇచ్చింది’ అంటూ విమర్శిస్తుండటంతో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ ఆగ్రహించారు. ఆయన లేచి నిల్చుని.. ‘‘ఆయన అధికార పార్టీ సభ్యుడు. పైగా మంత్రి. ప్రధానమంత్రి సమక్షంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లునే.. ఆయన తప్పుపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నారా? మంత్రివర్గం తరఫున మాట్లాడుతున్నారా? ముందు రాజీనామా చేసి మాట్లాడండి.. అతను తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నందున మద్దతిస్తున్నారు.. మంత్రులు తమ మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చా? ప్రభుత్వం ఇచ్చిన బిల్లును వ్యతిరేకించవచ్చా? రూలింగ్ ఇవ్వండి’’ అని డిప్యూటీ ఛైర్మన్ కురియన్‌ను అడిగారు. చిరంజీవి తన ప్రసంగం కొనసాగిస్తూ.. తాను ప్రజల తరఫున మాట్లాడుతున్నానని, ప్రత్యేక రాష్ట్రంపై తన వ్యక్తిగత అభిప్రాయాలు మారలేదని.. కాంగ్రెస్ వాదిగా తన సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరమని.. పార్టీ నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని పేర్కొన్నారు. విభజన బిల్లును చర్చకు చేపట్టినప్పటి నుంచీ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది.