సాక్షి, అమరావతి: చట్టసభల సాక్షిగా ప్రతిపక్షం విద్యుత్ అంతరాయాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అబద్ధాలు చెప్పడమే విపక్షానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి లేవనెత్తిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బదులిచ్చారు. ఈ దశలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం జోక్యం చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గా ఉందా లేదా అనేది వివరాలతో సహా చెబుతున్నాం. కనీసం ఇది కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోవడంలేదు. విద్యుత్ అంతరాయాల వివరాలు ఎవరికి తెలుస్తాయి.. సంబంధిత మంత్రికి కాదా. చట్టసభలో మీరు పదేపదే అబద్ధాలు మాట్లాడుతుంటే వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి సమాచారం తెప్పించి, సభ ముందు ఉంచాలనే నేను కల్పించుకుని మాట్లాడుతున్నాను’ అని అన్నారు.
విద్యుత్ వ్యవస్థను అప్పుల్లోకి నెట్టారు
మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ రంగాన్ని రూ.70వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విభజన నాటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందనే విషయాన్ని వక్రీకరించారన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం విద్యుత్ లైన్లు, ఫీడర్లను పరిశీలించ లేదన్నారు. తాము ఈ పనిచేశామని, దీనివల్ల అక్కడక్కడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయన్నారు. గతేడాదితో పోలిస్తే తక్కువ ఫీడర్లు, తక్కువ గంటల్లోనే అంతరాయం నమోదైందన్న విషయాన్ని సభ ముందుంచారు. విద్యుత్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, 2021 నాటికి మరో 1600 మెగావాట్ల అదనపు ఉత్పత్తి వస్తుందని తెలిపారు.
కరెంట్ కోతలపై పచ్చి అబద్ధాలు
Published Wed, Dec 18 2019 4:59 AM | Last Updated on Wed, Dec 18 2019 4:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment