సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ముఖ్యమంత్రి చంద్రబాబే అంగీకరించారు కదా అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో రెండో రోజు ధర్నా కొనసాగింది. ధర్నా అనంతరం ఎంపీ డి.రాజా ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పలు విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి రూ. 3,500 కోట్లు ఇస్తే అక్కడ ఏమీ నిర్మించలేకపోయారని అన్నారు.
విభజన చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో కేవలం ఐదు ప్రధాన భవనాల నిర్మాణానికి మాత్రమే నిధులు ఇవ్వాలని ఉందన్నారు. ఇక వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ. 350 కోట్ల నిధులను త్వరలో విడుదల చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. దీనిపై నేతలు స్పందిస్తూ.. ఏపీకి ప్యాకేజీ నిధులు సరిపోవని, ప్రత్యేక హోదా ఇవ్వాలని జైట్లీని కోరారు. మౌలిక సదుపాయాల కల్పనకే 90 శాతం నిధులు ఖర్చవుతాయని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా విభజన హామీలు అమలు చేయాలని కోరారు.
రాజకీయ మార్పుతో హామీల సాధన: ఏచూరి
అంతకుముందు ధర్నాలో పాల్గొన్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. కేంద్రంలో రాజకీయ మార్పు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల అమలు సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీని ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రాజకీయ మార్పు అవసరమని, దాని కోసం అందరం కలసి పోరాడుదామని పేర్కొన్నారు. ధర్నాలో సీపీఐ నారాయణ, రామకృష్ణ, సీపీఎం మధు, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాబే ప్యాకేజీకి అంగీకరించారు
Published Sat, Jan 5 2019 5:07 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment