
హామీలన్నీ అమలు చేయాలి: వైఎస్ జగన్
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదాను అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది.
* విభజన చట్టం హామీలను నెరవేర్చేందుకు మీరు జోక్యం చేసుకోవాలి
* ప్రధాని మోదీకి ఇచ్చిన వినతిపత్రంలో జగన్‌మోహన్‌రెడ్డి బృందం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదాను అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం సాయంత్రం ప్రధానమంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం.. రేస్‌కోర్స్ రోడ్ 7లో కలసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది.
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా అధర్మంగా విభజనకు గురైన తరువాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక ఇక్కట్లకు గురవుతోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రస్తుత ఏపీ రాష్ట్రానికి పారిశ్రామిక పునాది లేదు. ఐటీ రంగం మొత్తం హైదరాబాద్ నగరంలో విస్తరించి ఉంది. ఏపీలో ఐటీ రంగం లేకుండా పోయింది. మౌలిక వసతులు, ఉన్నత విద్య, ఆరోగ్య రంగాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన రాజధాని నగరం మాకు కాకుండా పోయింది. కేంద్రం నుంచి భారీ మొత్తంలో సాయం అందకపోతే మాకు రాజధాని ఏర్పడే పరిస్థితి లేదు. ఒకవైపు భారీగా రెవెన్యూ లోటు ఉండగా.. మరోవైపు కొత్త రాజధాని, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అందువల్ల మా రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో.. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయడానికి మీరు జోక్యం చేసుకోవాలి’’ అని ఆ వినతిపత్రంలో కోరింది. వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ...
ప్రత్యేక ప్యాకేజీ మరిన్ని జిల్లాలకు ఇవ్వండి..
ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోరాపుట్ - బొలాంగిర్ - కలహండి (కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని నాటి ప్రధాని రాజ్యసభలో చెప్పారు. కానీ ఇటీవల కేంద్రం జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని జిల్లాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది చాలా నామమాత్రమైన కేటాయింపు. మరోవైపు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చే పథకమైన బీఆర్‌జీఎఫ్‌ను రద్దు చేశారు. అలాగే.. ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయం జిల్లాలకు కూడా ఈ ప్యాకేజీ ద్వారా నిధులు ఇవ్వాలి.
రాజధానికి భారీగా నిధులు కేటాయించాలి..
కొత్త రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరమవుతాయన్న విషయాన్ని, కేంద్రం ఏమేర ఇస్తుందని, ఎప్పటిలోగా ఇస్తుందన్న విషయాలనూ విభజన చట్టంలో చెప్పలేదు. అయితే.. సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, మండలి తదితర అవసరమైన మౌలిక వసతులు సహా కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. అయితే 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ఇందుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. రాజధాని నిర్మాణానికి భారీగా నిధులివ్వాలని కోరుతున్నాం.
విద్యాసంస్థలను త్వరితగతిన నిర్మించండి..
రాష్ట్రంలో పలు జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీ ఇచ్చింది. ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహాలో బోధనాసుపత్రి వంటి సంస్థలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిర్మిస్తామని కేంద్రం చెప్పింది. ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీ, పెట్రో వర్సిటీ, ట్రైబల్ వర్సిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలను కూడా త్వరితగతిన ఏర్పాటుచేయాలని కోరుతున్నాం.
రైల్వే హామీలన్నీ నెరవేర్చండి..
సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటుచేస్తామని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలు హామీ ఇచ్చింది. అలాగే కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర నగరాలకు ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీని ఏర్పాటుచేస్తామనీ హామీ ఇచ్చింది. కానీ ఈ దిశగా ఏ చర్యలూ తీసుకోలేదు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం.
ప్రాణహిత, దుమ్ముగూడెంలను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలి...
పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని 10, 12, 13 షెడ్యూళ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ వీలైనంత త్వరగా నెరవేర్చాలని కోరుతున్నాం. వీటికి తోడుగా ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టును, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని కోరుతున్నాం. అలాగే తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల ప్రజల సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించలేదు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం.
స్పెషల్ స్టేటస్ అమలు చేయండి..
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ‘13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు స్పె షల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తాం...’ అని హామీ ఇచ్చారు. ఈమేరకు 2014 మార్చిలో ఏపీకి స్పెషల్ స్టేటస్ అమలుచేయాలని కేంద్ర కేబినెట్.. నాటి ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. కానీ ఇంతవరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీనిని సత్వరం అమలు చేయాలని కోరుతున్నాం. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ కోసం కేంద్రం ఇటీవల రూ. 500 కోట్లు విడుదల చేస్తామని ప్రకటిం చింది. కొత్త రాష్ట్రం సమస్యలను ఇది ఎంతమాత్రం తీర్చలేదు. అందువల్ల వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయగలరు.
హిమాచల్, ఉత్తరాఖండ్‌ల తరహా రాయితీలు ఇవ్వాలి...
‘కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు వీలుగా పన్ను ప్రోత్సాహకాలు సహా సముచితమైన ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటుంది..’ అని విభజన చట్టంలోని సెక్షన్ 94(1)లో పేర్కొన్నారు. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 15 శాతం అదనపు డిప్రిసియేషన్, 15 శాతం పెట్టుబడి అలవెన్స్‌ను ప్రకటించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి సరిపోవు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ఏపీకి కూడా ప్రకటించండి. అలాగే.. పన్ను ప్రోత్సాహకాలను కేవలం వెనుకబడిన జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల రాష్ట్రానికి ఎంతమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే 974 కి.మీ. పొడువు గల కోస్తాతీరం వెంట అంతర్జాతీయ స్థాయి ఓడరేవులున్నాయి.
పెట్టుబడులు పెట్టేవారు నౌకాశ్రయాలకు సమీపంలోనే పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. అందువల్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించండి. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడం వంటి అంశాలను పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచారు. అయితే ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటి అమలుతో పాటు.. చిత్తూరు జిల్లాలోని ఎన్‌టీపీసీ - బీహెచ్‌ఈఎల్ మన్నవరం ప్రాజెక్టును కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయండి.
‘పట్టిసీమ’ నిలిపివేతకు ఆదేశించండి
పోలవరం నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. సహాయ, పునరావాస కార్యక్రమాల అమలు ఖర్చుతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటపుడు రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి హడావుడిగా శంకుస్థాపన చేయటం ఎందుకో అంతుపట్టని విషయం. పట్టిసీమ లిఫ్ట్ వల్ల పోలవరం ప్రాజెక్టును పూర్తిగా మూలన పెట్టేస్తారన్న బలమైన అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి.
పైగా.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు రెండో చాప్టర్ క్లాజ్-7లో.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకు నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే అంశంతో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రలకు ఉంటుందని.. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని పోలవరం నుంచి కృష్ణాకు మళ్లిస్తే, అధికంగా మళ్లించిన నీటినీ మూడు రాష్ట్రాలకు అదే దామాషాలో పంచాలని.. నిబంధనలు ఉన్నాయి. వీటిపై ఉన్న భయాలు నిజమైతే.. గోదావరి నుంచి చుక్కనీరు మళ్లించక ముందే, రాష్ట్రం 70 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తుంది. అదీగాక.. పట్టిసీమ లిఫ్ట్ నుంచి కృష్ణా నది వరకు ఎక్కడా నీటి నిల్వకు అవకాశం లేదు. సాంకేతికంగా ఇన్ని అనుమానాలు, భయాలు ఉండగా.. పట్టిసీమ టెండర్‌ను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆత్రపడింది.
తమతో అవగాహన ఉన్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలు పెట్టి 21.9 శాతం అధిక వ్యయానికి కాంట్రాక్టు కట్టబెట్టింది. పట్టిసీమ లిఫ్ట్ కోసం భారీగా ప్రజా ధనాన్ని వృథా చేయడానికి బదులుగా.. పోలవరం ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని మీకు (కేంద్ర ప్రభుత్వానికి) విజ్ఞప్తి చేస్తున్నాం. సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాం.’’
సింగపూర్ కంపెనీలకు 10 వేల ఎకరాలు ఉచితమట..!
విభజన చట్టంలోని సెక్షన్ 94 (4) ప్రకారం రాజధాని అవసరాలకు డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల నుంచి, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. బహుళ పంటలు సాగయ్యే దాదాపు 30,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఎందుకు సేకరిస్తోందో అంతుపట్టని పరిస్థితి. ఇదే గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నప్పటికీ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు.
పైగా వార్తాపత్రికల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఏపీ ప్రభుత్వం సింగపూర్‌లోని పలు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతోందని.. ఆ కంపెనీలకు దాదాపు 10వేల ఎకరాల భూమిని ఉచితంగా కట్టబెడతారని తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆ కంపెనీలు ఉచితంగా రాజధానిని నిర్మించి ఇస్తాయట. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అటు చట్టసభల్లో గానీ, ఇటు బయట గానీ చర్చించే ందుకు నిరాకరిస్తోంది. కొత్త రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చాం. అయి తే బహుళ పంటలు అందించే వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కోవడాన్ని.. వేలాది మంది రైతుల జీవనోపాధి దెబ్బతీసే ఈ చర్యలను మేం వ్యతిరేకిస్తున్నాం.