ఆ లోటును భర్తీ చేస్తాం
ఆ లోటును భర్తీ చేస్తాం
Published Tue, Dec 1 2015 9:14 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
పార్లమెంట్‌లో ఏం జరిగింది -29
విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు.
డిప్యూటీ చైర్మన్: హోం మినిస్టర్ ఒప్పుకుంటున్నారా?
వెంకయ్య నాయుడు: బడ్జెట్ ప్రతిపాదించే లోపు...
హోం మంత్రి: సార్, విషయం వచ్చింది. కొన్ని ఇబ్బందులున్నాయి కాబట్టే ప్రధాన మంత్రిగారు సభలో ప్రకటన చేశారు. అపాయింట్‌మెంట్ రోజు నుంచి పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి వరకు అవసరం లేదు.
డిప్యూటీ చైర్మన్: సరే నరేష్ గుజ్రాల్ గారి సవరణ మీద ఓటింగ్.
వెంకయ్య నాయుడు: సార్, మేము సవరణ మీద ఓటింగ్‌కు ఒత్తిడి చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. కారణం...
డిప్యూటీ చైర్మన్: నరేష్ గుజ్రాల్ గారి సవరణ ఓటింగ్ అయిపోనివ్వండి. నరేష్ గుజ్రాల్ గారి సవరణ సభ ముందుంచుతున్నాను.
పేజీ 11లో 51వ లైన్ తర్వాత ఈ మాటలు కలప బడాలి.
సవరణ తిరస్కరించబడింది.
వెంకయ్య నాయుడు: సార్...
డిప్యూటీ చైర్మన్: మీరు చెప్పారు. ప్రభుత్వం వాదన స్పష్టం చేసింది.
వెంకయ్య నాయుడు: గవర్నమెంట్‌కి అసలు అర్థం కాలేదు. వారేమీ చెప్పలేదు.
డిప్యూటీ చైర్మన్: అది వారిష్టం. నేను ఓటింగ్ పెట్టేస్తున్నాను.
వెంకయ్య నాయుడు: మీరెలాగైనా చెప్పవచ్చు కానీ...
డిప్యూటీ చైర్మన్: నేనెలాగైనా చెయ్యటం లేదు. అనవసర ఆరోపణలు చేయవద్దు.
వెంకయ్య నాయుడు: నేను ఆరోపణ చేయటం లేదు. అపాయింట్‌మెంట్ రోజు నుంచి బడ్జెట్ అయ్యే లోపు ‘గాప్’ (లోటు) ఎలా భర్తీ చేస్తారో ప్రధాన మంత్రి లేదా హోం మంత్రిని వివరించమనండి.
రవిశంకర్ ప్రసాద్: జైరాం రమేష్ గారూ! మీరు వివరించవచ్చుగదా...
డిప్యూటీ చైర్మన్: మంత్రిగారూ... వినండి.
హోంమంత్రి: సార్, ఎప్పాయింటెడ్ డే, ఉద్యోగ ఆర్థిక ఆస్తుల, అప్పుల పంపకాల విషయమై జరగవలసిన ముందస్తు ఏర్పాట్లన్నీ జరిగాకనే ఉండేలా ఫిక్స్ చేస్తామని ఇప్పటికే ప్రధాన మంత్రి ప్రకటించారు.
ఇక కొత్త రాష్ట్రం మొదటి సంవత్సరం ఎదురయ్యే అంశాలు, ప్రధానంగా అప్పాయింటెడ్ డేకి 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే రోజుకి మధ్యన ఎదురయ్యే లోటు, 2014-15 బడ్జెట్‌లో పెడ్తారు.
డిప్యూటీ చైర్మన్: ఒకే, సరేనా వెంకయ్య నాయుడు గారూ! ఇంకా సవరణకు పట్టుబడతారా?!
వెంకయ్య నాయుడు: పట్టుబడతాను. నేనడిగేది అదే... అప్పాయింటెడ్ డేకీ బడ్జెట్‌కీ మధ్య సమయం గురించే...
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారూ... ఆయన వివరించారు గదా.
వెంకయ్య నాయుడు: జైరాంగారు చెప్తారట. చెప్పనివ్వండి.
డిప్యూటీ చైర్మన్: ఒకే, జైరాం రమేష్.
వెంకయ్య నాయుడు: ఎందుకు మీరంత తొందర పడుతున్నారు.
డిప్యూటీ చైర్మన్: నేను తొందరేమీ పడటం లేదు.
జైరాం రమేష్: గౌరవ సభ్యుని సంశయం... ప్రకటిత తేదీ ఒకటి (నోటీసు రోజు), నిర్ణీతమైన తేదీ రోజు (అప్పాయింటెడ్ డే) ఒకటి ఉన్నాయి. మేమింకా అప్పాయింటెడ్ రోజును నిర్ణయించలేదు. ఏ రోజుగా నిర్ణయం జరిగినా, మొదటి సంవత్సరం అంతరం (గ్యాప్) ఉన్నట్లయితే, ఆ లోటు భర్తీ చేయబడుతుంది. ‘‘భర్తీ చేయబడుతుంది’’ అన్నాం. లోటు భర్తీ అంటే, ఏదైతే గ్యాప్ (తేడా) ఉందో, అది బడ్జెట్‌లో సమానం చేయబడుతుంది. ‘పరిహారం’ అంటే అర్థమదే! ఫైనాన్స్ బిల్లు పాస్ అయింది. ఇన్‌టర్మ్ బడ్జెట్ కూడా అయి పోయింది. ఇన్‌టర్మ్ బడ్జెట్‌లో మేము ఏమీ చెయ్య టానికి లేదు. అందుకే నోటిఫైడ్ రోజుకి అప్పాయింటెడ్ రోజుకి మధ్య రోజుల కోసం ఏర్పాటు చేశాం. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ మధ్య సమయం మూడు నెలలు పట్టింది. నేనిప్పుడు రెండా, మూడా, నాలుగు నెలలా చెప్పలేను. కానీ ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ‘గ్యాప్’ లేకుండా ఉండేలా ‘అప్పాయింటెడ్ డే’ ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి చెప్పడం జరిగింది.
వెంకయ్యనాయుడు: నేనొక పరిష్కారం చెప్తాను. అంటే ఆ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి డబ్బు వాడుకుంటారనేగా అర్థం.. జైరాం గారూ!
జైరాం రమేష్: అప్పాయింటెడ్ డే వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే కొనసాగుతుంది. ఎప్పాయింటెడ్ డే నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుంటాయి.
డిప్యూటీ చైర్మన్: ఇంకా పట్టుబడతారా వెంకయ్య గారూ!
వెంకయ్య నాయుడు: ఇప్పుడక్కర్లేదు.
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారు ఉపసంహరించుకున్నారు.
క్లాజ్ 46, 47, 48 బిల్లులో కలపబడ్డాయి.
క్లాజ్ 90 పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు
క్లాజ్ 90కి 6 సవరణలు ప్రతిపాదించారు. దేవేందర్‌గౌడ్ 2, 3 ఉపసంహరించుకున్నారు. రబీ నారాయణ మహాపాత్రో వైష్ణవ్ పరీడా 13, 14 వెంకయ్య నాయుడు 18, 19.
మహాపాత్రో: పేజీ 24లో 28, 34, 35 లైన్లు తీసే యాలి.
డిప్యూటీ చైర్మన్: మహాపాత్రోగారి సవరణలు సభ ముందు ఉంచుతున్నాను.
రాజీవి (కేరళ): సార్, ఆయన ఓటింగ్ జరగాలంటున్నారు.
డిప్యూటీ చైర్మన్: సభ ఇలాగుంటే ఓటింగ్ ఎలా జరపగలం... అసాధ్యం.
Advertisement
Advertisement