పోలవరం బహుళార్థ సాధకం
Published Wed, Dec 2 2015 9:00 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
పార్లమెంట్‌లో ఏం జరిగింది -30
విభజన బిల్లుపై 20-02- 2014 న రాజ్యసభలో చర్చ కొనసాగింపు.
ప్రొ. రాంగోపాల్ యాదవ్: సార్, ఓటింగ్ జరగడమే సాధ్యం కానప్పుడు, బిల్లు ఎందుకు పాస్ చేయిస్తున్నారు.
డిప్యూటీ చైర్మన్: ఓటింగ్ సాధ్యం కాదు... సాధ్యం కాదు... సభ్యుల్ని వాళ్ల స్థానాలకి తీసుకెళ్లండి... అందరూ ఎవరి స్థానాల్లో వాళ్లున్నారని మీరు చెప్పగలిగితే, నేను ఓటింగ్ పెడ్తాను. రూల్ ప్రకారం ఇలా ఉంటే ఓటింగ్ పెట్టలేం.
రాజీవి: మీరెందుకు ఒకే సభ్యుడికి మూడుసార్లు అవకాశమిస్తున్నారు. మిగతా వారెవరికీ ఎందుకు ఇవ్వటం లేదు?
డిప్యూటీ చైర్మన్: ఎవరికీ ఇవ్వకుండా లేను.
రాజీవి: ఈయన సవరణలు పెడ్తానంటున్నాడు.
డిప్యూటీ చైర్మన్: ఏమిటీ అడుగుతున్నారు?
రాజీవి: ఒకే సభ్యుడికి మూడు ఛాన్స్‌లు ఇచ్చారు.
డిప్యూటీ చైర్మన్: మీరేమంటున్నారు రాజీవిగారూ!
రాజీవి: ఈయన సవరణలు పెడ్తారట.
డిప్యూటీ చైర్మన్: మాట్లాడతారా?
రాజీవి: అవును.
డిప్యూటీ చైర్మన్: మాట్లాడమనండి. నేను పిలిచాను. వారు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడమనండి.
బెష్ణవ పరీదా: కాదు. కాదు మేం కొన్ని విషయాలు అడగాలి.
డిప్యూటీ చైర్మన్: మహాపాత్రోగారూ! ఏం చెప్తారు.
ఏచూరి: సార్, అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది.
డిప్యూటీ చైర్మన్: లేదు లేదు.
ఏచూరి: మీరిందులో భాగస్వాములు కావొద్దు.
డిప్యూటీ చైర్మన్: కానేకాదు, మ్యాచ్ ఫిక్సింగ్ - నాకు తెలిసి అలాంటిదేమీ లేదు. నేను రూల్ ప్రకారం నడుచుకుంటున్నాను. చెప్పండి మహాపాత్రోగారూ!
మహాపాత్రో: సార్, 90(1) పోలవరం ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టు గా ప్రకటించారు. గోదావరి నది ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాలతో అనుసంధానమై ఉంది.
డిప్యూటీ చైర్మన్: మీ సవరణల గురించి మాట్లాడుతున్నారా?
మహాపాత్రో: అవును, సవరణలు గురించే మాట్లాడుతున్నా.
డిప్యూటీ చైర్మన్: సరే, గవర్నమెంట్ ఏం చెయ్యాలని మీరనుకుంటున్నారో, ఆ విషయం చెప్పండి.
మహాపాత్రో: అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఎందుకు పట్టుబడుతోంది.. ఒడిశాలో గ్రామస్తులు బాధలు పడతారు. ప్రభుత్వానికి ఏమిటి సమస్య.
డిప్యూటీ చైర్మన్: ఓకే.
మహాపాత్రో: నాకు స్పష్టమైన సమాధానం కావాలి.
డిప్యూటీ చైర్మన్: జైరాం రమేష్ సమాధానం చెప్తారు.
జైరాం రమేష్: మీ సవరణల విషయమై, వెంకయ్య నాయుడు గారివి, మావి, సవరణల విషయమై నేను వివరిస్తాను. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్. వెంకయ్యగారూ! బిల్లులో ‘ఇరిగేషన్ ప్రాజెక్ట్’ అని ఉన్నా, విశాఖపట్నానికి తాగునీరు, గోదావరి డెల్టాకి సాగునీరు, గోదావరి నుంచి కృష్ణలోకి మళ్లింపు... అందుకే దీనిని నేషనల్ ప్రాజెక్ట్‌గా ప్రకటించాం. దీనిలో విద్యుత్ ఉత్పత్తి కూడా ఉంది. 30 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. మధ్య ప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు తమ ఆమోదం కూడా తెలిపాయి. తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, ఒడిశాలోని రత్నగిరి (మల్కనగిరి) జిల్లాలలో గ్రామాల ముంపు విషయమై...
డిప్యూటీ చైర్మన్: బాలగోపాల్ గారూ!
జైరాం రమేష్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. అది ప్రశ్నేకాదు. భారత ప్రభుత్వం పోలవరం పూర్తి చేయటానికి కట్టుబడి ఉంది.
డిప్యూటీ చైర్మన్: ఓకే.
జైరాం రమేష్: ఆర్ అండ్ ఆర్ ముంపు గ్రామాలకు పూర్తిగా వర్తింపజేస్తూ పర్యావరణ, అటవీ చట్టాలన్నిటినీ అమలు చేస్తూ...
డిప్యూటీ చైర్మన్: మహాపాత్రో, పరీడా గారి సవరణలు ఓటింగ్‌కు పెడ్తున్నా, సవరణలు తిరస్కరించారు.
పరీడా: అయ్యా! మేము వాకౌట్ చేస్తున్నాం. (వెళ్లిపోయారు)
డిప్యూటీ చైర్మన్: చెప్పండి వెంకయ్యనాయుడు.
వెంకయ్య నాయుడు: నేను సవరణల విషయమై ఒత్తిడి చేయను. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందాను.
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారు సంతృప్తి చెందారు. క్లాజ్ 90 ఓటింగ్‌కు పెడుతున్నా.
క్లాజ్ 90 బిల్లులో భాగమయ్యింది.
డిప్యూటీ చైర్మన్: క్లాజ్ 93 వెంకయ్యగారూ! మీ సవరణ ఉంది.
వెంకయ్య నాయుడు: నేను ఉపసంహరిస్తున్నా.
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారు ఒత్తిడి లేదు. 93 ఓటింగ్ పెడుతున్నా. క్లాజ్ 93 బిల్లులో భాగమయ్యింది.
క్లాజ్ 94-108 వరకూ షెడ్యూల్ 1 నుంచి 10వ షెడ్యూల్ వరకూ బిల్లులో కలపబడ్డాయి.
డిప్యూటీ చైర్మన్: పదకొండవ షెడ్యూల్... వెంకయ్యనాయుడు గారూ! మీ సవరణ 21 ఉంది. పట్టుబడతారా?
వెంకయ్యనాయుడు: సార్, దుమ్ముగూడెం- నాగా ర్జునసాగర్ టైల్ పాండ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు అవసరమయిన ప్రాజెక్టు. 2009లో శాంక్షన్ అయిన ఈ ప్రాజెక్టు మీద ఇప్పటికే రూ. 695 కోట్లు ఖర్చు చేశారు. కాని ఆ ప్రస్తావనే ఇక్కడ లేదు. అది పూర్తి చేస్తామని ప్రభుత్వం మాటివ్వాలి.
డిప్యూటీ చైర్మన్: జైరాం రమేష్‌గారూ! ఇప్పటికే డబ్బు కూడా ఖర్చు పెట్టారు.
జైరాం రమేష్: పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆమోదించాం... ఇంకా కొన్ని సాంకేతిక వివరాలు కావాలి. గవర్నమెంట్‌కి కొంత సమయమిస్తే, నిర్ణయం తీసుకుంటాం.
వెంకయ్యనాయుడు: టెండర్లు పిలిచారు. పనులవుతున్నాయి. మీ ప్రభుత్వమే టెండర్లు పిలిచింది.
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com
Advertisement
Advertisement