పార్లమెంట్‌లో ఏం జరిగింది-32
రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో 20.02.2014 న జరిగిన చర్చకు సంబంధించిన చివరి భాగమిది. బిల్లు ఆమోదంతో చర్చ ముగిసింది.
ఏచూరి: మాకు బిల్లు మీద ఓటింగ్ కావాలి.
డిప్యూటీ చైర్మన్: ఏచూరిగారూ మీరు సభని...
తపన్ కుమార్: ఓటింగ్ చెయ్యటం కష్టం కాదు.
ఏచూరి: సార్, ఓటింగ్ జరపటం కష్టమేమీ కాదు.
డిప్యూటీ చైర్మన్: నేను రూల్ ప్రకారం నడవాలి.
తపన్: సభ కంట్రోల్‌లోనే ఉంది. ఇప్పుడు ఓటింగ్ జరిపించండి.
డిప్యూటీ చైర్మన్: వెల్‌లో సభ్యులుండగా ఓటింగ్‌కు రూల్స్ అనుమతించవు. వాళ్లని వెనక్కి పిలవండి.
తపన్: సర్, సభ ఆర్డర్‌లోనే ఉంది. ఓటింగ్ జరిపించండి.
డిప్యూటీ చైర్మన్: నేను చెప్పేది వినండి. నా ఆర్డర్ వినండి.
తపన్: సభ బాగానే ఉందిగా... డివిజన్ పెట్టండి.
డిప్యూటీ చైర్మన్: డివిజన్‌కి అభ్యంతరం లేదు. కానీ ‘వెల్’లో సభ్యులుండగా ఓటింగ్ జరపకూడదనేది రూల్.
ఏచూరి: అది మీ బాధ్యత సార్!
డిప్యూటీ చైర్మన్: నేను ‘డివిజన్’ చెయ్యలేను.
తపన్: సభ ఆర్డర్‌లోనే ఉంది సార్.
డిప్యూటీ చైర్మన్: నేను రూల్ ప్రకారం నడవాలి. బాధ్యత నాకే కాదు, సభ్యులకీ ఉంది. మీమీ సీట్లకి వెళ్లండి. మీ మిత్రులకి చెప్పి వెనక్కి పిలవండి. నేను నిస్సహాయుణ్ణి. (సమయం 8.05)
వెంకయ్య నాయుడు: మీరు బిల్ పాస్ చెయ్యాలనుకుంటున్నారు. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీతో చేయి చేయీ కలిపిన వారు, కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నవారు, నినాదాలిస్తే నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏమిటంటే మేము పూర్తిగా సంతృప్తి చెందక పోయినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలూ దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తున్న ఆఖరి ఘడియల్లో, ప్రజల సెంటిమెంట్ గౌరవించే విధంగా... సీమాంధ్రకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము నమ్ముతూ బిల్లుకు మద్దతిస్తున్నాం.
ఏచూరి: సభలో ఆర్డర్ తీసుకు రండి. సభ్యుల ప్రజాస్వామ్య హక్కు నిలబెట్టండి. అధ్యక్ష స్థానంలో ఉన్న వారి బాధ్యత అది.
డిప్యూటీ చైర్మన్: చాలా ప్రయత్నించాను. తప్పు నాది అనకండి.
ఏచూరి: మీరు గనక డివిజన్ చెయ్యకపోతే, నిరసనగా మేము వాకౌట్ చెయ్యదల్చాం. ఈ వాకౌట్ ‘అప్రజాస్వామ్య పద్ధతికి నిరసనగా’ అని రిజిస్టర్ అవ్వాలి.
డిప్యూటీ చైర్మన్: ‘వెల్’లో సభ్యులుండగా డివిజన్ ఎలా చెయ్యను.
ఏచూరి: ఇది చాలా అప్రజాస్వామికం.
రాంగోపాల్ యాదవ్: డివిజన్ లేనందున నిరసనగా మేం వాకౌట్ చేస్తున్నాం.
డిప్యూటీ చైర్మన్: గౌ॥మంత్రిగారు ప్రతిపాదించారు. బిల్లు పాసయ్యింది. సభ రేపు ఉదయం 11 గంటల వరకూ వాయిదా పడింది.
(20-2-2014 గురువారం రాత్రి 8.07 నిమిషాలకు సభ ముగిసింది)
రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన తతంగం అంతా ‘పుస్తకరూపంలో’ అందించాను. ఎలాంటి ఓటింగూ లేకుండానే లోక్‌సభలో బిల్లు పాసయినట్లు ప్రకటించడం... రాజ్యసభలో సభ్యులు తమ తమ స్థానాల్లో లేకుండానే ‘మెజారిటీ’ సభ్యుల అభిప్రాయం ఓటు ద్వారా తెలుసు కోకుండానే బిల్లు పాసయినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రణబ్ ముఖర్జీగారి ముందు రాజ్యాంగ సంబంధమైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. నేను లేవనెత్తిన ప్రశ్నలకు, ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికలో, జైపాల్‌రెడ్డి, దిగ్విజయ్‌సింగ్ మాట్లాడిన మాటల్లో సమాధానం దొరికింది. వారి మాటల్ని కూడా రాజ్యాంగాధినేత ప్రణబ్ ముఖర్జీ గారికి పంపాను. ఆ లేఖ అనువాదం ఇదీ...
అత్యంత గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి,
పార్లమెంటులో 18.2.2014 న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాజ్యాంగ బద్ధంగా ఆమోదించబడిందా.. మన రాజ్యాంగ నిర్మాతలు పాటించిన విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగానే విభజన బిల్లును ఆమోదించారా అనే అంశంపై వాస్తవాలను మీరు నిర్ధారించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ 7-10-2015 న మీకు రాసిన లేఖలోని అంశాలను బలపర్చేలా మళ్లీ ఈ లేఖను రాసి మీకు పంపుతున్నాను. ఈ సందర్భంగా 18.11.2015 న మాజీ కేంద్రమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ జైపాల్‌రెడ్డి గారు ఒక ‘ప్రెస్-మీట్’లో మాట్లాడిన మాటల ఇంగ్లీష్ అనువాదం మీకు పంపుతున్నాను (తెలుగులో వారన్న మాటలు యథాతథంగా జతపరుస్తున్నాను)
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాసయ్యిన తీరును వారు మీడియా వారికి వివరిస్తూ 18.2. 2014 నాడు లోక్‌సభ స్పీకర్ ఛాంబర్లో తాను, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మాస్వరాజ్, స్పీకర్ శ్రీమతి మీరాకుమార్ భేటీ అయినప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటిగంట వరకూ, ఏం జరిగిందో చెప్పారు. పై ముగ్గురూ, తన (జైపాల్‌రెడ్డిగారి) ప్రోద్బలంతో, కుట్రపన్ని, రాజ్యాంగాన్ని, నిబంధనలనూ పక్కకు నెట్టి ‘బిల్లు’ ఆమోదింపచేశారంటూ అన్ని సందేహాలకూ సమాధానంగా ఆయన వివరించారు. ఆ సమయంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరూ అక్కడే ఉన్నారని ధృవీకరించారు.
జైపాల్ రెడ్డి వివరణను, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా బలపర్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ స్పీకర్ మీరాకుమార్‌ల వల్లనే తెలంగాణ రాష్ట్రమొచ్చిందని, ఆయన బహిరంగసభలో అన్న మాటలు కూడా మీకు పంపిస్తున్నాను. అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో రాజ్యాంగాధి నేత అయిన మీరు తగుచర్యలు తీసుకోవాలని, జరిగిన చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలను క్రమబద్ధీకరించి పార్లమెంట్ గౌరవాన్ని మర్యాదను కాపాడ తారని నమ్ముతూ...
మీ ఉండవల్లి అరుణ్‌కుమార్ 26.11.2015
బహిరంగ సభలో దిగ్విజయ్ సింగ్ ప్రసంగం: సోదర సోదరీమణులైన వరంగల్ ఓటర్లను నేను ప్రశ్నించద ల్చుకున్నదేమిటంటే, 544 మంది సభ్యులున్న పార్లమెంటులో తెలంగాణను సాధించడం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి సాధ్యమేనా? అలాంటప్పుడు మీకు తెలంగాణను సాధించి పెట్టింది ఎవరు? సోనియా గాంధీ మీకు తెలంగాణను ప్రసాదించారు. డాక్టర్ మన్మోహన్‌సింగ్ మీకు తెలంగాణను ఇచ్చారు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్న మీరా కుమార్ గారు.. ఈమే మీకు తెలంగాణను సాధించిపెట్టారు.
జైపాల్‌రెడ్డి ప్రెస్‌మీట్: జాతీయ పార్టీలు సపోర్టు చేసినందునే ఈ బిల్లు పాసయ్యింది. సీమాంధ్ర ఎంపీలందరూ కూడా, కారాలు మిరియాలతో సహా లోక్‌సభలో యుద్ధం చేసినా, జాతీయ పార్టీ ఎంపీలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిలబడ్డారు. సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు దాదాపు నూరుమంది కాంగ్రెస్ ఎంపీలు నిలబడ్డారు... యుద్ధం చేశారు. మరొక్క విషయం... ఈ తెలంగాణ బిల్లు పాస్ చేసే క్రమంలో అన్నిటికంటే ముఖ్యమైన, కీలకమైన దినం ఏమిటయ్యా... 18 ఫిబ్రవరి 2014... 18 ఫిబ్రవరి 2014 నాడు బిల్లు పాసయ్యింది. 12 గంటలకు లోక్‌సభ ఎడ్జర్న్ అయిపోయింది. నడవలేదు... ఇక బిల్లు రాదనుకున్నారు. నిజానికి 12 ‘0’ క్లాక్ తర్వాత లోక్‌సభలో వచ్చేది... దీని తర్వాత బడ్జెట్. మా చిదంబరం గారు బడ్జెట్ పేపర్స్‌తో సహా వచ్చేశాడు. అప్పుడు పొన్నం ప్రభాకర్‌గారు నన్ను తీసుకెళ్లాడు స్పీకర్ దగ్గరికి. స్పీకర్ రూంలో జరిగిన విషయాలు సున్నితమైనవి కాబట్టి, నా ఎన్నికలో నేను ఓడిపోయాను తప్ప, విషయాలు బైట పెట్టలేదు. ఎందుకంటే నేను దాదాపు అర్ధశతాబ్దం, రాజ్యాంగ మర్యాదలు కొంత వరకూ పాటించిన వాడిని.
అప్పటికే మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ అక్కడున్నారు. సుష్మాస్వరాజ్ గారిని పొన్నం ప్రభాకరే కాళ్లు పట్టుకుని తోడుకొచ్చాడు. సుష్మా స్వరాజ్ మధ్య మరియూ మా మంత్రి కమల్‌నాథ్‌ల మధ్య సయోధ్య కుదరలేదు. నే వెళ్లిన తర్వాత స్పీకర్ సమక్షంలో స్పీకర్ ఛాంబర్‌లో సయోధ్య ఏర్పాటు చేశాను. ఏ రూల్ కింద ఈ బిల్లు పాస్ చేయవచ్చునో చూపెట్టాను. ఆ 12 నుంచి 1 ‘0’ క్లాక్, స్పీకర్ ఛాంబర్లో జరిగినటువంటి చర్చ, తద్వారా వచ్చిన నిర్ణయం ద్వారానే బిల్లు పాసయ్యింది. 18 ఫిబ్రవరి నాడు బిల్లు పాస్ కాకపోతే, తెలంగాణ రాష్ట్రం అంటూ ఉండేది కాదు... అయ్యేది కాదు.
- ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com