కాళ్లు పట్టుకున్నారా.. ఎందుకు? | andhra-pradesh-bifurcation-bill | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకున్నారా.. ఎందుకు?

Published Tue, Dec 8 2015 8:57 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

కాళ్లు పట్టుకున్నారా.. ఎందుకు? - Sakshi

కాళ్లు పట్టుకున్నారా.. ఎందుకు?

 పార్లమెంటులో ఏం జరిగింది-33
 
‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వాల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది?
 
ఇప్పటి వరకూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు  ‘పాస్’ అవ్వటం, అనే ‘ప్రహసనం’ పరిశీలించాం! ఉభయ సభల్లో జరిగిన సంఘటనలు యథాతథంగా అనువదించి మీ ముందుంచటమే జరిగింది తప్ప, ఎందుకలా జరిగింది అనే వివరాలలోకి వెళ్లలేదు. ఇప్పటిదాకా నా ‘ఆర్టికల్స్’ చదివిన వారు, ‘ఏం జరిగిందో రాశారు గాని, ఎందుకలా జరిగిందో కూడా రాయాలిగదా!’ అని అడిగారు. నిజమే... ‘ఎందుకిలా జరిగింది?!’ ‘డివిజన్’ చేసి, లోక్‌సభలో ఎంతమంది ఈ బిల్లుకు అనుకూలం, ఎంతమంది వ్యతిరేకం ‘ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ రికార్డింగ్ ద్వారా నిర్ణయించటానికి అభ్యంతరం ఏమిటి? అనవసరంగా డివిజన్ అడుగుతున్నారని భావించినప్పుడు ‘‘రూల్ 367(3) ప్రొవిజో’’ స్పీకర్‌ గారు ఉపయోగించి బిల్లు పాసయిపోయిందనిపించివచ్చు, అనే సలహా జైపాల్‌రెడ్డి గారు చెప్పినట్లు, వారిచ్చిందేనా!
 
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కలిపితే, బిల్లు ‘పాస్’ చేయించగలిగినంత మంది సభ్యుల సంఖ్యా బలమున్నప్పుడు, బిల్లును పక్కన పెట్టేసే పరిస్థితి ఎందుకొచ్చింది?
 
లోక్‌సభలో సాక్షాత్తూ కేంద్రమంత్రులే ‘స్పీకర్ వెల్’లో నినాదాలు ఇస్తున్నా, తలలు లెక్కపెట్టినట్లు, బిల్లు పాసయినట్లు ‘కథ’ నడిపిన నేపథ్యంలో, సభలో ఆర్డర్ లేదు కాబట్టి ‘డివిజన్’ చేయటానికి ‘రూల్స్’ ఒప్పుకోవంటూ రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ రూలింగ్ ఇచ్చి తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి?
 
అసలు స్పీకర్ ‘డివిజన్’ చెయ్యను అన్నప్పుడు, సభలో ఏ పార్టీ వారూ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవటానికి కారణం ఏమిటి?
తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు ‘సౌగత్‌రాయ్’ ఒక్కరే తప్ప, మిగతా పార్టీలన్నీ ‘వెల్’లోనే ఉన్నాయా!?
లోక్‌సభలోని కాంగ్రెస్ సభ్యులలో పదకొండు మంది, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, పార్ల మెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, స్పీకర్ మీరాకుమార్... గంటసేపు స్పీకర్ చాంబర్లో ‘చర్చ’ జరిపిన ఫలితమే తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం...అన్న జైపాల్ రెడ్డిగారి మాటల్లో అర్థమేంటి?
 
పెపైచ్చు, సుష్మాస్వరాజ్‌ గారి ‘కాళ్లుపట్టుకుని’ తీసుకొచ్చాం- అన్నారు.
‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వా ల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది?
 
ఆర్టికల్ 3 ప్రకారం, అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలే తప్ప, ఆ అభిప్రాయం ప్రకారం నడవాలి అని ఎక్కడా లేదు,  కాబట్టి, అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంట్ ‘పాస్’ చేసేయవచ్చు... అనే వాదననే వ్యతిరేకిస్తూ వచ్చాం! సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలోని వాదన కూడా ప్రధానంగా ఇదే!!
 
‘‘పార్లమెంట్‌లో మెజార్టీ లేకపోయినా బిల్లు ‘పాస్’ చేసేయవచ్చు’’ అనే విధానం మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా వినలేదు. అసలు నిజంగా, లోక్‌సభలో మెజార్టీ లేక బిల్లు పక్కన పెట్టేద్దాం అనుకున్నారా?!
 
ఎవరైనా నాలాంటి మామూలు మనిషి ఈ మాటలని ఉంటే, అదేం పట్టించుకోనవసరం లేదు! కానీ ఈ మాటలన్నది సాక్షాత్తూ జైపాల్ రెడ్డి!!
ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా దృష్టిలో జైపాల్‌రెడ్డిగారొక మేధావి. ఎన్‌సైక్లోపీడియా లాంటి వారు. భారత రాజకీయాలలో ‘అజాతశత్రువు’ అని పిలవొచ్చు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కూడా! ఆచితూచి మాట్లాడటం ఆయన నైజం. ఎన్నికల్లో గెలవటం కోసమో, ప్రయోజనాలను ఆశించో, ఏది పడితే అది మాట్లాడే సగటు పొలిటీషియన్ మాత్రం కారు!! అటువంటి జైపాల్‌రెడ్డి గారు అన్నమాటల్ని బట్టి విశ్లేషిస్తే... ఫిబ్రవరి 18, 2014 నాడు లోక్‌సభలో జరిగింది సీమాంధ్రకు ద్రోహం కాదు, దేశ రాజకీయ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలకే ద్రోహం...
 
ఇక్కడ నుంచి నేను రాయబోయేది విశ్లేషణ మాత్రమే. అంటే ఒక ‘సంఘటన’ విషయమై నాకేర్పడిన అభిప్రాయం!
 
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’’ అనే ఒక చరిత్రాత్మక సంఘటన, పూర్వాపరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హైద్రాబాద్ అనే ఒక రాజ్యం ఇండియాలో విలీనమైనప్పటి నుంచి, 1953 లో కర్నూలు రాజధానిగా, ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి... హైద్రాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతాన్నీ ఆంధ్ర రాష్ట్రాన్నీ కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏర్పరచినప్పటి నుంచి.. 1969 ప్రత్యేక తెలంగాణ, 72 నాటి ప్రత్యేకాంధ్ర ఉద్యమాలు, 2000లో మూడు రాష్ట్రాల ఏర్పాటు, 2001లో మళ్లీ, తెలంగాణ విభజన డిమాండ్, టీఆర్‌ఎస్ ఏర్పాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, 2009 చిదంబరం ప్రకటన, శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు... వగైరా. వగైరా సంఘటనలన్నీ అతి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తా!
 
ఇప్పటి వరకూ ‘‘పార్లమెంట్‌లో ఏం జరిగింది’’ అనే ఆర్టికల్స్ శ్రద్ధగా చదివి నాకు ఈ-మెయిల్స్ పంపిన వారందరికీ నా అభినందనలు. ముందే చెప్పాను... ఇదంతా ఆసక్తిగా చదవగలిగే ‘నవల’ కాదు. ‘బోరు’ కొట్టే అవకాశం కూడా ఉంటుందని... అయినా ఇంత మంది చదువుతున్నారనేది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామం.
 
- ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు:
a_vundavalli@yahoo.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement