హైదరాబాద్ : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో ఊహా జనితాలు రాశారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్ చాంబర్లో జరిగిన చర్చపై ఉండవల్లి కట్టుకథ రాశారని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని సుష్మాస్వరాజ్ చెప్పారని, నిబంధనల ప్రకారమే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్నారు. సభలో ప్రత్యక్ష ప్రసారాలు ఆపాలని తాను సలహా ఇవ్వలేదని, పెప్పర్ స్ర్పే కొట్టినందునే ప్రసారాలు నిలిపివేసి ఉంటారన్నారు. ‘తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలుగా .. ఉండవల్లి అరుణ్ కుమార్ తన విభజన కథనంలో.. చెప్పిన అంశాలపై క్లారిటీ ఇవ్వదలిచాం.
ఉండవల్లి తన పుస్తకంలో నా గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు. అయితే స్పీకర్ ఛాంబర్ లో జరిగిన చర్చపై ఉండవల్లి ఉహాజనిత కట్టుకథ రాశారు. అర్ధం,ఆధారం లేకుండా ఊహించి ఎలా రాస్తారు?. తెలంగాణా వచ్చిందనే నైరాశ్యం,నిస్పృహలో ఇలా కొంత కట్టుకథ రాసారు. రాష్ట్ర విభజనలో తెలంగాణా ఎంపీలు, జైపాల్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందని ఉండవల్లి రాశారు. అవును అప్పుడు మేము నిర్ణయాత్మక పాత్ర పోషించాం. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సుస్మా స్వరాజ్ ను ప్రాధేయ పడ్డారు. దాంతో ఆమె స్పీకర్ ఛాంబర్ కు వచ్చి నాతో చర్చించారు.
స్పీకర్ ఛాంబర్ లో ఆనాడు ఏం జరిగిందో మాకు తెలుసు. సాక్షులము మేమే. బిల్లు పెడితే ఫ్లోర్ లీడర్గా తాను మద్దతు ఇస్తా అని సుష్మ చెప్పారు. స్పీకర్ ఛాంబర్ లో సుష్మా స్వరాజ్కు, మాకు ఒక ఒప్పందం జరిగింది. హౌస్ ఆర్డర్ లో లేనందున బిల్లు ఎలా పెట్టాలని స్పీకర్ అడిగితే.. స్పీకర్ కు నచ్చజెప్పింది నేనే. హౌస్లో సభ్యుల మెజారిటీ ఉన్నందున బిల్లు పెట్టమని స్పీకర్ ను కోరాం.
ఓటింగ్ జరిపే పరిస్థితి లేనప్పుడు.. సభ్యులు కూర్చున్న చోటు నుంచే నిలబడి అభిప్రాయాలు చెప్పే రూల్ ఉంది. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు సుష్మా ఇతర బీజేపీ సభ్యులు, ఎల్‌కే అద్వానీ కూడా స్వయంగా లేచారు. బిల్లు ప్రవేశపెట్టిన రోజున స్పీకర్ ఛాంబర్ లో ఏం జరిగిందో ఉండవల్లి కి తెలియవు. ఉహించి రాయటానికి ఆయనకేమన్నా దివ్యదృష్టి ఉందా. కథలు చెప్తే సుష్మ ఎందుకు వింటారు.
కథ సాక్షిగా ఉండాలి తప్ప ఊహకు అందకుండా కట్టు కథ రాస్తే ఎలా. బిల్లు రాజ్యాంగ సమ్మతంగా లోకసభ లో ఆమోదం పొందింది, నిబంధనల మేరకే బిల్లు ఆమోదం పొందింది. దీనిపై సుప్రీంకోర్టు లో ఉన్న కేసును గెలుస్తాం. బిల్లు సంబంధించి సుప్రీంకోర్టు లో కేసు ఇంకా పెండింగ్ ఉంది. కేసీఆర్ కు కూడా స్పీకర్ చాంబర్ లో ఏం జరిగిందో తెలియదు.
హౌస్ లో స్పీకర్ ప్రకటన చేసే వరకు అందరిలో బిల్లు పై ప్రతిష్టంభన ఉంది. కుట్ర, కుతంత్రం అని రాశారు. తెలంగాణాకు సీఎం ఎవరు అవుతారనేది ప్రధానం కాదు. తెలంగాణా రావటం ముఖ్యం అని భావించాం. పొన్నం ప్రభాకర్.. సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్నారు. దీన్ని కూడా ఉండవల్లి వ్యంగ్యగా రాసారు. హౌస్ ప్రసారాల్ని ఆపమని నేను సలహా చెప్పలేదు.
స్పీకర్ వివేచన పై ఆధారపడి ఉంది. ప్రసారాలు నిలిపి వేయటానికి బిల్లు ఆమోదింపజేయటానికి ఎలాంటి సంబంధం లేదు. పెప్పర్ స్ప్రే కొట్టినందున.. ప్రసారాలు నిలిపివేసి ఉంటారని భావిస్తున్నాను.’ అని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ 'విభజన కథ నా డైరీలో కొన్ని పేజీలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
అవన్నీ కట్టుకథలు: జైపాల్ రెడ్డి
Published Wed, Sep 21 2016 1:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
Advertisement
Advertisement