సీమాంధ్రకు హామీలను అమలు చేయండి
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి వెంకయ్య విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోని 13వ షెడ్యూల్‌లోని అంశాలపై ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇచ్చిన హామీలను ప్రణాళికా సంఘం, కేబినెట్ ఆమోదించాలని, ఈ ప్రక్రియంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జరగాలని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో 20వ తేదీన సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీల పత్రాన్ని జతపరుస్తూ వినతి పత్రాన్ని అందచేశారు.
బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి వెంకయ్య నాయుడు గురువారం మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలిసి హామీల అమలుపై చర్చించారు. అనంతరం తన నివాసంలో వెంకయ్య మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, ఇతర ప్రస్తావిత ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళిక సంఘం, కేబినెట్ ఆమోదం తీసుకోడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరామన్నారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని తెప్పిస్తున్నట్టు అహ్లువాలియా చెప్పారన్నారు. పనులన్నీ సూత్రప్రాయంగా ఆమోదిస్తే మా ప్రభుత్వం వచ్చాక మందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇంకా వెంకయ్య ఏమన్నారంటే..
ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రలో పది, పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ మొహం చూపించే పరిస్థితి లేదు. జన్మలో కాంగ్రెస్‌ను క్షమించరు.
సీమాంధ్రలో జనం బాధ ఆరలేదు. అప్పుడే విశాఖ, తిరుపతి, కర్నూలు.. ఇలా రాజధాని కోసం సంతకాల సేకరణ మొదలు పెట్టారు. దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
సోనియా వల్లే ప్రత్యేక హోదా అని జైరాం అంటారు. సోనియా ఇవ్వదలుచుకుంటే లోక్‌సభలో బిల్లు పెట్టినప్పుడు రాహుల్, సోనియా, ప్రధాని సభకు ఎందుకు రాలేదు? సభలో చిర్చించి ఉంటే ప్రజలు నమ్మేవారు.