ఎన్నికలు వాయిదా వేయాలి | Lok sabha elections should be adjourned, says Seemandhra congress leaders | Sakshi
Sakshi News home page

ఎన్నికలు వాయిదా వేయాలి

Published Fri, Feb 21 2014 2:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM

ఎన్నికలు వాయిదా వేయాలి - Sakshi

ఎన్నికలు వాయిదా వేయాలి

ఆర్నెల్లపాటు ఆపాలని కేంద్రానికి సీమాంధ్ర కాంగ్రెస్ నేతల విన్నపాలు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడం, దానికి రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే కావడంతో భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచనలు సాగిస్తున్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని తర్జనభర్జన పడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం, ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో ఎన్నికలను ఎదుర్కొనడం సాధ్యంకాదన్న అభిప్రాయంలో సీమాంధ్ర నేతలున్నారు.
 
 అందువల్ల లోక్‌సభ ఎన్నికలు జరిగినా అసెంబ్లీ ఎన్నికలను మాత్రం కనీసం ఆరు నెలల పాటు వాయిదా వేయాలని అధిష్టానాన్ని కోరినట్టు పీసీసీ ముఖ్యనేత ఒకరు మీడియాకు వివరించారు. ఆర్నెల్లపాటు వాయిదా పడితే ఈలోగా ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలు తగ్గుముఖం పడతాయని, ఆ తరువాత కేంద్రం ఇచ్చే ప్యాకేజీలు, ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడిగేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ, రఘువీరా రెడ్డిలు కలసిన సందర్భంగా కూడా అసెంబ్లీకి ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నర గవర్నర్‌తో భేటీ అయిన వీరు రాష్ట్రపతి పాలన విధిస్తారా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశమిస్తారా? అని ఆరా తీసినట్లు తెలిసింది. కిరణ్ రాజీనామా గురించి అడగ్గా ‘దటీజ్ అండర్ కన్సిడరేషన్ (పరిశీలనలో ఉంది)’ అని గవర్నర్ ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.
 
 అంతకుమించి ఏం చేయబోతున్నారనేది నరసింహన్ వెల్లడించలేదు.  ఇలా ఉండగా ఎన్నికల వాయిదాను తెలంగాణ ప్రాంత నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన పూర్తవుతున్నందున ఇరుప్రాంతాల్లో లోక్‌సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని వారు పట్టుబడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఊపులో ఎన్నికలకు వెళితేనే మంచి ఫలితాలు వస్తాయని వారంటున్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కాకుండా ఎన్నికలు జరిగితే ఆ పార్టీకే ఎక్కువ సీట్లు వెళ్తాయని, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని వారు పేర్కొంటున్నారు. పైగా ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ టీఆర్‌ఎస్ విలీనంపై వెనకడుగు వేస్తే కాంగ్రెస్ రాజకీయంగా చాలా కోల్పోవలసి వస్తుందని వారు పార్టీ పెద్దలకు వివరించినట్టు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చెప్పారు.
 
 సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ కోరాం: బొత్స
 రాష్ట్ర సమైక్యత కోసం అన్ని ప్రయత్నాలు చేశామని, విభజన అనివార్యం కావడంతో సీమాంధ్రలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక సహకారమివ్వాలని కేంద్రాన్ని కోరామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం బొత్స మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, మంత్రుల బృందాన్ని కలసి సీమాంధ్ర సమస్యల గురించి వివరించామన్నారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని కేంద్రం అందించాలని అడిగామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement