షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: భన్వర్‌లాల్
‘సాక్షి’తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
వాయిదా ప్రచారంలో వాస్తవం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఈ ఎన్నికల తర్వాత 2019 ఎన్నికలకు ముందు చేస్తారని చె ప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను ఇటీవల సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంతృప్తి వ్యక్తం చేసినట్లు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఈఓ వెల్లడించారు.
- రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియపైన కూడా కమిషన్ సంతృప్తిని వ్యక్తం చేసింది.
- ఎన్నికల ఏర్పాట్లను మరోమారు సమీక్షించేందుకు నాతో పాటు సీఎస్, డీజీపీలతో ఈ నెల 20న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది.
- 76 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యూరు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించాం. ఒక్కో పోలింగ్ కేంద్రానికి పది మంది సిబ్బంది చొప్పున 70 వేల పోలింగ్ కేంద్రాలకు 7 లక్షల మంది సిబ్బందిని గుర్తించాం. ప్రస్తుతం రాష్ట్ర విభజన సంబంధిత పరిణామాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగుల సమ్మె గురించి కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం.
- రాష్ర్టంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలన్నీ ఏప్రిల్ 23వ తేదీకల్లా పూర్తి అవుతాయని కమిషన్‌కు చెప్పాం.
- ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఉద్యోగులు సమ్మె చేయరాదు. ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిందే.
- ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరిని బదిలీ చేసినా నిలుపుదల చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కొన్ని బదిలీలను నిలుపుదల చేస్తున్నాం.
- నిబంధనల మేరకు ఈ నెల 25లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్ ఆదేశించింది.