సెలక్ట్ కమిటీకి పంపి పెండింగ్‌లో పెడతారు!
టీ-బిల్లుపై సీమాంధ్ర మంత్రులతో సీఎం అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లులో అనేక లోపాలున్నాయని, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా దీనిపై అభ్యంతరాలు తెలిపే అవకాశాలున్నాయని, బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టి చివరకు సెలెక్టు కమిటీకి పంపి అక్కడితో పెండింగ్‌లో పెట్టే అవకాశాలు ఉన్నాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిసింది. మంత్రులు మహీధర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, అహ్మదుల్లా, పార్థసార థి, కాసు కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ తదితరులు శనివారం సాయంత్రం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘రాష్ట్ర విభజనపై బీజేపీ ఇదివరకు సానుకూలంగా ఉన్నా ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేలా సహకరించకపోవచ్చు. పైగా ఆపార్టీలోనూ ఇప్పుడు రెండు రకాల వాదనలూ గట్టిగానే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డట్లు సమాచారం. బిల్లు పార్లమెంటుకు వచ్చాక సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరదామని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.