
విభజన పనులకు సన్నద్ధం!
రాష్ట్ర విభజన బిల్లును హడావుడిగా ఆమోదింప చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో విభజన పనులను ప్రారంభింప చేసేందుకు కూడా తొందరపడుతోంది.
సీనియర్ అధికారులతో సీఎస్ సంప్రదింపులు
సాధ్యాసాధ్యాలపై అధికారగణంలో మిశ్రమ స్పందన
70 నుంచి 90 రోజుల సమయం తప్పదంటున్న అధికారులు
ఉభయ సభలు ఆమోదించిన బిల్లు సీఎస్‌కు పంపిన కేంద్రం
వారంలో విభజన పని పూర్తవుతుందా అని ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును హడావుడిగా ఆమోదింప చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో విభజన పనులను ప్రారంభింప చేసేందుకు కూడా తొందరపడుతోంది. రాష్ట్రపతి ఆమోదం పొంది... గెజిట్ నోటిఫికేషన్ రాకుండానే విభజన పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తొందర పెడుతోంది. ఈ మేరకు కేంద్ర పెద్దలు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్‌చేసి... వీలైతే వారం రోజుల్లోగా విభజన ప్రక్రియను పూర్తి చేయగలరా? అని అడిగినట్లు సమాచారం. దీంతో వారం రోజుల్లో సాధ్యమేనా? ఎన్ని రోజుల సమయం పడుతుంది? అనే విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సీనియర్ ఐఏఎస్ అధికారులతో విభజనకు మంతనాలు జరిపారు. ప్రధానమైన ఆర్థిక, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల్లో విభజన ప్రక్రియకు సన్నద్ధం కావాల్సిందిగా సీఎస్ సూచించినట్లు తెలిసింది. ఉద్యోగుల స్థానికతతో పాటు ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంతమంది అధికారులు, ఉద్యోగులున్నారనే వివరాలను సిద్ధంగా చేయాలని, వాహనాలతో పాటు, ఆస్తులు వివరాలను సిద్ధంగా ఉంచాలని, కేంద్రం నుంచి ఏ క్షణంలో మార్గదర్శక సూత్రాలు వెలువడతాయని, ఆ ప్రకారం విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ కీలక శాఖలకు సూచించారు.
బిల్లులో పూర్తి వివరాలున్నందున ఆ ప్రకారం విభజన పనిని ఇప్పటినుంచే ప్రారంభింప చేస్తే త్వరగా ప్రక్రియ పూర్తి అవుతుందనే భావనలో కేంద్ర పెద్దలున్నట్లు తెలిసింది.
ఎన్నికల ముందు యావత్తు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో ఉంటుందని, అలాగే ఇతర రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులగా ఐఏఎస్‌లను ఎన్నికల కమిషన్ నియమించనుందని, ఈ సమయంలో తక్కువ సమయంలో హడావిడిగా విభజన పూర్తి చేయడం సాధ్యం కాదని కొంతమంది అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రపతి ఆమోదం తెలిపి తేదీ నుంచి రాష్ట్ర ఏర్పడుతుందని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంటే తప్పనిసరిగా ఆ లోగా విభజనను పూర్తి చేయాలని కొందరు అధికారులు అంటున్నారు.
ఇరు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసి మంత్రివర్గాలను ఏర్పాటు చేయడం సులభతరమేనని, అయితే పాలనా యంత్రాంగం, ఫైళ్లు, ఆస్తులు, ఆదాయం విభజన అంత సులభం కాదని ఒక అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్సాల్డిడేట్ నిధిని విభజించకుండా ఇరు రాష్ట్రాలకు నిధులు వ్యయం చేయడం సాధ్యం కాదని, అలాగే ఫైళ్లు విభజన, శాఖల విభజన జరగకుండా ఏ ఫైళ్లు ఎక్కడకు ఎవరు పంపాలో గందరగోళం నెలకొంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కచ్చితంగా 70 నుంచి 90 రోజుల సమయం పడుతుందనేది అధికార వర్గాల అభిప్రాయం.
ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా విభజించి కొన్ని బ్లాకులు సీమాంధ్రకు, కొన్ని బ్లాకులు తెలంగాణకు కేటాయించేందుకు రాష్ట్ర అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. సచివాలయంలోని ఎ, బి, సి, ఎల్ బ్లాకులను తెలంగాణ రాష్ట్రానికి, డి, జె, హెచ్ (నార్త్), హెచ్ (సౌత్), కె బ్లాకులను సీమాంధ్ర రాష్ట్రానికి కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ బ్లాకుల కేటాయింపును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ చేయనుంది.