ప్చ్! సమరం సమాప్తం..
సమైక్యాంధ్ర పరిరక్షణకు సుదీర్ఘంగా సాగిన పోరు
చివరికి అరణ్యరోదనగానే మిగిలిన రణన్నినాదం
తెలుగుజాతి చీలికకు పార్లమెంట్ ఆమోద ముద్ర
సమ్మె విరమించి విధుల్లో చేరిన ఏపీ ఎన్జీఓలు
24 నుంచి మళ్లీ నల్లకోటు వేసుకోనున్న న్యాయవాదులు
సాక్షి, కాకినాడ :
కోట్ల గొంతులు ఒక్కటై.. దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రణన్నినాదం చివరికి అరణ్యరోదనగానే మిగిలింది. తెలుగుజాతి ఎన్నటికీ ఒక్కటిగానే ఉండాలన్న ఒకేఒక్క సంకల్పంతో బిగిసిన పిడికిళ్లకు ఫలితం..‘మొండిచెయ్యే’ అయ్యింది. సీమాంధ్ర చరిత్రలోనే అపూర్వంగా సాగిన సమరం.. తీరం చేరకుండానే విరిగిపోయిన కెరటమే అయ్యింది. సామాన్యుల్లో సైతం రగిలిన ధర్మాగ్రహజ్వాల ఆఖరుకు తాటాకుమంటగానే ఆరిపోక తప్పలేదు. సమైక్యాంధ్ర పరిరక్షణకు సాగిన ఉద్యోగుల సుదీర్ఘ ఉద్యమానికి తెరపడింది. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడ్డ వెంటనే తొలుత 66 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసిన ఏపీ ఎన్జీఓలు అనంతరం ఆందోళనను విరమించి విధుల్లో చేరారు. అయితే విభజన బిల్లును రాష్ర్ట అసెంబ్లీకి పంపడాన్ని నిరసిస్తూ
గత 15 రోజులుగా తిరిగి ఉద్యమపథంలోకి వచ్చారు. ఇప్పుడు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ‘యుద్ధ విరమణ’ అనివార్యమైంది. సమ్మెకు తెరపడడడంతో గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మళ్లీ తెరుచుకున్నాయి.
రాష్ర్ట విభజన ప్రకటన జూలై 30న వెలువడగా ఆ మర్నాటి నుంచే సీమాంధ్ర లో సమైక్య ఉద్యమం మొదలైంది. ఏపీఎన్జీఓ సంఘం పిలుపు మేరకు 40కి పైగా ప్రభుత్వ శాఖలతో పాటు ఆర్టీసీ కార్మికులు ఆగస్టు 12 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వారికి మద్దతుగా యూటీఎఫ్ మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలన్నీ సమ్మె బాటపట్టాయి. ఆ తర్వాత దశల వారీగా ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు సైతం సమ్మెకు పూనుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు కూడా నాలుగురోజుల పాటు సమ్మె చేశారు. చివరకు ‘పై-లీన్’ తుపాను విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి విధుల్లో చేరారు. ఉవ్వెత్తున సాగిన ఉద్యమం అకస్మాత్తుగా సమ్మె విరమించడంతో ఒక్కసారిగా నీరుగారిపోయింది. న్యాయవాదులు మాత్రం ఉద్యమం ప్రారంభమైంది మొదలు నిరవధికంగా విధులను బహిష్కరిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. వీరి ఆందోళన కోర్టుల్లో పెండింగ్ కేసుల విచారణ పై తీవ్ర ప్రభావం చూపించింది. కాగా ఉద్యోగులు విధుల్లో చేరిన తర్వాత సమైక్య ఉద్యమం పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజా ఉద్యమంగానే సాగింది. ఎవరు ఎంత తీవ్రంగా ఉద్యమించినా, నింగీనేలా దద్దరిల్లేలా జనాభిమతాన్ని ఎలుగెత్తినా యూపీఏ సర్కారు కించిత్తు చలించలేదు. విభజన నిర్ణయం నుంచి వీసమెత్తు వెనకడుగు వేయలేదు.
మళ్లీ ఉద్యమించినా..
విభజన బిల్లును శాసనసభకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం పిలుపు మేరకు ఈ నెల 6 నుంచి ఎన్జీఓలు మళ్లీ నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. గత 15 రోజులుగా సాగిన ఈ సమ్మెలో జెడ్పీ, ట్రెజరీ, వ్యవసాయ, ఇరిగేషన్ వంటి శాఖలు మినహా మిగిలిన ప్రభుత్వ శాఖల సిబ్బంది భాగస్వాములయ్యారు. దీంతో కలెక్టరేట్ నుంచి గ్రామస్థాయిలో వీఆర్వో కార్యాలయం వరకు మూతపడ్డాయి. చివరికి తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో ఇక విభజనను ఆపలేమన్న నిర్ణయానికి వచ్చిన ఏపీఎన్జీఓ సంఘంఅధ్యక్షుడు పి.అశోక్‌బాబు సమ్మెను విరమించి గురువారం నుంచి విధుల్లో చేరాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
చలో ఢిల్లీకి వెళ్లిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా గురువారం విధుల్లో చేరడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చలోఢిల్లీకి ప్రత్యేకంగా వేసిన రైలు గురువారం మధ్యాహ్నం కాకినాడ చేరుకోవడంతో వీరంతా శుక్రవారం విధుల్లో చేరనున్నారు. పూర్తిస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులు ఈ నెల 24 నుంచి మళ్లీ విధుల్లో చేరనుండడంతో కోర్టుల్లో కార్యకలాపాలు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కానున్నాయి. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్లే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టిందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విభజనను అడ్డుకునేందుకు తాము చివరి వరకు పోరాడామని, చేయగలిగినదంతా చేశామని ఏపీ ఎన్జీ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ చెప్పారు. తమ ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.