మహాసంగ్రామ భేరి మోగింది
మహాసంగ్రామ భేరి మోగింది
Published Sun, Apr 13 2014 1:06 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, కాకినాడ :జిల్లాలో మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. తొలిరోజు పిఠాపురం, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, రామచంద్రపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. 14 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలకు తొలిరోజు బోణీ కాలేదు. పిఠాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జల్లూరు నుంచి పిఠాపురం వరకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణ, పీబీసీ-1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావు చిన్నారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంగళ సుబ్బారావు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి పిఠాపురం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన దొరబాబు రిటర్నింగ్ అధికారి వీవీఎస్‌ఎస్ నాగలక్ష్మికి రెండుసెట్ల నామినేషన్లు అందజేశారు.
రాజమండ్రి రూరల్‌లో ఆకుల నామినేషన్
వైఎస్సార్ సీపీ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆ నియోజకవర్గంలోని బొమ్మూరు తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎన్.సీతామహాలక్ష్మికి రెండు సెట్ల నామినేషన్లు అందజేశారు. అంతకు ముందు ఆయన బొమ్మూరులోని పార్టీ కార్యాలయం నుంచి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, పార్లమెంటు నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకట రమణ చౌదరి, నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బాబిరెడ్డి, రాజమండ్రి మేయర్ అభ్యర్థి మేడపాటి షర్మిలారెడ్డిలతో పాటు వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆర్వో కార్యాలయానికి పాదయాత్రగా తరలివచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున తుమ్మలపల్లి నూకరాజు, పెద్దాపురం, రామచంద్రపురం అసెంబ్లీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పేపకాయల దొరబాబు, సదే బాబూప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం, ఆ తర్వాత సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతితో వరుసగా రెండు సెలవులు రావడంతో తిరిగి మంగళవారమే నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement