* సీమాంధ్రలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులంతా ఓటమిపాలు
*ఓడిపోయిన వారిలో పలువురు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు
*ఒక్క స్థానంలోనూ గెలవని కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రెండుసార్లు కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన సీమాంధ్ర ప్రజలు ఈసారి ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన, కేంద్ర అప్రజాస్వామిక విధానాలతో ఆ పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను చవిచూసింది. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇక్కడ పోటీ చేసిన కేంద్ర మంత్రులు సహా సిట్టింగ్ ఎంపీలంతా ఘోర పరాజయం పాలయ్యారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి 2004లో 22 స్థానాలు, 2009లో 21 స్థానాలను ప్రజలందించారు. ఇక్కడి మెజార్టీతోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.
అలాంటి ప్రాంతంలో ఈ సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ కనీస పోటీలో కూడా కనిపించకుండా పోయింది. కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, ఎం.ఎం.పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మిగతా ఎంపీలలో విజయనగరంలో బొత్స ఝాన్సీ, నర్సాపురంలో కనుమూరి బాపిరాజు, తిరుపతిలో చింతామోహన్ ఓటమిపాలయ్యారు.
కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినా నామినేషన్లకు ముందు తిరిగి పార్టీలోకి రప్పించి హస్తం గుర్తుపై పోటీచేయించారు. ఆయన కూడా ఓటమిచెందారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోనిల్చిన కొత్త అభ్యర్థుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. బొలిశెట్టి సత్యనారాయణ (విశాఖ), తోట విజయలక్ష్మి (అనకాపల్లి), బుచ్చి మహేశ్వరరావు (అమలాపురం), ముసునూరు నాగేశ్వరరావు (ఏలూరు), శిష్ట్లా రమేష్ (మచిలీపట్నం), దేవినేని అవినాష్ (విజయవాడ), వహీద్ (గుంటూరు), దర్శి పవన్‌కుమార్ (ఒంగోలు), కొండపల్లి వెంకటేశ్వర్లు (గుంటూరు), వాకాటి నారాయణరెడ్డి (నెల్లూరు), బీవై రామయ్య (నంద్యాల), పీవీ అనిల్‌చౌదరి (అనంతపురం), చిన్న వెంకట్రాముడు (హిందూపురం), వి.అజయ్‌కుమార్ (కడప), బి.రాజగోపాల్ (చిత్తూరు)లు ఘోరంగా పరాజయం పాలయ్యారు. పరిటాల రవి అనుచ రుడు, చిన్నవెంకట్రాముడిని హిందూపురం ఎంపీ అభ్యర్థిగా తెచ్చుకుంటే పెనుకొండలో తనకూ కలసి వస్తుందని ఆశించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆశ ఫలించలేదు. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది.
కంగు తిన్న కేంద్రమంత్రులు
Published Sat, May 17 2014 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement