బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఆ మహానేత సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. శివారు భూములకు నీరందించేందుకు పంటకాలువలను ఆధునికీకరించారు. అటువంటి మహానేత సతీమణి వస్తుండడంతో కోతలకు సిద్ధమైన వరికంకులు సైతం తలలూపుతూ స్వాగతం పలికాయి. వ్యవసాయ పనులతో తీరిక లేకుండా ఉన్న కూలీలు జననేత జగన్ మాతృమూర్తి విజయమ్మను చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు వరిచేల వెంట పరుగులు పెట్టారు. విజయమ్మ జిల్లాలో రెండో రోజు ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు.
సాక్షి, కాకినాడ :సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండవరోజు తాళ్లరేవులో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం కోలంక, ఉప్పుమిల్లి, కుయ్యేరు, బాలాంతరం, ఎర్ర పోతవరం, శివల, దంగేరు, కె.గంగవరం, తామరపల్లి, సత్యవాడ, పాణింగపల్లి, అముజూరు, పామర్రు, ఎండగండి, టేకి, అంగర, వెదురుమూడి, మారేడుబాక మీదుగా మండపేట వరకు సాగింది. తాళ్లరేవు, కె.గంగవరం, మండపేటల్లో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో ఆమె ప్రసంగించారు. తాళ్లరేవు మొదలుకొని కె.గంగవరం వరకు దారిపొడవునా వరిపొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు విజయమ్మ రాకతో రోడ్లపైకి పరుగులు తీశారు.
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ..
దారిపొడవునా పలు గ్రామాల్లో తనను చూసేందుకు పెద్దసంఖ్యలో బారులు తీరిన అభిమాన జనాన్ని ఉద్దేశించి విజ యమ్మ ప్రసంగించారు. కొన్ని సందర్భాల్లో మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, అభిమానం.. ఆప్యాయతలను చూస్తుంటే మా కుటుంబం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలదు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీరు చూపిస్తున్న ఈ అభిమానాన్ని నా గుండెల్లో దాచుకుంటానంటూ ఉద్వేగంగా చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. పింఛను వస్తోందా? కరెంట్ బిల్లుఎంత వస్తోంది ? అంటూ పలుచోట్ల వృద్ధులు, మహిళలను ఆరా తీసిన విజయమ్మ జగన్ బాబు ప్రభుత్వం రాగానే పింఛను రూ.700లు ఇస్తారు. రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీకి అయ్యే 150 యూనిట్ల కరెంట్‌కు నూరు రూపాయలు మాత్రమే చార్జి చేస్తారంటూ వారికి వివరిస్తూ ముందుకు సాగారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జగన్‌బాబు అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
అమ్మఒడి పథకం, అవ్వాతాతలకు రూ. ఏడొందల పింఛను, రైతులకు 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణమాఫీ, ఏ కార్డుకావాలన్నా 24 గంటల్లో అందించేలా గ్రామాల్లో ఆఫీసులు తెరవడం.. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగన్‌బాబు అమలు చేస్తాడని విజయమ్మ చెప్పుకొచ్చారు. అలాగే నాడు రాజశేఖరరెడ్డి రూ.50లు గ్యాస్ సబ్సిడీ భరిస్తే నేడు జగన్ ప్రభుత్వం నూరు రూపాయలు భరించనుందని తెలిపారు. వీటితోపాటు అన్నివర్గాల వారికి మరింత మేలు జరగాలంటే మరో రెండు వారాల్లో జరుగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎండ మండుతున్నా.. చెక్కుచెదరని అభిమానం
ప్రచండభానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నా చెక్కు చెదరని అభిమానం కురిపిస్తూ విజయమ్మను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. చుర్రుమని కాలుతున్న ఆ రహదారులపై ఏ ఒక్కరూ క్షణం కూడా నిలబడలేరు. కానీ తమ గుండెల్లో దైవంలా ప్రతిష్టించుకున్న ఆమెను చూసేందుకు గంటల తరబడి ఆ రోడ్లపైనే నిరీక్షించారు. మండటెండను ఏ మాత్రం లెక్కచేయలేదు. తమ కుటుంబంపై జనం చూపుతున్న అభిమానానికి చలించిన విజయమ్మ కూడా ఎండను లెక్కచేయకుండా తన పర్యటన కొనసాగించారు. ఉదయం తాళ్లరేవులో మొదలుకొని సాయంత్రం కె.గంగవరం చేరుకునే వరకు మండుటెండను సైతం పట్టించుకోలేదు. ప్రచార రథం నుంచి దిగలేదు. తాళ్లరేవులో అయితే 40 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతలో సైతం విజయమ్మ మాటలు వినేందుకు నడిరోడ్డు పైనే మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిరీక్షించారు.
భానుడి ప్రతాపం తగ్గాక సాయంత్రం కె.గంగవరం నుంచి తామరపల్లి, సత్యవాడ, పాణింగపల్లి, అముజూరు, పామర్రు, ఎండగండి, టేకి, అంగర, వెదురుమూడి, మారేడుబాక మీదుగా మండపేట వరకు జరిగిన ప్రచారానికి జనం భారీ ఎత్తున పోటెత్తారు. విజయమ్మ రాకను తెలుసుకొని ఊళ్లకు ఊళ్లే తరలివచ్చాయా అన్నట్టుగా జనం రోడ్ల వెంబడి బారులు తీరారు. గ్రామానికి గ్రామానికి నడుమ తెరిపిలేకుండా పెద్దఎత్తున బారులు తీరిన జనాన్ని ఆమె ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఆప్యాయతకు జనం పులకించిపోయారు. మేమంతా మీ వెన్నంటే ఉంటామంటూ గట్టిగా నినదించారు. విజయమ్మ రాక బాగా ఆలస్యమైనా మండపేట కలువపువ్వు సెంటర్‌లో జరిగిన సభ జనసంద్రాన్ని తలపించింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరి మాట్లాడుతూ, వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని అన్నారు. విజయమ్మ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, సీఈసీ సభ్యుడు రెడ్డి ప్రసాద్, అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్, పార్టీ సీఈసీ సభ్యుడు, రామచంద్రపురం అసెంబ్లీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మండపేట అసెంబ్లీ అభ్యర్థి గిరిజాల వెంకటస్వామినాయుడు, ముమ్మిడివరం అసెంబ్లీ అభ్యర్థి గుత్తులసాయి, పార్టీ రాష్ర్ట మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, అనుబంధ విభాగాల అధ్యక్షులు కర్రి పాపారాయుడు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, గీత, మంతెన రవిరాజు, మాజీ ఎంపీపీలు పి.రాజశేఖర్, పెన్మత్స చిట్టిరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ దున్నా జనార్ధనరావు, డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యల చిట్టిబాబు, పార్టీ నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, యేడిద చక్రం, పాలెపు ధర్మారావు, కొవ్వూరి త్రినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు మూడు జనభేరి సభలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మూడవ రోజు బుధవారం మూడు నియోజకవర్గాల్లో జరిగే వైఎస్సార్ జనభేరిలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారని చెప్పారు. అనపర్తి దేవీచౌక్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు, ధవళేశ్వరంలో సాయంత్రం నాలుగు గంటలకు, ఏడు గంటలకు రాజమండ్రి అజాద్‌చౌక్ సెంటర్‌లలో జనభేరి సభలలో విజయమ్మ ప్రసంగించనున్నారని వారు తెలిపారు.