అభిమాన తరంగం
సాక్షి, గుంటూరు :(గ)నాభిమానం ఉప్పొంగింది. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్సార్ జనభేరి పేరిట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ధీర వనితకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం లభించింది. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి, జననేత జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ పర్యటన ఆదివారం ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో సాగింది. వైఎస్ పథకాలను గుర్తుకు తెస్తూ రాబోయే సువర్ణయుగం గురించి వివరిస్తూ రెండోరోజు సాగిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. దారి పొడవునా జగన్నినాదాలతో, బైక్ ర్యాలీలతో యువకులు హోరెత్తించారు. తమ ముంగిటకు వచ్చిన ఆడపడుచుకు మహిళలు మంగళహారతులిచ్చారు. పూలజల్లులు కురిపించారు. తెలగవారిపాలెం నుంచి ప్రారంభం.: ఆదివారం ఉదయం కాకుమాను మండలం తెలగవారిపాలెం నుంచి జనభేరి ప్రారంభమైంది. పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితలు విజయమ్మ వెంట రోడ్‌షోకు బయలుదేరారు. బండ్లవారిపాలెం గ్రామానికి చేరుకోగానే జనం కేరింతలు కొడుతూ ఆమె బస్సుకు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ కొంత సేపు ప్రసంగించిన విజయమ్మ రోడ్‌షో గరికపాడు, బీకేపాలెం మీదుగా కాకుమాను చేరుకున్నారు.. విజయమ్మ మాట్లాడుతూ మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఐదు సంతకాలతో అందరికి ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించారని చెప్పారు.
అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు.: కాకుమాను నుంచి రోడ్‌షో కొమ్మూరు, నాగులపాడు మీదుగా పెదనందిపాడుకు వెళ్లారు. అక్కడి నుంచి వరగాని, అబ్బినేనిగుంటపాలెం మీదుగా రోడ్‌షో ప్రత్తిపాడుకు చేరుకున్న విజయమ్మ మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాటు తన కుటుంబానికి, పార్టీకి అండగా నిలిచిన మీరంతా ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరితను గెలిపించాలని కోరారు. మధ్యాహ్నం గొట్టిపాడులో భోజనం చేసిన అనంతరం స్థానికులకు అభివాదం చేస్తూ చిలకలూరిపేట నియోజకవర్గంలోకి ప్రవేశించారు. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామం వద్ద పార్టీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌లు ఫునస్వాగతం పలికారు. ఉన్నవలో వేచిఉన్న జనవాహిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. అక్కడి నుంచి బోయపాలెం చేరుకున్న ఆమెకు యువకులు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు.
పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలి.: అనంతరం గోపాలపురం మీదుగా చంఘీజ్‌ఖాన్‌పేట చేరుకున్న విజయమ్మ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
అక్కడి నుంచి కొత్తసొలస, సొలస గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. లింగారావుపాలెంవాసులు పట్టు పట్టడంతో విజయమ్మ ఆ గ్రామం మొత్తం పర్యటించారు. అక్కడి నుంచి జనభేరి రథం నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామానికి చేరింది. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామాల్లో మద్యం పారించిన ఘన బాబుదే.: నాదెండ్లలో విజయమ్మకోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఆమెను చూసి కేరింతలు కొట్టారు. అనంతరం తూబాడు, చందవరం, సాతులూరు మీదుగా కనపర్తి వరకు సాగిన ప్రచార రథానికి స్థానికులు అఖండ స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో విజయమ్మ ప్రసంగిస్తూ చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2ల కిలో బియ్యం పథకం, మద్యపానంపైనా నిషేధం ఎత్తివేశారని విమర్శించారు. రోడ్‌షోలో పార్టీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు దాది లక్ష్మీరాజ్యం, యువజన, సేవాదళ్ విభాగాల జిల్లా కన్వీనర్లు కావటి మనోహర్‌నాయుడు, కొత్తా చిన్నపరెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.
విశ్వసనీయతదే అంతిమ విజయం
పట్నంబజారు, న్యూస్‌లైన్: వైఎస్సార్ జనభేరిలో భాగంగా ఆదివారం ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలో విజయమ్మతోపాటు నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. పలు గ్రామాల్లో ప్రసగించారు. అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ మహానేతను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీ విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్య స్థాపన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మహానేత కుటుంబం ఎంతటి కష్టాలు పడేందుకూ వెనుకాడటం లేదన్నారు, జననేత వైఎస్ ముఖ్యమంత్రి కాగానే అనేక మహోన్నత పథకాలకు శ్రీకారం చుట్టనున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. అంతిమ విజయం విలువలు, విశ్వసనీయతదేనని స్పష్టం చేశారు. బాలశౌరి మాట్లాడుతూ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కాంగ్రెస్, టీడీపీలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మహానేత మరణానంతరం రాష్ట్రం అథోగతిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను సమర్ధంగా సరిచేయగలిగిన సత్తా జగన్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.