అడుగడుగునా బ్రహ్మరథం
సాక్షి, కాకినాడ :సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు జిల్లాకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, మహానేత సతీమణి వై.ఎస్.విజయమ్మను ప్రజలు తమ ఆత్మబంధువులా ఆదరించారు. పట్టరాని అభిమానంతో పూలవర్షం కురిపించారు. సోమవారం జిల్లాలో విజయమ్మ పర్యటన తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో సాగింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా జనం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా బారులు తీరి విజయమ్మకు ఆత్మీయ స్వాగతం పలికారు. తామంతా వైఎస్ కుటుంబం వెంటేనని స్పష్టం చేశారు. వారికి అభివాదం చేస్తూ, వారిని మరింత ఉత్తేజపరిచేలా విజయమ్మ ప్రసంగించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు, వికలాంగులు ప్రతీ ఒక్కరూ విజయమ్మను చూసేందుకు ఉత్సాహం చూపించారు. యువకులు వందలాది బైకులతో విజయమ్మ వెంట కదం తొక్కారు. తుని నుంచి ప్రారంభమైన విజయమ్మ పర్యటన రావికంపాడు, ఎ.వి.నగరం, పెరుమాళ్లపురం, వాకదారితోట, కొత్తపాకలు, ఒంటిమామిడి, తొండంగి, శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి, గోపాలపట్నం మీదుగా అన్నవరం వరకు సాగింది. పెరుమాళ్లపురంలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో విజయమ్మ మహానేత సువర్ణపాలనను వివరిస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఏనాడూ రైతులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వారి రుణాలమాఫీ చేస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.
యనమల ఇలాకాలో జగన్ నినాదం..
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్వగ్రామమైన ఎ.వి.నగరంలో విజయమ్మ అడుగుపెట్టగానే జగన్నినాదంతో ఆ గ్రామం మార్మోగింది. వీధులన్నీ జనసంద్రమయ్యాయి. అక్కడ విజయమ్మ ప్రసంగిస్తూ చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. మహానేత లేని లోటు ఎవరూ తీర్చలేరని, తాను మరణించే వరకు తనకు ఆలోటు తీరదని గద్గద స్వరంతో అన్నప్పుడు ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. ‘మీవెంటే మేమున్నా’మంటూ నినాదించారు. పలుచోట్ల ప్రజలు హారతులిచ్చి, ఆశీర్వదించగా ‘మీ రుణం ఏవిధంగా తీర్చుకోగల’మని విజయమ్మ అన్నారు. పెరుమాళ్లపురంలో జరిగిన సభలో తుని అభ్యర్థి దాడిశెట్టి రాజా తన ప్రసంగంలో యనమలపై మండిపడ్డారు. గురివింద గింజ సామెత మాదిరిగా యనమల తాను చేసిన తప్పులను, తన అధినేత చేసిన నేరాలను కప్పిపుచ్చుకుంటూ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్నవి మన తలరాతలు మార్చే ఎన్నికలన్నారు.
జనసంద్రమైన ప్రత్తిపాడు..
జాతీయ రహదారి నుంచి ప్రత్తిపాడు సెంటరుకు మూడు కిలోమీటర్ల మేర ప్రజలు, మహిళలు రోడ్లకు ఇరువైపులా, భవనాలపై నుంచి విజయమ్మపై పూలవర్షం కురిపిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో విజయమ్మకు స్వాగతం పలికారు. విజయమ్మ వద్దని వారిస్తున్నా మహిళలు, యువతులు దారిపొడవునా పూలవర్షం కురిపించారు. ప్రత్తిపాడు మూడు రోడ్ల కూడలిలో ఎటు చూసినా కిలోమీటరు మేర జనంతో కిక్కిరిసిపోయింది. ‘నేను, నా బిడ్డ బయటకు వచ్చినప్పుడు.. వైఎస్సార్ ద్వారా రాజకీయంగా లబ్ధిపొందిన ఏ ఒక్కరూ మా వెంట నిలబడలేదు.
మీరు మాత్రమే ప్రేమ, ఆప్యాయతలు చూపుతూ మా వెంట నిలిచారు’ అని విజయమ్మ ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలు ‘మేమంతా మీ వెంటే ఉన్నా’మంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘చంద్రబాబు ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించాడా? ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం పథకం ఉంచాడా? రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చారా? పీజీ వరకు ఉచితంగా చదివించారా? సైకిల్ ఇస్తానన్నారు.. ఇచ్చాడా? మంగళసూత్రాలిస్తానన్నారు.. ఇచ్చాడా? ఆడపిల్లలకు రూ.6 వేలు వేస్తానన్నారు.. వేశాడా?’ అని బాబు పాలనను ఎండగట్టిన సమయంలో ప్రజలు ‘లేదు లేద’ని స్పందించారు. ‘నాలుగున్నరేళ్లుగా జగన్ మీకోసం ఎన్నో పోరాటాలు చేశాడు. కుట్ర లు, కుతంత్రాలతో జైలుపాలు చేసినా నిత్యం మీకోసమే తపిం చాడు’ అన్నప్పుడు ప్రజలు ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తిం చారు. జగన్‌ను జైలులో నిర్బంధించినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారని, ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే సార్వత్రిక ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని ప్రత్తిపాడు అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు.
సత్యదేవుని సాక్షిగా బాబుకు సవాల్..
జగ్గంపేట నియోజకవర్గంలో ఏజెన్సీ ముఖ ద్వారమైన గోకవరంలో జరిగిన జనభేరి సభకు జనం పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో గోకవరం జనసాగరంగా మారింది. జగ్గం పేట అభ్యర్థి, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాను 30 ఏళ్లు చంద్రబాబుతో రాజకీయ సహవాసం చేశానని, రైతులకు రుణమాఫీ చేయమని కోరగా ‘మీ మైండ్ సెట్ మార్చుకోండి. రుణ మాఫీ చేస్తే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది’ అని అన్నారని గుర్తు చేసుకున్నారు. అదే పెద్దమనిషి నేడు రైతులకు రుణమాఫీ చేస్తానంటూ దగాకోరు మాటలాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘అన్నవరం’ సత్యనారాయణమూర్తి సాక్షిగా చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. జగనన్న ముఖ్యమంత్రి కాగానే రాజన్న రాజ్యం వస్తుందని నేను చెబుతాను. ‘నువ్వు మళ్లీ అధికారంలోకి వస్తే తొమ్మిదిన్నరేళ్ల నీ పాలన తీసుకువస్తానని చెప్పగలవా?’ అని ప్రశ్నించినప్పుడు జనం ‘చెప్పలేరు... చెప్పలేరు’ అంటూ ముక్తకంఠంతో నినదించారు.
మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మహానేత తలపెట్టి పూర్తి చేసిన పుష్కర, భూపతిపాలెం, ముసురుమిల్లి తదితర ప్రాజెక్టుల గురించి వివరిస్తూ ఆయనే బతికుంటే జలయజ్ఞం పూర్తయి, కోటి ఎకరాలకు నీరందేదన్నారు. ‘మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను సీఎం చేసుకోవాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి’ అని కోరారు. తొలుత తునిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి విజయమ్మను కలిసి జిల్లా పరిస్థితిని వివరించారు. ఆమె వెంట పార్టీ సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు వాసిరెడ్డి జమీలు, తాడి విజయభాస్కరరెడ్డి, అనుబంధ విభాగాల కన్వీనర్లు రొంగళి లక్ష్మి, రావూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంగల సుబ్బారావు, కొయ్యా శ్రీవిద్య, పీబీసీ-2 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావుచిన్నారావు, తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కుసుమంచి శోభారాణి, ఏఎంసీ మాజీ చైర్మన్లు మాకినీడి గంగారావు, లాలం బాబ్జి పాల్గొన్నారు.
నేడు మూడు నియోజకవర్గాల్లో ‘వైస్సార్ జనభేరి’
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన మంగళవారం ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవులో, సాయంత్రం నాలుగు గంటలకు రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరంలో, ఆరు గంటలకు మండపేట కలువపువ్వు సెంటర్‌లో జరిగే జనభేరి సభల్లో ఆమె ప్రసంగిస్తారని పేర్కొన్నారు.