నేటి నుంచి జిల్లాలో విజయమ్మ ‘వైఎస్సార్ జనభేరి’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో తుని నుంచి ప్రారంభించే ఏ కార్యక్రమమైనా విజయం సాధిస్తుందన్నది పలువురి బలమైన నమ్మకం. మహానేత వైఎస్ 2007 సెప్టెంబరు 14న ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఆదర్శ గ్రామా ల పథకానికి తుని మండలం ఎస్.అన్నవరం నుంచే శ్రీకారం చుట్టారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ప్రచారాన్ని కూడా ఆయన తుని నుంచే ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ సెంటిమెంట్‌ను గౌరవిం చాలన్న పార్టీ జిల్లా నేతల అభ్యర్థనను మన్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని తుని నుంచే ప్రారంభిస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిది రోజులు ప్రచారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ విజయావకాశాలను ఇతోధికం చేసి వెళ్లారు.
ఇప్పుడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని విజయమ్మ సోమవారం చేపడుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారం తెలిపారు. విజయమ్మ సోమవారం తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారన్నారు. తుని నుంచి ఎ.వి.నగరం మీదుగా పెరుమాళ్లపురం చేరుకునే విజయమ్మ అక్కడ ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జనభేరి సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం ఒంటిమామిడి జంక్షన్, తొండంగి, శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి, గోపాలపట్నం, అన్నవరం, కత్తిపూడి మీదుగా సాయంత్రం 4 గంటలకు ప్రత్తిపాడు చేరుకుని అక్కడ సభలో ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం చేరుకుని సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని, దాంతో విజయమ్మ తొలిరోజు ప్రచారం ముగుస్తుందని తెలిపారు.