విజయభేరి.. | YS Vijayamma Election Campaign in East Godavari | Sakshi
Sakshi News home page

విజయభేరి..

Published Fri, Apr 25 2014 12:53 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

విజయభేరి.. - Sakshi

విజయభేరి..

గోదావరిలో ప్రవాహాన్ని అనుసరిస్తూ సాగే నావకు గాలి వాలు కూడా తోడైతే.. ఇక ఆ ప్రయాణం ఎంత సునాయాసమో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. జిల్లాలో అప్పటికే సమరోత్సాహంతో కదం తొక్కుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మూడు రోజులు ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించిన అనంతరం మరింత ఉత్తేజంతో ఉరకలేస్తున్నాయి. ఎవరి మోములో చూసినా గెలుపు తథ్యమన్న విశ్వాసం తొణికిసలాడుతోంది. ఇక ప్రజలకు..రాజన్న రాజ్యం రానున్నదన్న భరోసా బలపడింది.
 
 సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన వైఎస్సార్ జనభేరితో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సామాన్య ప్రజలకూ భవిష్యత్తు పట్ల ఒక భరోసాను ఇచ్చింది. ఒకవైపు చండ్రనిప్పులు కురిపిస్తూ 40 సెంటీగ్రేడ్ డిగ్రీలు దాటిన మండుటెండల్లో సైతం విజయమ్మ పర్యటన అప్రతిహతంగా సాగింది. విశాఖ జిల్లాలో పర్యటన ముగించుకొని ఈ నెల 20 రాత్రి తుని చేరుకున్న విజయమ్మ 21 ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్ జనభేరి రాజమండ్రి నగరంలో 23న రాత్రి తొమ్మిదిన్నర గంటలతో ముగిసింది.
 జిల్లాలో వైఎస్సార్ జనభేరి తొమ్మిది నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర సాగింది.
 
 రోజూ ఉదయం తొమ్మిదిగంటల నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు, తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఏకబిగిన విజయమ్మ పర్యటన సాగింది. మధ్యలో ఎక్కడా ఓపెన్ టాప్ వాహనం దిగకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 11 గంటల పాటు వాహనంపై నిలుచునే, ప్రజలందరికీ అభివాదం చేస్తూ విజయమ్మ ప్రచారం సాగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన సాగింది. తొమ్మిది చోట్ల జరిగిన జనభేరి సభల్లో ప్రసంగించిన విజయమ్మ అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజాస్పందనకు ముగ్ధులై పలు గ్రామ కూడళ్లలో కూడా క్లుప్తంగా ప్రసంగించి, తన రాక కోసం నిరీక్షించిన జనవాహినికి ఆనందం కలిగించారు. ఆమె ముప్ఫైకి పైగా గ్రామాల్లో ప్రసంగించి ప్రజలను ఉత్తేజ పరిచారు.
 
 ప్రజలకు భరోసానిచ్చిన ప్రసంగాలు
 వైఎస్సార్ జనభేరి పర్యటనలో విజయమ్మ చేసిన ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, నాయకులు, అభ్యర్థుల్లో ఉత్తేజం నింపాయి. సమర్థమైన యువనాయకత్వం రాష్ట్రానికుందన్న ధీమాను అన్ని వర్గాల ప్రజల్లోనూ విజయమ్మ కలిగించగలిగారు. గత   నాలుగున్నరేళ్లుగా తమ కుటుంబంపై సాగిన కుట్రలు, కుతంత్రాలను వివరిస్తూనే ప్రత్యర్థిపక్షాలను ఎండగట్టారు. తాను ఏ పరిస్థితుల్లో ప్రజలకు ముందుకు రావాల్సి వచ్చిందో వివరిస్తూ గుండెకు హత్తుకునే రీతిలో విజయమ్మ చేసిన ప్రసంగాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. ప్రతి చోట 20 నుంచి 30 నిముషాల పాటు ఆమె ప్రసంగాలు సాగాయి. స్టేలు తెచ్చుకొని బతుకుతున్నారంటూ చంద్రబాబుపై చండ్రనిప్పులు కురిపిస్తూ చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ‘నీవు చేసిన స్కామ్‌లపై సీబీఐతో విచారణకు సిద్ధమా?’ అంటూ చంద్రబాబుకు సవాల్ విసరడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
 
 కంటతడి పెట్టించిన పలుకులు
 ‘రాజశేఖరరెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేరు.. చివరకు నా కొడుకు.. కూతురు కూడా తీర్చలేరు. అది నేను చస్తే కానీ తీర’దన్న విజయమ్మ మాటలు ప్రజలను కంటతడి పెట్టించాయి. ‘పాపం ఆ తల్లి మండుటెండల్లో ఇలా రోడ్డున పడి ప్రచారం సాగించాల్సి వస్తోంది’ అంటూ ప్రతిచోటా జనం చలించిపోయారు. తుని మొదలు  రాజమండ్రి వరకు వేలాదిమంది పార్టీ శ్రేణులు విజయమ్మ వెంట కదం తొక్కాయి. బైకు ర్యాలీలతో హోరెత్తించాయి. విజయమ్మ సాగించిన జనభేరితో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలు మరింత మెరుగుపడ్డాయి. భారీ మెజారిటీలతో గెలుపొందడం ఖాయమని పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
 హుటాహుటిన హైదరాబాద్ పయనం
 వాస్తవానికి విజయమ్మ తూర్పు పర్యటన ముగించుకొని పశ్చిమగోదావరికి వెళ్లాల్సి ఉంది. అయితే శాసనసభలో పార్టీ ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి హఠాన్మరణంతో పశ్చిమ పర్యటనను రద్దు చేసుకున్న విజయమ్మ.. గురువారం హుటాహుటిన మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ పయనమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement