తూర్పుగోదావరి : విభజన చట్టంలోని హామీలను కేంద్రం తక్షణం అమలు చేయాలని, లేని పక్షంలో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. హామీల అమలుకు అవసరమైన పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడేది లేదన్నారు. హామీల అమలుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
దళితులు అన్ని కులాలు, వర్గాలతో కలిసి రాజ్యాధికారసాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతోద్యోగాలు పొందిన వారంతా తమ పిల్లలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పేరుతో ప్రజల్లోకి రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కోటి పంగనామాలు పేరిట కాంగ్రెస్ నాయకులు యాత్ర చేస్తే ప్రజలు హర్షిస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు కృష్ణమాదిగ కుయుక్తులు పన్నడం ఇకనైనా మానుకోవాలన్నారు. లేని పక్షంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన వర్గీకరణను కృష్ణమాదిగ భుజాన వేసుకోవడం తన ఉనికిని కాపాడుకునేందుకేనని, దాని వల్ల ప్రయోజనం లేదన్న సత్యాన్ని అందరూ గ్రహించాలని అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొండాడ నూకరాజు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నల్లి రాజేష్, సీమాంధ్ర ఇన్‌చార్జ్ కొంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
(మామిడికుదురు)