సీమను విభజించే హక్కెవరిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాజాగా తెరమీదకు తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. ప్రజలకిది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సోమవారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘రాయల తెలంగాణ కావాలని ఎవరడిగారు? ఎంతో చరిత్ర , ఒక ప్రత్యేకత ఉన్న రాయలసీమను విభజించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారు? రాజకీయ లబ్ధి కోసం రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను విభజించాల్సిందిగా ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ వంటి వారు కోరితే చీల్చేస్తారా? రాయలసీమ అంటే లెక్కలేకుండా పోయిందా!’’ అని ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ మాదిరిగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, తమ పార్టీ ఈ చర్యను ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేసి గె లిపించిన పాపానికి వారితో చెలగాటం ఆడుతోందని, అన్నీ చూస్తూ ఏమీ చేయలేక జనం నిస్సహాయులుగా మిగిలిపోయారని అన్నారు.
కుట్రలో భాగమే..
సమైక్యవాద ఉద్యమానికి ద్రోహం చేసే కుట్రలో భాగంగానే తాజా ప్రతిపాదన చేస్తున్నారని శోభ దుయ్యబట్టారు. అసలు రాయలసీమను తమతో కలపవద్దని తెలంగాణలోని అన్ని రాజకీయపక్షాలు, టీజేఏసీలు చెబుతుంటే ఈ ప్రాంత నేతలు మాత్రం తమను కలుపుకోమని ఎందుకు దేబిరిస్తున్నట్లు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో కోరుతుంటే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని నేతలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదం చేస్తున్నారని ఆమె తప్పు పట్టారు. చిరంజీవి హైదరాబాద్‌ను యూటీ చేయాలంటారు, పురందేశ్వరి విశాఖపట్టణాన్ని రాజధాని చేయమంటారు, కొందరు కేంద్ర మంత్రులేమో ప్యాకేజీలు ఇస్తే చాలంటారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించుకోండి అంటూ బ్లాంక్ చెక్‌లాగా లేఖను ఇచ్చేస్తారు.. అంటూ శోభ మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ వీరంతా ఒకేమాట చెబితే నేడు ఈ పరిస్థితి వచ్చేదా? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు.. తాము సమైక్యవాదులమని బయటికి చెబుతూ లోపలికి పోయి అధిష్టానంతో ఏమి చెప్పి వస్తున్నారో కానీ కేంద్రం విభజనకు సిద్ధం అవుతోందన్నారు. సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీ నేత గట్టు రామచంద్రరావు చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సీనియర్ సన్నాసివి నువ్వే తుమ్మలా: గట్టు
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టుల మీద చూపిన నిర్లక్ష్యంపై తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యంలేకే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనపై అసంబద్ధమైన విమర్శలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బాబు హయాంలో సాగునీటిశాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పే యత్నం చేయకుండా ‘సన్నాసి’ అంటూ విమర్శించారన్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన తుమ్మల తనను సన్నాసి అన్నారంటే ఆయన సీనియర్ సన్నాసి అవుతారని పేర్కొన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిం ది9వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, అసలు బడ్జెటే కేటాయించకుండా ప్రాజెక్టులు కట్టామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. ఒకప్పుడు సామాన్య రైతుగా ఉన్నతుమ్మల ఈరోజు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని, తన ఆస్తులు, ఆయన ఆస్తులపై ఖమ్మంలో చర్చిం చడానికి సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు.