జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :
రాష్ట్ర విభజన నిర్ణయూన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించకుండా నివారించలేకపోరుున సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలంతా దద్దమ్మలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఘాటుగా విమర్శించారు. చేతకాని వాళ్లను ఎన్నుకోవడం వల్లే తెలుగుజాతికి ఈ దుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన బంద్ కార్యక్రమాల్లో బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని విడదీయొద్దని కోట్లాది మంది గొంతెత్తి అరుస్తున్నా కాంగ్రెస్ వారికి చెవికెక్కడం లేదన్నారు. తెలుగు ప్రజలను విడదీస్తున్న పాపం ఊరికే పోదని, రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌తో పాటు దానికి సహకరించిన టీడీపీలు త్వరలోనే బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని అన్నారు.
కేంద్రమంత్రులు, ఎంపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని, అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించినా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా జలాలు, హైదరాబాద్, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల భద్రత, భద్రాచలం వంటి అంశాలు అనేకం ఉన్నప్పటికీ.. వాటిని ప్రస్తావించకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమాల్లో పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, రావూరి కృష్ణ, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామి నాయుడు, బీవీఆర్ చౌదరి, పోల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
దద్దమ్మల వల్లే రాష్ట్ర విభజన : తెల్లం బాలరాజు
Published Sat, Dec 7 2013 4:07 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement