ఒంగోలు, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు రోజుల బంద్ శనివారంతో విజయవంతంగా ముగిసింది. రెండో రోజు ఒంగోలులో పార్టీ కార్యాలయం వద్దనుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి మంగమూరు రోడ్డు, బైపాస్, కర్నూల్‌రోడ్డులోగుండా దక్షిణ బైపాస్ వరకు ర్యాలీ నిర్వహిస్తూనే షాపులను, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. అనంతరం చర్చిసెంటర్‌కు చేరుకొని వైఎస్సార్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరో వైపు కర్నూల్‌రోడ్డులో నవభారత్ బిల్డింగ్స్ వద్ద పార్టీ నేతలు పలువురు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విభజన జరిగితే సాగునీరు సంగతి అటుంచి చివరకు తాగునీటికి కూడా ఇబ్బందిపడతారన్నారు. విద్య, వైద్య రంగంలో సైతం సీమాంధ్రలోని వారు వెనుకబాటుతనానికి గురికాక తప్పదన్నారు.
నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ పదవులకోసం పాకులాడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ పేదలు సైతం ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉపయోగపడుతుందని, కానీ వారికి ఉద్యోగాలు లభించకపోతే వారంతా ఏం కావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, వేమూరి బుజ్జి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, ఒంగోలు మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య, నగర కన్వీనర్లు కావూరి సుశీల, వివిధ విభాగాాల నేతలు జాజుల కృష్ణ, మారెడ్డి రామకృష్ణారెడ్డి, తోటపల్లి సోమశేఖర్, సింగరాజు వెంకట్రావు, యువజన విభాగం జిల్లా అధికారప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, మీరావలి పాల్గొన్నారు.
కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రమంత్రులు వారి స్వప్రయోజనాలను ఆశించి ప్యాకేజీలకు కట్టుబడడం వల్లే నేడు రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే అని, ఆయనకు మద్దతు పలికేందుకు ప్రతి ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని కోరారు.
చీరాలలో నియోజకవర్గ సమన్వయకర్తలు అవ్వారు ముసలయ్య, యడం చినరోశయ్య ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కేవలం తెలంగాణ లో పార్టీని బతికించుకోవాలనే ఏకైక లక్ష్యంతో సోనియా గాంధీ చేసిన దారుణ కుట్ర అని పేర్కొన్నారు. పామూరులో పార్టీ నాయకులు దాదాపు గంటపాటు రాస్తారోకో చేశారు. టంగుటూరు, సింగరాయకొండల్లో మండల కన్వీనర్లు బొట్ల రామారావు, కిరణ్‌కుమార్‌లు రాస్తారోకో చేసి సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించేందుకు అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వై.పాలెంలో సోనియా దిష్టిబొమ్మను నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు దహనం చేశారు. ఉలవపాడులో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి రాస్తారోకో నిర్వహించారు.
గిద్దలూరులో రైతు విభాగం జిల్లా అధికార ప్రతినిధి దప్పిలి రాజేంద్రప్రసాదరెడ్డి, స్థానిక నేతలతో కలిసి వైఎస్సార్ సెంటర్‌లో మానవహారం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే వెలిగొండ లాంటి ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉండదన్నారు. మార్కాపురంలో స్థానిక నేతలు మోటారు బైకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు వై.పాలెంలోని వైఎస్సార్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సీమాంధ్రుల మనోభావాలను తీవ్రంగా బాధించిందన్నారు. అయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
నిరసన హోరు
Published Sun, Dec 8 2013 2:57 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement