జాతీయ పార్టీకి ప్రాంతీయతత్వామా?
విభజన వల్ల రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కొందరు బీజేపీ నేతలు ఏపీకి అన్యాయం జరిగిందని చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ప్రజలలోని సహోదర భావానికి చెరుపు చేస్తుంది.
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే జాతి గా కలిసిమెలిసి అభివృద్ధి చెందాలనేదే తెలుగు ప్రజలందరి ఆకాంక్ష. రెండు రాష్ట్రాలలో రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటం ఆ ఆకాంక్షకు ఆటంకం కారాదు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన, తలెత్తనున్న సమస్యలను జాతీయ సమగ్రత, తెలుగు జాతి ఐక్యతలకు ప్రాధాన్యమిచ్చి సామరస్య పూర్వకంగా పరిష్కరించాల్సిన చారిత్రక బాధ్యత కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్‌కే అద్వానీ, వెంకయ్యనాయుడు వంటి ఆ పార్టీ అగ్ర నేతలు రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యనించడం దురదృష్టకరం. విభజన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తతలను, అపోహలను పెంచుతాయని వారు విస్మరించడం శోచనీయం.
దీర్ఘకాలంగా ఒకే ఆర్థిక యూనిట్‌గా ఉంటూ విడిపోయిన ఏపీ, తెలంగాణలు రెండూ కొంతకాలం పాటూ తీవ్ర సమస్యలకు గురికాక తప్పదు. ఏపీకి రాజధాని లేకపోవడం, తెలంగాణకు సకల హంగులతో కూడిన రాజధాని ఉండటం వాస్తవం. భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయంగా, సాం స్కృతికంగా హైదరాబాద్ తెలంగాణలో విడదీయరాని భా గం. అందులో ఎవరు ఎవరికి చేసిన అన్యాయమూ లేదు. అనివార్యమైన ఈ ఒక్క అననుకూలతను మినహాయిస్తే ఏపీ కి సకల వనరులు ఉన్నాయి.
దాదాపు 1,000 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన తీరప్రాంతం, అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన విశాఖపట్నమేగాక క్రిష్ణపట్నం, కాకినాడ, గం గవరం ఓడ రేవులున్నాయి. అది అన్యాయమని తెలంగాణ ప్రజలు భావించడం లేదు. ఏపీలోని చమురు, సహజవా యు వనరులు, విద్యుదుత్పత్తి కేంద్రాలు సత్వర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయి. అనుభవజ్ఞులు, సంపన్నులైన సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు... కేంద్రం ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర హోదాను ఉపయోగించుకుని భారీగా పెట్టుబడులు పెడతారనడంలో సందేహం లేదు. ఈ వాస్తవాలను విస్మరించి రెండు రాష్ట్రాల మధ్య ఐక్యతను పెంపొందింపజేయాల్సిన నేతలే ఏపీకి అన్యాయం జరిగిందనడం పొరబాటు.
హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, తదితర పరిశ్రమలు న్నాయి. అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలున్నాయి. కానీ విభజన తదుపరి తెలంగాణ 2,000 మెగావాట్ల విద్యు త్ లోటుతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఏపీ జెన్‌కో 8,925 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 54 శాతం తెలంగాణలో, 46 శాతం సీమాంధ్రలోఉన్నాయి. కానీ తెలంగాణలోని 52 శాతం సామర్థ్యం రిజర్వాయర్లలోకి వచ్చి చేరే నీటి ప్రవాహంపై ఆధారపడ్డ అనిశ్చితితో కూడిన జలవి ద్యుత్తే. ఏపీ జెన్‌కో కొత్తగా చేపడుతున్న 3,210 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులలో 70 శాతం సీమాంధ్రలో ఉండగా, 30 శాతం మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అలాగే ఎన్‌టీపీసీ కొత్తగా చేపట్టనున్న 5,320 మెగావాట్ల ప్రాజెక్టులలో 4.000 మెగావాట్లు కోస్తాంధ్రలో, 1,320 మెగావాట్లు తెలంగాణలో ఉంటాయి. ‘సాగునీటికోసం, తాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములపైనే ప్రధానంగా ఆధారపడ్డ తెలంగాణ విద్యుత్ రంగంలో తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సివస్తుంద’నీ, ‘కేజీ-బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి పుంజుకోవడంతోనే గ్యాస్ ఆధారిత విద్యుత్తుతో ఏపీ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుతుంద’ని వై హరీష్ చంద్రప్రసాద్ అన్నారు. ఆయన తెలంగాణవాది కారు, ఒకప్పటి ఏపీసీఐఐ చైర్మన్, నేటి కో స్తారాయల అభివృద్ధి ఫోరం చీఫ్ కోఆర్డినేటర్. విద్యుత్ కొర త హైదరాబాద్‌లోని ఐటీ, ఫార్మా రంగాలు సహా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని కుంటుపరిచింది. పలు పరిశ్రమలు మూతపడ్డాయి. తెలంగాణ పారిశ్రామిక, వ్యవసాయ రం గాలు తీవ్రసంక్షోభం ముప్పును ఎదుర్కొంటున్నాయి.
దేశ ఆర్థికాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి ప్రధాని నరేంద్రమోడీ ఇరుగుపొరుగు దేశాలతో సయోధ్యకు అగ్రతాంబూలం ఇస్తుండగా... బీజేపీ నేతలు ప్రాంతీయ సంకుచితత్వానికి గురికావడం ఆశ్చర్యకరం. కేంద్ర విద్యుత్ మం త్రి పియూష్ గోయల్ త్వరలో మిగులు విద్యుత్ రాష్ర్టం కానున్న ఏపీని 24 గంటల విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. సాటి తెలుగువారిగా దాన్ని స్వాగతిస్తున్నాం. తీవ్ర లోటు విద్యుత్ రాష్ట్రంగా అతి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలంగాణకు ఆ సదుపాయాన్ని కలిగించకపోవడం పక్షపాతం అనిపించుకోదా?
- గుడిసె సాల్మన్‌బాబు
(ఐఎన్‌టీయూసీ దక్షిణ భారత ఉపాధ్యక్షులు, ఖమ్మం)