రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర పొందగానే నేడో రేపో కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర పొందగానే నేడో రేపో కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది. సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. అవతరణ తేదీని మాత్రం ఇంకా నిర్ణయించుకోలేకపోతోంది. ఇప్పుడే విడగొట్టాలా? ఎన్నికల తరువాతనా? అన్న అంశం పై ఇంకా కసరత్తు పూర్తికాలేదు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు విముఖతతో ఉంది. రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆర్టికల్-353 ప్రకారం తిరిగి రెండు నెలల్లోగా పార్లమెంటు సమావేశమై దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరమైన నిబంధనలను, రాజకీయపరమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది.