సీపీఐ సదస్సులో వక్తలు సీమాంధ్రకు ప్రత్యేక హోదా బోగస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తయినందున రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పడం మాని ఉభయ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో సముచిత ప్రాధాన్యత కల్పించాలని పిలుపునిచ్చారు. సీపీఐ అనుబంధ సంస్థ నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రొఫెసర్ కేఆర్ చౌదరి అధ్యక్షతన జరగిన సదస్సులో వివిధ రంగాల మేధావులు, నిపుణులు హాజరయ్యారు. రాష్ట్ర విభజనతో నష్టపోయేది రాయలసీమేనని వక్తలు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో విద్యుత్ చార్జీల భారం పెరుగుతుందన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని ప్రకటించిన ప్రత్యేక హోదా పెద్ద బోగస్ అని అభిప్రాయపడ్డారు. ఆదివాసీల సమస్యలపై నీటిపారుదల రంగ ప్రముఖుడు టి.హనుమంతరావు, వ్యవసాయాభివృద్ధిపై బి.యర్రంరాజు, ఖనిజాల వినియోగంపై టీబీ చౌదరి, కృష్ణాజలాల పంపిణీపై చెరుకూరి వీరయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి కె.నారాయణ, కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, రాంనరసింహారావు, ఆర్థిక విశ్లేషకుడు డి.పాపారావు పాల్గొన్నారు.