
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా గొంతునొక్కేయాలని చూస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికం అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదని చెప్పారు.
ఏ ఉద్యమాలను ఉపయోగించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో ఇప్పుడు వాటినే అణచివేస్తూ నిజాం పాలనను తలపిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయలేదని తమ కేంద్ర మంత్రులను ఉపసంహరించుకున్న టీడీపీ ఇంకా ఎన్డీయేలో కొనసాగుతుండటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. కేంద్రం తీరుపై అసెంబ్లీలో ఏడ్పులు, పార్లమెంటులో ధర్నాలు చేస్తున్న టీడీపీ ఇంకా ఎన్డీయేలో ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు.