రాజ్యాంగ విరుద్ధమని తెలిసీ..
పార్లమెంటులో ఏం జరిగింది-41
అరుణ్ జైట్లీ, కపిల్ సిబల్ ఇద్దరూ సుప్రీం కోర్టులో పెద్ద పేరున్న న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులు. రాజ్యాంగ విరుద్ధమో, కాదో... ముందు బిల్లు పాస్ చేసేద్దాం అనుకుని ‘పాస్’ చేసేశారు!
లోక్‌సభ, రాజ్య సభల్లో జరిగింది జరి గినట్లుగా సాక్షిలో ప్రచురితమైనప్పుడు పాఠకుల్లో కనిపించిన ఆసక్తి... అంతంత మాత్రం! జైపాల్‌రెడ్డి గారి జోక్యం విష యమై, నేను ఊహిం చి రాసింది మాత్రం, చాలా మంది చదివినట్లు తెలుస్తోంది!! అత్యధిక సంఖ్యలో ఇ-మెయిల్స్ అభినందనలతో వస్తున్నాయి. కొన్ని మెయిల్స్ మాత్రం, ఎందుకిప్పుడీ విషయాలు రాస్తున్నారు, పాత గాయాల్ని ఎందుకు రేపుతున్నారు, ఏమి ఆశించి ఆ కథనాలు?! అంటూ ప్రశ్నిస్తున్నాయి.
నిజానికి, రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక అంశాలను, నేను గ్రంథస్తం చేసి చాలా కాలమయింది. అందులో భాగంగానే పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను కూడా అనువదించాను. మొన్నటి వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో జైపాల్‌రెడ్డిగారి ప్రెస్‌మీట్‌ను టీవీలో చూసిన తర్వాతే ఆ నాలుగు ఆర్టికల్స్ రాశాను. నన్ను ప్రశ్నిస్తూ వచ్చిన ఇ-మెయిల్స్‌లోని ప్రశ్నలకు నా వ్యాసాల్లో సమాధానం దొరుకుతుంది. రాష్ట్ర విభజన విషయంలో ఏఏ పార్టీ ఎలా ప్రవర్తించింది... ఏఏ నాయకులు ఎలా ప్రవర్తిం చారు... నా ‘యాంగిల్’లో విశ్లేషించాను. విడు దల అవ్వబోయే నా ‘పుస్తకం’లో అవన్నీ ఉంటాయి.
కోర్టు కేసు ఏమయ్యిందని కొందరు ప్రశ్నించారు. సుమారు నలభై మంది సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 2013 నుంచే, జరుగుతున్న ప్రక్రియను ‘చాలెంజ్’ చేస్తూ పిటిషన్లు దాఖలవుతూ వచ్చాయి! కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘కౌంటర్’ దాఖలే చేయలేదు. వాయిదాలు పడ్తూనే ఉన్నాయి. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడూ అయిన అరుణ్‌జైట్లీ, 20-2-2014 నాడు, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, కోర్టు కొట్టేస్తుందని స్పష్టంగా చెప్పారు. దానికి సమాధానమిస్తూ, ‘ఒక వేళ కోర్టు కొట్టేస్తే, అప్పుడున్న ప్రభుత్వం కోర్టు చెప్పినట్లు నడుచుకోవచ్చు’ అన్నారు నాటి న్యాయమంత్రి కపిల్ సిబల్.
ఇద్దరూ సుప్రీంకోర్టులో పెద్ద పేరున్న న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులు. రాజ్యాంగ విరుద్ధమో, కాదో... ముందు బిల్లు పాస్ చేసేద్దాం అనుకుని ‘పాస్’ చేసేశారు! సుప్రీంకోర్టులో ‘కౌంటర్’ మాత్రం దాఖలు చెయ్యరు!! మన దేశ న్యాయ వ్యవస్థలో ‘ఆలస్యం’ అనేది అతి సాధారణం. ఆలస్య మైనా, అన్యాయం జరగదని ఒక ఆశ! ఇప్పుడు కోర్టు ఇవ్వబోయే తీర్పు వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి... మళ్లీ రెండు రాష్ట్రాలూ కలిపేస్తారా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఎస్‌ఆర్ బొమ్మైఅనే కర్ణాటక ముఖ్య మంత్రిని పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు. 1989లో ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన దాన్ని కోర్టులో ప్రశ్నించాడు. 1994లో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చెయ్య లేదు గానీ, బొమ్మైకేసు భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక ‘మైలురాయిగా నిలిచి పోయింది. 1994 తర్వాత ‘రాష్ట్రపతి పాలన’ పేరిట కేంద్ర పెత్తనమే ఆగిపోయింది.
సుప్రీంకోర్టు ఆర్టికల్ 356ను అమలు చేయడానికి మార్గదర్శకంగా నిలిచే చరిత్రాత్మకమైన వ్యాఖ్యానం చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన కేసు కూడా కేశవానంద భారతి, మినర్వా మిల్స్, ఎస్‌ఆర్ బొమ్మైకేసుల్లాగే ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని అందిస్తుంది. ఫెడరల్ వ్యవస్థ గురించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేయవల్సిన తీరు గురించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. కాంగ్రెస్+ బీజేపీ తెలంగాణ విభజన చేసేయాలని నిర్ణయించు కున్నాక, అది అప్పుడైనా, ఇప్పుడైనా కచ్చి తంగా జరిగి తీరుతుంది! నా ‘పుస్తకం’ కేవలం నేను నిజమనుకున్న కొన్ని విషయాలు, అందరికీ తెలియని విషయాలు, ప్రజల ముం దుంచటానికే ఉద్దేశించబడింది. ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ‘సాక్షి’ ద్వారా తెలియచేస్తు న్నాను. జరిగిందేమిటో తెలుసుకోకపోతే, అది ప్రజాస్వామ్యమే కాదని నా భావన! నా ‘ఆర్టికల్స్’లో జరిగింది జరిగినట్లే రాశాను. ఊహించటానికి నాకెలా హక్కువుందో, నా ఊహతో విభేదించడానికి పాఠకులకు కూడా అంతే హక్కు ఉంది. అభినందిస్తున్న వారికి, విభేదిస్తున్న వారికీ కృతజ్ఞతలు... ఆర్టికల్స్ చదివినందుకు...
ఉండవల్లి అరుణ్ కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com