బీఎస్‌ఎఫ్ వాహనం బోల్తా,
ధోబీ మృతి
ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు హెచ్‌సీలు, ఆరుగురు
కానిస్టేబుళ్లకు గాయాలు
విశాఖ సెవెన్ హిల్స్‌కు
క్షతగాత్రుల తరలింపు
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
అప్పుడే తెల్లవారుతోంది.... ఇంకా మం చుపొరలు వీడలేదు. చాలా దూరం నుంచి వస్తున్న వారంతా మరో 15 నిమిషాల్లో గమ్యం చేరుకుంటారు. ముందువెళుతున్న మూడు వ్యాన్‌లు వెళ్లిపోయాయి. నాల్గో వ్యాన్ కల్వర్టు దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా రోడ్డుపై గేదె ప్రత్యక్షమైంది. అంతే దాన్ని తప్పించబోయే యత్నంలో వ్యాన్ అదుపుతప్పింది. హాహాకారాలు మిన్నం టాయి. అంతలోనే తేరుకున్న వారంతా అప్రమత్తమయ్యారు. గాయాలతో బయటపడ్డారు. అయితే అలసి కునుకుతీసిన ఓ ధోబీ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
బొండపల్లి, న్యూస్‌లైన్: బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఐదు గంటలకు బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ ధోబీ మృతి చెందగా ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు హెచ్‌సీలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ అహ్మద్ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా లక్ష్మీపురం నుంచి బీఎస్‌ఎఫ్ 28వ బెటాలియన్ సిబ్బంది 51 మందిని నాలుగు వ్యాన్లలో విజయనగరానికి రప్పించారు. అయితే గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. విజయనగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గేదె అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఒక్కసారిగా వాహనం రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడపైకి వెళ్లి, పక్కనున్న గొతిలోకి బోల్తా పడిపోయింది. గోతిలో దట్టమైన పొదలు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే జవాన్లు అందరూ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై గాయాలతో బయటపడ్డారు. అప్పటికే నిద్రపోతున్న బీఎస్‌ఎఫ్‌కు చెందిన ధోబీ మునీంద్ర కుమార్ (40)పై ఆయుధాల కిట్లు పడిపోవడంతో తప్పించుకోలేక తీవ్ర గాయాలపాలయ్యాడు.
అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు హెచ్‌సీలు ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ వ్యానులో మొత్తం పన్నెండు మంది ఉన్నారు. మునీంద్రకుమార్‌ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లా జమునీయా గ్రామం. ఏఎస్‌ఐలు రాజేంద్రభారతి, విజయేంద్రసింగ్, హెచ్‌సీలు శైలింద్రకుమార్, అఖిలేష్‌చంద్, బోలారామ్‌లతో పాటు జవాన్లు ధీరేంద్రసింగ్, టీసీ దాస్, మనోజ్‌కుమార్, బిస్వాస్, గోపీనాథ్, హర్భజన్‌సింగ్ గాయాలపాలయ్యారు. వీరిని తొలుత 108 వాహనం సాయంతో విజయనగరం తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ సెవెన్‌హిల్స్‌కు తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్‌అహ్మద్, సీఐ చంద్రశేఖర్, బొండపల్లి ఎస్‌ఐ జె.తారకేశ్వరరావు, గజపతినగరం ఎస్‌ఐ సాయికృష్ణ, మానాపురం ఎస్‌ఐ యు.మహేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఏకే47 గన్‌లు, బుల్లెట్లు తదితర ఆయుధాలు ఉండడంతో వాహనం వద్ద బీఎస్‌ఎఫ్ సిబ్బంది పహారా కాశారు.
ఎస్పీ సందర్శన
ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. అనంతరం గజపతినగరం ఆస్పత్రిలో ఉన్న ధోబీ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని విశాఖపట్నం విమానాశ్రయానికి బాక్స్‌లో తరలించారు.
భద్రత కోసం వస్తూ...బలి
Published Fri, Feb 21 2014 1:34 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement