బిల్లు ఈ రోజే పాసై తీరాలి | Bifurcation bill must be passed by today itself | Sakshi
Sakshi News home page

బిల్లు ఈ రోజే పాసై తీరాలి

Published Wed, Dec 9 2015 9:53 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

బిల్లు ఈ రోజే పాసై తీరాలి - Sakshi

బిల్లు ఈ రోజే పాసై తీరాలి

పార్లమెంటులో ఏం జరిగింది-34
18-2-2014 సమయం 12.47 మధ్యాహ్నం. (లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమ యం జరగకుండా అడ్డుపడిన సీమాంధ్ర సభ్యులు, మరికొందరు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల సభ్యులూ మళ్లీ నినాదాలు చేస్తూ సభ జరగనివ్వలేదు. పదిహేను మంది సీమాంధ్ర సభ్యుల్ని ‘సస్పెండ్’ చేసినా, ఇంకా ‘వెల్’లో గొడవ మాత్రం అలాగే జరుగుతోంది! చిదంబరం, ఫైనాన్స్ బిల్లు కాగి తాలతో సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణ బిల్లు 15వ లోక్‌సభలో పాసయ్యే అవకాశాలు లేనట్టే కనబడుతు న్నాయి.) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ హడావుడిగా స్పీకర్ చాంబర్స్‌లోకి వెళ్లారు. వెనకాలే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా వెళ్లారు. కమల్‌నాథ్ స్పీకర్‌తో రెండు నిమిషాలు మాట్లాడి బైటికొచ్చారు.
 
 చుట్టూ చేరిన తెలంగాణ ఎంపీలతో క్లుప్తంగా ‘‘కష్టం... ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాసవ టం కష్టం! బీజేపీ సహకరించటం లేదు!!’’ అని చెప్పి వెళ్లిపోయారు. హతాశులైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, అక్కడే లోక్‌సభ మొదటి వరసలో కూర్చుని, ఎవరితోనో ముచ్చటిస్తున్న జైపాల్‌రెడ్డిగారి దగ్గరకు వెళ్లారు. ‘‘సార్ తెలంగాణ బిల్లు పక్కన పెట్టేశారట’’ అని చెప్పారు. ‘ఎందుకని’ అని ప్రశ్నించారు జైపాల్! ‘‘ఏమో, కమల్‌నాథ్, బీజేపీ కలిసిరావటం లేదంటూ’’ చెప్పి వెళ్లిపోయాడు ‘‘కమల్‌నాథ్ చాంబర్స్‌కి వెళ్లి ఉన్నా రేమో చూడండి... ‘నేనొస్తాను’ అన్నారు జైపాల్.
 
 కమల్‌నాథ్ ఉన్నారో లేదో చూద్దామని వెళ్లిన ఎంపీలు, లోక్‌సభ పక్కనే ఉండే ఆయన ఆఫీసు రూం నుంచి ఆయనను వెంటబెట్టుకుని వచ్చేశారు. ఎప్పుడైతే జైపాల్‌రెడ్డి మీ దగ్గరకు వస్తారట’ అన్నారో... కమల్‌నాథే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, లోక్‌సభలోకి వచ్చే శారు. జైపాల్‌రెడ్డి, కమల్‌నాథ్‌ని తన పక్కనే కూర్చో బెట్టుకుని, మిగతా ఎంపీలందర్నీ కొంచెం దూరంగా కూర్చోమన్నారు.
 
 ‘‘ఇలాగైతే కష్టం జైపాల్‌రెడ్డిగారూ, ఎన్డీఏలో బీజేపీ తప్ప మరే పార్టీ ఈ తరహా విభజనకి ఒప్పుకోవటం లేదు. యూపీఏకు మద్దతునిచ్చే పార్టీలూ వ్యతిరేకిస్తు న్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ మద్దతిస్తూనే ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలు చెయ్యటానికి అంగీకరించా లంటూ మెలిక పెడుతోంది. అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మేమెలా సహకరిస్తామంటు న్నాయి ప్రాంతీయ పార్టీలు. బిల్లు పాసవ్వటానికి కావా ల్సిన బలం, అనుమానమే! బిల్లు పాసవటమే అను మానంగా ఉంటే, గవర్నర్‌కి ‘లా అండ్ ఆర్డర్’ అప్ప చెప్పాలంటే, రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అంటోంది బీజేపీ...
 
 కష్టం జైపాల్‌జీ... ‘పెప్పర్‌స్ప్రే’ను అడ్డం పెట్టుకుని పదిహేనుమంది ఆంధ్రావాళ్లని సస్పెండ్ చేసి బైట పెట్టేసినా లెక్క సరిపోవడం లేదు...’’ అన్నారు కమల్ నాథ్. ‘‘లెక్క సరిపోకపోవటమేమిటి కమల్... కాంగ్రెస్ వాళ్లమే రెండొందలు దాటి ఉన్నాం. బీజేపీ నూట పది హేను అనుకుంటా...! ఇదిగాక ఎన్‌సీపీ, మాయావతి పార్టీ ఇంకా చిన్న చిన్న పార్టీలూ... ముందునుంచి లెక్క పెట్టుకుంటూనే ఉన్నాంగా...!! రాజ్యాంగ సవరణ చెయ్యాలంటే మూడింట రెండొంతులు మెజార్టీ ఉండాలి గానీ సింపుల్ మెజారిటీకి సరిపోకపోవటమేమిటి. రా... నేను సుష్మాస్వరాజ్‌తో మాట్లాడతా! అన్నారు జైపాల్.
 
 ‘‘స్పీకర్‌తో మరో గొడవ. ‘వెల్’లో సభ్యుల్ని సస్పెం డ్ చేసి, రేపు పెట్టండి బిల్లు అంటోంది ఆవిడ. సభ సజా వుగా జరక్కపోతే ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసుకోవటం ఎలా సాధ్యం... అంటోంది. సభ సజావుగా నడపటం, రూల్స్ ప్రకారం స్పీకర్ బాధ్యత. ఈ రోజు ‘వెల్’లో ఉన్నవాళ్లని సస్పెండ్ చేసి రేపు ఈ బిల్లు పెడ్దామంటే, రేపింకో పది మంది ‘వెల్’లోకి వస్తారు. ఈలోగా సస్పెన్షన్ గడువు ముగిసి ఆ పదిహేను మంది కూడా మళ్లీ వచ్చేస్తారు’’ కమల్‌నాథ్.
 ‘‘ఏం కంగారు పడకయ్యా... నేను చెప్తా. ఏం చెయ్యాలో’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను పిలిచి ‘‘సుష్మాస్వరాజ్‌ని నేను పిలుస్తున్నానని చెప్పి స్పీకర్ చాంబర్స్‌కి తీసుకురండి’’ అన్నారు జైపాల్.
 
 ‘‘కమల్... నేను నాలుగు దశాబ్దాలుగా రాజకీ యాల్లో ఉన్నాను. ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు చేసె య్యటమే... చెయ్యకూడదనుకున్నప్పుడు, రూల్స్ చట్టాలు, రాజ్యాంగం మాట్లాడి చెయ్యకుండా ఎగ్గొట్ట వచ్చు! మనకి మంచిదనే గదా ఒక పని చేద్దామను కుంటాం... దానికి కూడా రూల్స్ అడ్డం వస్తే, ఇక ఆ రూల్స్‌కి ఎందుకు విలువివ్వాలి? నడు... స్పీకర్‌తో, సుష్మతో నేను మాట్లాడతా! బిల్లు ఈ రోజే పాసయి తీరాలి... లేకపోతే, ఇక ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాదు. నడు... స్పీకర్ చాంబర్స్‌కి వెడదాం’’ అంటూ లేవటానికి ఉపక్రమించారు జైపాల్.
 
ఇంతలో సుష్మా స్వరాజ్ దగ్గరకు వెళ్లిన ఎంపీలు పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘సార్, మీతో మాట్లాడటానికి అభ్యంతరం లేదు గానీ స్పీకర్ చాంబర్స్‌కి మాత్రం రానంటోంది సుష్మా స్వరాజ్. కాంగ్రెస్ పార్టీ కావాలనే డ్రామా ఆడుతోందని, ఇప్పుడు బిల్లు పాసయితే ఆ పేరు కాంగ్రెస్‌కి, అవ్వకపోతే ఆ చెడ్డ పేరు బీజేపీకి వచ్చేలా వ్యూహరచన చేశారని ఏదేదో మాట్లాడుతోంది ఆమె’’ అంటూ వాపోయారు.
 వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com
 - ఉండవల్లి అరుణ్‌కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement