సాక్షి, నాగర్‌కర్నూల్: పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నప్పటికీ నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై ఎటూ తేలడం లేదు. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఒక్కో పార్లమెంట్ స్థానానికి నాలుగు నుంచి, ఐదుగురి ఆశావహులతో కూడిన జాబితాను ప్యానెల్ ఖరారు చేసింది. ఈ జాబితాలో తమకు అనుకూలమైన వారి పేర్లు లేకపోవడంపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే మరోసారి సీనియర్ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపినట్లు సమాచారం.
మహబూబ్‌నగర్‌లో పోటీకి జైపాల్ అనాసక్తి
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంíపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీపట్ల విధేయత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారిలో పీఏసీ జాబితా తయారు చేసి పంపినట్లు సమాచారం. ఈ జాబితాలో జైపాల్‌రెడ్డి పేరు లేకపోవడంపై మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. గాంధీభవన్ వేదికగా నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయపడ్డాయి. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపకపోగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా మరోసారి మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో ఆయనే ఉంటారని చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మక్తల్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంలోనూ, నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డికి కాంగ్రెస్ తరఫున టికెట్ రాకుండా చూడడం, దేవరకద్ర నియోజకవర్గం ఆలస్యంగా పవన్‌కుమార్‌కు కేటాయించడం వంటి అంశాల్లో జైపాల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు పోటీచేయకుండా తప్పుకుంటున్నారని డీకే అరుణ వంటి సీనియర్ నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డి లేదా రేవంత్‌రెడ్డి వారు ఇరువురు కాకుంటే మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిలను పోటీలో ఉంచాలని ఆమె ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
మరోసారి నంది ఎల్లయ్య?
తెలంగాణలోనే ఏకైక కాంగ్రెస్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్య మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నంది ఎల్లయ్య పోటీ చేయాలని భావిస్తే సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన పోటీ చేయకపోతే దరఖాస్తు చేసుకున్న వారిలోనే అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించినప్పటికీ అవకాశ రాలేదని ఈ సారైన అవకాశం ఇవ్వాలని కోరుతున్న వికారాబాద్ కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ పాటు సతీష్ మాదిగ పేర్లను డీకే అరుణ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరితో పాటు నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణకూడా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. వీరందరితో పాటు డీసీసీ సెక్రెటరీ బాలకిషన్ పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది వేచి చూడాలి. మొత్తంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మరోసారి కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది.
గాంధీభవన్ వేదికగా బయటపడ్డ విభేదాలు
Published Thu, Feb 28 2019 8:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment