టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు | Uttam Kumar Reddy won the Lok Sabha election | Sakshi
Sakshi News home page

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు

Published Fri, May 24 2019 5:00 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy won the Lok Sabha election - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ తిరిగి నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీని సాధించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌ అయిదో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,26,028 ఓట్లు పోలయ్యాయి.

కాగా, ఆయన ప్రత్యర్థి వేమిరెడ్డి(టీఆర్‌ఎస్‌)కి 5,00,346 ఓట్లు వచ్చాయి. నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ గెలుచుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో (2014) ఈ స్థానం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఒక దశలో కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత కనిపించింది. ఏఐసీసీ ఆదేశాలతో ఉత్తమ్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి గెలుపు తీరాలను చేరుకున్నారు.  

ఉత్తమ్‌.. ఆరోసారి!
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా ఆరోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిలటరీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉత్తమ్‌ మొదటిసారి 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, 1999లో అదేస్థానం నుంచి ఆయన గెలుపొంది ఇక వెనుదిరిగి చూడలేదు. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ కోదాడ నుంచి ఆయన విజయం సాధించారు.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ నల్లగొండ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించడం విశేషం. మొత్తం మీద వరుసగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలుపొందిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపును సాధించారు.

 టీఆర్‌ఎస్‌ను అసహ్యించుకుంటున్నారు
‘తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని అసహ్యించుకుంటున్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలే’ అని నల్లగొండ లోక్‌సభ స్థానం విజేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌లో అహంభావ ధోరణి పెరిగిందని, దాన్ని తెలంగాణ ప్రజలు సహించకనే ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌తో పాటు వేరే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement