Telangana Election Results 2019
-
‘సీఎం కుడి భుజాన్ని ఓడగొట్టాం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిస్తే.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయిందని వారి పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుని పునీతులు అవుతున్నారని అన్నారు. ప్రజలు నమ్మి ప్రతిపక్షస్థానం ఇస్తే కూడా.. వ్యాపారాల కోసం అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మీద పోరాటం చేసే స్థాయిలో కాంగ్రెస్ లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందనీ, ఉత్తమ్ జైలుకు వెళ్తాడని టీఆర్ఎస్ నాయకులు అన్నారు కానీ ప్రస్తుతం వారు లోపాయికారి ఒప్పందంపై ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి విజయ దుందుభి మోగించామని, ఉద్దండుల మీద భారీ మెజార్టీతో గెలిచామన్నారు. బీజేపీ ఎంపీలు జెయింట్ కిల్లర్స్.. సీఎం కూతురును, కుడి భుజాన్ని ఓడగొట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందన్నారు. జాతీయ స్థాయిలోని వారి నాయకుడే అస్త్ర సన్యాసం చేశారని ప్రస్తుతం దిక్కూ దివాణం లేకుండా ఉందని అన్నారు. బీజేపీ విజయాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఉన్నాయని విమర్శించారు. కేటీఆర్ ఇప్పుడు మోదీ హవా అంటున్నాడు.. ఎన్నికల ఫలితాలకు ముందు హవా లేదన్నావుగా అని నిలదీశారు. పోస్టల్ బ్యాలెట్లో 38 శాతం ఓట్లతో బీజేపీదే అగ్రభాగమని తెలిపారు. 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని అన్నారు. యూపీలో స్వయంగా రాహుల్ ఓడిపోయాడని ఆరు రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటును మాత్రమే గెలిచిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. ఉత్తమ్, కేసీఆర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌తో గెలిచారని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పోకడతో టీఆర్ఎస్ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ బీజేపీలో చేరారని అన్నారు. అమిత్ షా టార్గెట్ తెలంగాణ అని.. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమం ఆగదని, ఇప్పుడు బీజేపీ కూడా అంతేనని అన్నారు. ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను రోడ్ మీద వేశారని, ఇంటర్ తప్పిదాల విషయంలో ఇంటర్ కార్యదర్శి అశోక్‌ను, విద్యాశాఖా మంత్రిని తప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
కరీంనగర్ ప్రజల విభిన్న తీర్పు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అనేక సందర్భాల్లో కీలక రాజకీయ మార్పులకు కారణమైన కరీంనగర్ ప్రజానీకం ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో సైతం విజ్ఞతను ప్రదర్శిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో శాసనకర్తలను నిర్ణయించడంలో కరీంనగర్ ఓటర్లు వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. గాలివాటం తీరు తీర్పులకు భిన్నంగా స్థానిక, జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు జరిగిన మూడు భిన్నమైన ఎన్నికల్లో ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీకి అనుకూలంగా ఓటేసి తమ విభిన్నతను చాటుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీకి అప్రతిహత విజయాలను అందించిన కరీంనగర్ వాసులు మార్చిలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్‌కు పట్టం కడితే, ఉపాధ్యాయులు తెలంగాణ పీఆర్టీయూ వెంట నడిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అందుకు భిన్నంగా వ్యవహరించి జాతీయవాద దృక్పథంతో బీజేపీని గెలిపించారు. మూడు ఎన్నికల్లో మూడు రకాల తీర్పునిచ్చి తమ పరిణతిని చాటుకున్నారు కరీంనగర్ వాసులు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొట్టారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 10 చోట్ల టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలనే గెలిపించారు. కేవలం పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును భారీ మెజారిటీతో గెలిపించి స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రామగుండంలో టీఆర్ఎస్ టికెట్ లభించక సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్ అనే రిజిష్టర్డ్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన కోరుకంటి చందర్‌కు విజయాన్ని అందించారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఓడిపోయినా, చందర్‌ను సైతం టీఆర్ఎస్ అభ్యర్థిగానే పరిగణించి గెలిపించడం గమనార్హం. మిగతా పది అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నింటిలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం గెలుపొందడం గమనార్హం. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ తెలుగుదేశంతో దోస్తీ చేసిన కాంగ్రెస్ పార్టీని విశ్వాసంలోకి తీసుకోలేక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించి విభిన్న తీర్పును ఇచ్చారు. మండలిలో ప్రశ్నించే గొంతుకకు పట్టాభిషేకం శాసనమండలిలో పదవీకాలం ముగిసిన మండలి చైర్మన్ స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి స్థానంలో జరిగిన ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి చాలా రోజుల తరువాత అధికార పార్టీకి తొలి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ బలపరిచిన గ్రూప్–1 అధికారిగా రాజీనామా చేసి పోటీలో నిలిచిన అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. మండలిలో ప్రశ్నించే గొంతుక అవసరమని ప్రచారం చేసిన జీవన్‌రెడ్డి పట్ల పట్టభద్రులు విశ్వాసం చూపారు. అలాగే ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన పాతూరి సుధాకర్‌రెడ్డిని టీచర్లు ఓడించి పీఆర్టీయూ అభ్యర్థిని గెలిపించి, మండలికి పంపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అండగా... జాతీయ రాజకీయాల ప్రభావమో, ప్రధాని నరేంద్ర మోదీ మీద అభిమానమో, బండి సంజయ్ పట్ల సానుభూతో తెలియదు గాని లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా వాసులు బీజేపీని నెత్తికెక్కించుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బి.వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో 90వేల మెజారిటీ సంజయ్‌కు రావడం విశేషం. వరంగల్, సిద్దిపేట జిల్లాల ప్రభావం ఉన్న హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో ఓటర్లు టీఆర్ఎస్కు అండగా నిలవగా, సిరిసిల్లలో సైతం బీజేపీకి మద్దతు పలికారు. మిగతా నియోజకవర్గాల్లో పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో సైతం ఓటర్లు బీజేపీకి అండగా నిలిచి, అక్కడి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. కాగా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం ఓటర్లు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు అనుకూలంగా భిన్నతీర్పు నిచ్చారు. పెద్దపల్లి, ధర్మపురిలలో టీఆర్ఎస్కు మెజారిటీ ఇచ్చిన ఓటర్లు మంథని, రామగుండంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువైపో..? పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా తీర్పునిచ్చిన పల్లె వాసులు ఈ నెలలోనే జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైం ది. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో బీజేపీ వైపు, పెద్దపల్లిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు అనుకూల తీర్పు ఇచ్చిన ఓటర్లు ఆ తరువాత జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపారనేది ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం వెల్లడి కావలసిన ప్రాదేశిక ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన నేపథ్యంలో మరో నెలరోజులకు పైగా సస్పెన్స్ కొనసాగనుంది. ఒక్కో ఎన్నికలో ఒక్కో రకమైన తీర్పునిచ్చిన కరీంనగర్ ఓటర్లు ప్రాదేశిక ఎన్నికల్లో ఎవరిని గెలిపించి జిల్లా పరిషత్ చైర్పర్సన్లను చేస్తున్నారోనన్న ఆసక్తి పెరుగుతోంది. -
మేమే ప్రత్యామ్నాయం!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు సాధించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఇదే అనువైన తరుణంగా భావిస్తోంది. రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ను పక్కకునెట్టి రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే వ్యూహంపై కసరత్తు ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేడి తగ్గకముందే రాష్ట్రంలో పర్యటించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఇన్నాళ్లూ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర రాజకీయాలపై పట్టు కోల్పోరాదని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. మూడు లోక్‌సభ స్థానా ల్లో విజయం సాధించడంతోపాటు పటిష్టమైన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా చూసుకుంటే తెలంగాణలో భవిష్యత్తు తమకే ఉంటుందని భావిస్తోంది. అనూహ్యంగా పుంజుకున్న కమలం... లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పదహారు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఉన్న అధికార టీఆర్ఎస్ తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలుపొందారు. రాష్ట్రంలో పది శాతం లోపు ఓటు బ్యాంకు కలిగి ఉన్న మరో జాతీయ పార్టీ బీజేపీ మాత్రం అనూహ్యంగా పుంజుకొని ఏకంగా నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. మొదటి నుంచి బీజేపీకి పట్టు ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంతోపాటు టీఆర్ఎస్కు బలమైన నాయకత్వం, కేడర్ ఉన్న ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన బీజేపీ... నాలుగు చోట్ల గెలుపొందగా మహబూబ్‌నగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. మరో మూడు చోట్ల గణనీయంగా ఓట్లు సాధించింది. ప్రస్తుతం ఓటమి పాలైన లోక్‌సభ స్థానాల్లోనూ 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బీజేపీ అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతంపరంగా చూస్తే కమలదళం లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 8.7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ... 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7.07 శాతం ఓట్లతో నామమాత్ర ప్రభావాన్ని చూపింది. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్షాన కేవలం ఒక్క శాసనసభ్యుడే ఎన్నికయ్యారు. మరో పది అసెంబ్లీ స్థానాల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భారీగా పుంజుకున్న బీజేపీ ఏకంగా 19.45 ఓట్ల శాతంతో నాలుగు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. మేమూ తీసిపోలేదంటున్న కాంగ్రెస్... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమవగా గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ 11 మంది దశలవారీగా అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అలాగే జహీరాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైనా పార్టీ బలమైన పోటీ ఇవ్వగలిగిందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని గాలివాటం గెలుపుగా అభివర్ణిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అనే విశ్వాసంతో ఉంది. త్వరలో వెలువడే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గణనీయమైన ఫలితాలు సాధిస్తామనే ధీమాతో ఉంది. బలమైన కేడర్‌గల తాము దక్షిణ తెలంగాణలో పట్టు నిలుపుకోవడంతోపాటు ఉత్తర తెలంగాణలో తిరిగి పుంజుకుంటామనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనే అంశం ఆసక్తికరంగా మారనుంది. ఇక తెలంగాణలో కమలం దూకుడు... రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టి సీట్లపరంగా బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు కేంద్రంలో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో తమ ఎదుగుదలకు అనుకూల పరిస్థితి ఉందన్న అంచనాకు వస్తోంది. ఫలితాల వెల్లడికి ముందు టీఆర్‌ఎస్‌పట్ల కొంత మెతక ధోరణి అవలంబించిన బీజేపీ.. ఇకపై దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పార్టీ పక్షాన గెలుపొందిన నలుగురు ఎంపీలతో హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తదితరులు చేసిన ప్రసంగాలు టీఆర్ఎస్ లక్ష్యంగా తమ కార్యకలాపాలు ఉంటాయనే రీతిలో సాగాయి. ఓవైపు టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుంటూనే కాంగ్రెస్‌ను మరింత వెనక్కి నెట్టి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే వ్యూహం బీజేపీలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోని ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతలను పార్టీలోకి రప్పించాలనేది బీజేపీ వ్యూహం కాగా, కాంగ్రెస్‌కు పట్టున్న దక్షిణ తెలంగాణలో తమ ఎదుగుదలకు అనువైన పరిస్థితి ఉందని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రజలు మన వెంటే...
సాక్షి, హైదరాబాద్: ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్కు దక్కాయని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ముం దుకు సాగాలని సూచించారు. టీఆర్ఎస్ కీలకనేత తన్నీరు హరీశ్‌రావు, మంత్రులు మహమూద్ అలీ, జి.జగదీశ్‌రెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సత్యవతిరాథోడ్, టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులు పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పోతుగంటి రాములు, మాలోతు కవిత, వెంకటేశ్ నేత, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, బి.బి.పాటిల్, బూర నర్సయ్యగౌడ్, నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే సోలి పేట రామలింగారెడ్డి, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తదితరులు శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. కేసీఆర్ ఇరవై నిమిషాలపాటు అందరితో ముచ్చటించారు. ఎన్ని కల ఫలితాలపై ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఓడిన అభ్యర్థులను అనునయించారు. కేసీఆర్‌తో భేటీకి ముందు పలువురు అభ్యర్థులు, నేతలు కేటీఆర్‌ను కలిశారు. అక్కడి నుంచి అందరూ కేసీఆర్ దగ్గరికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు కొన్ని సెగ్మెంట్లలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయలేకపోయారని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో సమీక్ష అవసరమని కేటీఆర్ అక్కడ ఉన్న నేతలతో అన్నారు. ఫలితాలపై మందకొడిగా ఉండొద్దని, రాజకీయంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన కవిత ఉదయమే ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ కీలకనేత హరీశ్‌రావు... లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన కవిత, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్ ఇళ్లకు వెళ్లి వారిని అనునయించారు. నేడోరేపో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ప్రస్తుతం ఉప ఎన్ని క జరుగుతోంది. ఈ నెల 28తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. తక్కళ్లపల్లి రవీందర్రావును అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉందని అధికార పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. నెలాఖరులో పోలింగ్ జరగనున్న 3 స్థానిక సంస్థల స్థానాల్లో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం వారికి టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. మైనంపల్లి రాజీనామాతో ఖాళీ అయి న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అదే సామాజికవర్గానికి చెందిన రవీందర్‌ను బరిలో దింపాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్లో క్రీయాశీలంగా ఉన్న నేతగా రవీందర్‌రావుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎప్పుడూ రాలే దు. 2014 ఎన్నికల వరకు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన వారిలో రవీందర్రావు తప్ప మిగిలిన అందరికీ గత ప్రభుత్వం లో ఏదో ఒక పదవి దక్కింది. కాగా టీఆర్ఎస్ అధిష్టానం ఈసారి ఎమ్మెల్సీగా సీనియర్‌కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. మల్కాజ్గిరి నేత కె.నవీన్‌రావు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తోంది. -
కేసీఆర్‌ను గద్దె దించేది కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ను దించే స్థాయి బీజేపీకి లేదని, అదృష్టం కొద్ది మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లలో డిపాజిట్లు దక్కలేదని, స్థానికంగా ఆ పార్టీ ఎంత బలంగా ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఇక్కడ తన నివాసంలో కలసిన విలేకరులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పునాదులను తక్కువగా అంచనా వేశారని, తెలంగాణలో మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందన్నారు. నిజానికి తమ పార్టీ ఆరు సీట్లు గెలవాల్సి ఉందని, కొద్దిలో తమ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. గెలిచిన వారంతా డైనమిక్ లీడర్లేనని అన్నారు. ఈ గెలుపుతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పాయన్నారు. పీసీసీ మార్పుపై ఇంతవరకు ఎలాంటి చర్చ లేదని, తనకు ఏ బాధ్యత ఇస్తే దాన్ని నిర్వర్తిస్తానని, బాధ్యతలు లేకున్నా కార్యకర్తగా పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ నుండి ఎవరు బయటకు పోయినా నష్టం లేదని లోక్‌సభ ఫలితాలు రుజువు చేశాయన్నారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్లు కూడా కాంగ్రెస్‌కు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల వాయిదా హర్షణీయం: ఉత్తమ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. ఫలితాలను వాయిదా వేయాలంటూ అఖిలపక్షం చేసిన పోరాటం ఫలించిందన్నారు. అప్రజాస్వామిక పద్ధతులకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని ఎస్ఈసీ అంగీకరించడం హర్షణీయ మని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఆధ్వర్యాన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం చేసిందని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పేర్కొన్నారు. కోర్టుతీర్పు ప్రతికూలంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను వాయిదా వేయించిందన్నారు. -
నిరంకుశ పాలనపై ప్రజా తీర్పు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ఇష్టానుసారంగా.. తాము ఏం చేసినా.. ప్రజలు ఆమోదిస్తారన్న పాలకుల నిరంకుశ వైఖరిపై ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో తీర్పునిచ్చారని, ప్రజా ఉద్యమాలను అణచాలని చూస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మూల స్తంభాలైన కరీంనగర్, నిజామాబాద్ నేతలు ఓడిపోయారన్నారు. ఈ ప్రభుత్వం గెలిచాక నిరుద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయని, ప్రజా ఉద్యమాలను అణచాలని ప్రభుత్వం చూడడంతో నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. మంత్రివర్గ ఏర్పాటులో ఆలస్యం, పాలన లేకపోవడం, ఏ విషయాన్ని అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రజలపై నిర్లక్ష్య ధోరణితో టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రైతులు సంఘటిత శక్తిగా నిలబడి జాతీయస్థాయికి రైతాంగ సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు. త్వరలోనే తెలంగాణ జనసమితి అటవీ భూముల హక్కుపై పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. ప్రజలు మాత్రం గట్టిగా నిలబడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు వెంకట్‌రెడ్డి, కుంట్ల ధర్మార్జున్, గట్ల రమాశంకర్ తదితరులు ఉన్నారు. -
ప్రజలకు రుణపడి ఉంటాను
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకను అవుతానని మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన ఎనుగుల రేవంత్‌రెడ్డి అన్నారు. తనను ఆశీర్వదించిన మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ కేసీఆర్ రాజ్యం అనుకుంటున్నారని, తండ్రీ కొడుకుల అహంకారం అణచేందుకే ప్రజలు ఈ ఫలితాలు ఇచ్చారన్నారు. కేసీఆర్ అధికారాన్ని ఆస్తులు పెంచుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం, ట్రైబల్ వర్సిటీలను సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్లకు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసే వరకు పోరాడతానని చెప్పారు. మల్కాజిగిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎత్తేసి, గ్రేటర్ పరిధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మిలటరీ అధీనంలోని రోడ్లపై ప్రజలకు స్వేచ్ఛ ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. -
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను
పెద్దపల్లి: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేసేందుకు వచ్చానని చెప్పారు. ఆదరించి గెలిపించిన సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే తనను కలుపుకొని గెలిపించడానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులకు, నియోజకవర్గ ఓటర్లకు సేవకుడిగా ఉంటానని వెల్లడించారు. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ విషయంలో గతేడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ, తాజాగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. వాస్తవానికి ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. పార్లమెంటు కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర పోలీసులు మొత్తం 54 వేల మందికి తోడుగా కేంద్ర బలగాలు, అటవీ, విద్యుత్తు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులంతా కలిపి దాదాపు 80 వేల మందికిపైగా పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూంబింగ్ పార్టీలు నిత్యం అప్రమత్తంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా పొలిమేరలను కట్టుదిట్టంగా పహారా కాశారు. పోలింగ్ ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్ పేల్చివేత, పోలింగ్ తరువాత మహారాష్ట్రలో పోలీసుల కాన్వాయ్‌పై మెరుపు దాడితో మావోయిస్టులు హింసకు దిగి ప్రశాంతతను చెదరగొట్టారు. కానీ, తెలంగాణలో మావోయిస్టులకు అలాంటి అవకాశాలు ఏమాత్రం ఇవ్వలేదు. ఇక తెలంగాణలో మొత్తం 2,600 సంక్లిష్ట ప్రాంతాలు, 5749 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి సఫలమయ్యారు. 40 రోజులపాటు సుదీర్ఘ పహారా.. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరపడంలో పోలీసులు సఫలమయ్యారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనం. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించారు. వీటికి 42 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కల్పించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్లతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా ఏకంగా 10,000 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. విరామం ఎరగకుండా.. ఏడాదిలోపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం సవాలే అయినా.. సమస్యల్లేకుండా ఎలాంటి విశ్రాంతి, సెలవులు తీసుకోకుండా తెలంగాణ పోలీసులు నిర్విరామంగా, సమర్థంగా విధులు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాతే సర్పంచి ఎన్నికలు, తరువాత పార్లమెంటు, అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేశారు. -
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీని సాధించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ అయిదో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,26,028 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఆయన ప్రత్యర్థి వేమిరెడ్డి(టీఆర్ఎస్)కి 5,00,346 ఓట్లు వచ్చాయి. నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో (2014) ఈ స్థానం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఒక దశలో కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత కనిపించింది. ఏఐసీసీ ఆదేశాలతో ఉత్తమ్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి గెలుపు తీరాలను చేరుకున్నారు. ఉత్తమ్.. ఆరోసారి! టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా ఆరోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిలటరీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉత్తమ్ మొదటిసారి 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, 1999లో అదేస్థానం నుంచి ఆయన గెలుపొంది ఇక వెనుదిరిగి చూడలేదు. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ కోదాడ నుంచి ఆయన విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించడం విశేషం. మొత్తం మీద వరుసగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలుపొందిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపును సాధించారు. టీఆర్ఎస్ను అసహ్యించుకుంటున్నారు ‘తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అసహ్యించుకుంటున్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలే’ అని నల్లగొండ లోక్‌సభ స్థానం విజేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌లో అహంభావ ధోరణి పెరిగిందని, దాన్ని తెలంగాణ ప్రజలు సహించకనే ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజల్లో టీఆర్ఎస్పై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌తో పాటు వేరే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. -
ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్ : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ సత్తా చాటారు. గత ఎన్నికల్లో తన తమ్ముడిని ఓడించిన టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బూర నర్సయ్యగౌడ్ 30,494 ఓట్లతో ఓడించారు. రాజగోపాల్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి నుంచి వెంకట్‌రెడ్డిని పోటీలో నిలిపింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో వెంకట్‌రెడ్డికి 5,31,014 ఓట్లు రాగా, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు 5,26,751 ఓట్లు వచ్చాయి. 4,263 ఓట్ల ఆధిక్యతతో వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఎమ్మెల్యే, ఎంపీలుగా ... కోమటిరెడ్డి బ్రదర్స్ మరో రికార్డు సృష్టించారు. ఇద్దరికీ దేశ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999 నుంచి వరుసగా 2014 వరకు 4 సార్లు నల్లగొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలుకాగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుంచి విజయం సాధిం చారు. 2009 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందగా, ఇప్పుడు అదే స్థానం నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. -
గెలిచారు.. నిలిచారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతల పరువు నిలబడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ముఖ్య నాయకుల్లో ముగ్గురు విజయం సాధించడంతో పార్టీ ఊపిరి పీల్చుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి తాము పోటీ చేసిన స్థానాల నుంచి గెలుపొందడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కీలక నేతలు బరిలో ఉండటం, టీఆర్ఎస్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు రావడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొన్నా ముఖ్య నేతలు ముగ్గురూ విజయం సాధించడం కొంత ఊరటనిచ్చింది. కొంచెం కష్టపడి ఉంటే... ఈ ముగ్గురికి తోడు మరో ఇద్దరు కూడా గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలయ్యాయి. చేవెళ్ల నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల మదన్మోహన్రావు అధికార పార్టీకి ఓ రకంగా చుక్కలు చూపించారు. టీఆర్ఎస్ కంచుకోట జహీరాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. చేవెళ్లలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. చాలా స్వల్ప తేడాతో ఈ ఇద్దరు ఓటమి పాలు కావడంతో కొంచెం కష్టపడి ఉంటే ఈ స్థానాలు కూడా దక్కేవనే ఆవేదన గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన వారంతా ఫెయిల్... అలాగే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలుగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ లాంటి నేతలంతా పరాజయం పాలయ్యారు. నిజామాబాద్‌లో అయితే మధుయాష్కీకి వచ్చిన ఓట్లు పార్టీ నేతలను విస్మయపరిచాయి. ఆయనకు కేవలం 7 శాతంతో 65వేలకు పైగా మాత్రమే ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు 1.80 లక్షల ఓట్లు రాగా, రేణుకాచౌదరికి దాదాపు 4 లక్షలు, బలరాం నాయక్‌కు 3.15 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు కీలక నేతలు విజయం సాధించడం, మిగిలిన నేతలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
రాహుల్ వచ్చినా.. ఒక్కచోటే గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధించుకున్నా.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన స్థానాల్లో ఒకటి మినహా మిగతాచోట్ల ఓటమి పాలైంది. రాహుల్ రెండు విడతలుగా నాలుగు పార్లమెంట్ స్థానాలు చేవెళ్ల, నల్లగొండలో ఒక విడతలో, జహీరాబాద్, నాగర్‌కర్నూల్‌లో మరో విడతలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవెళ్లలో జరిగిన ప్రచార సభల్లోనే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు పాలుపంచుకున్నారు. నల్లగొండ సభకు భువనగిరి అభ్యర్థితోపాటు కార్యకర్తలు హాజరయ్యారు. జహీరాబాద్ సభకు మెదక్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్ సభకు మహబూబ్‌నగర్ అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఇందులో నల్లగొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఒక్కరే గెలిచారు. మిగతా చోట్ల జరిపిన సభల్లో అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ఇందులో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి మదన్ మోహన్‌రావులు మాత్రమే 8 వేల కన్నా తక్కువ ఓట్లతో ఓటమి పాలవగా, మిగతా చోట్ల అభ్యర్థులంతా భారీ మెజార్టీలతో ఓటమి చెందారు. రాహుల్ తన ప్రసంగాల్లో రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల అంచనాల పెంపు, అవినీతి, కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. దీంతోపాటే రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంతోపాటు, అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.72 వేల ఆర్థికసాయం అంశాలను ప్రస్తావించారు. అయినా రాహుల్ ప్రచారం చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. -
పదోసారి హైదరాబాద్ మజ్లిస్ వశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో మజ్లిస్ పార్టీ వరసగా పదో విజయాన్ని నమోదు చేసుకుంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజా ఎన్నికల్లో ఈ స్థానంలో ఘన విజయం సాధించారు. పోటీ చేసిన ప్రతిసారీ మెజారిటీని పెంచుకుంటూ వస్తున్న అసదుద్దీన్ ఈసారి భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన దాదాపు 2.82 లక్షల ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయనకు ఇది వరసగా నాలుగో విజయం. గత ఎన్నికల్లో 2.02 లక్షల ఓట్ల మెజారిటీ సంపాదించారు. ఇప్పటికి వరుసగా పదిసార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న మజ్లిస్‌పార్టీకి ఇదే అతిపెద్ద మెజారిటీ కావటం విశేషం. పాతనగరంలో తనకు తిరుగులేదని మజ్లిస్ పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఒక్క గోషామహల్ అసెంబ్లీ స్థానం తప్ప మిగతా ఏడు స్థానాలూ మజ్లిస్ చేతిలోనే ఉన్నాయి. ఎన్నికలకు ముందే ‘గెలుపు’.. కారు.. సారు... పదహారు.. నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన టీఆర్ఎస్ తాను 16 స్థానాలు గెలుస్తున్నట్టు పేర్కొంది. ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో గెలుపు మాత్రం మజ్లిస్‌దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించటం విశేషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన భగవంతరావునే బీజేపీ ఈసారి కూడా బరిలో నిలిపింది. తమ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంటూ చివరి వరకు పోటీ ఇచ్చింది. కానీ అధికార పక్షం మజ్లిస్ విజయాన్ని పోలింగ్‌కు ముందే చెప్పేయటంతో అక్కడ పోటీ అంత రసవత్తరం కాదని తేలిపోయింది. మజ్లిస్ కేడర్‌లో కొంత నిరుత్సాహం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకు ఏడు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను, పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుని మజ్లిస్ పార్టీ జోష్‌లోనే ఉంది. కానీ, లోలోన మాత్రం ఆ పార్టీ నేతల్లో ఈసారి కొంత నిరుత్సాహం ఆవరించింది. నగరంలోని ఒక్క రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం మినహా కొత్త చోట్ల పోటీ చేయలేదు. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్ గెలవడంతో మజ్లిస్ శ్రేణులు డీలా పడ్డాయి. గతంలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో గట్టి పోటీ ఇచ్చినా, ఈసారి టీఆర్ఎస్కు మేలు చేసే క్రమంలో సికింద్రాబాద్‌లో పోటీ చేయలేదు. అటు అసెంబ్లీ స్థానాలు, ఇటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొత్త స్థానాల్లో పోటీ చేయకపోవటం ఆ పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తతకు కారణమైంది. ఔరంగాబాద్‌లో మజ్లిస్ విజయం... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఇది ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మజ్లిస్ పార్టీ తొలిసారి ఒక ఎంపీ స్థానాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు విడతలవారీగా అక్కడ ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. ఇంతకాలం పార్లమెంటులో ఒక్క సీటుకే పరిమితమైన మజ్లిస్ తరఫున ఈసారి దర్జాగా ఇద్దరు ప్రవేశించనున్నారు. -
మోదం... ఖేదం!
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభవాన్ని మిగిల్చాయి. కేంద్రంలో అధికారం వస్తుందని ఆశించినా కూడా రెండోసారీ అందని ద్రాక్షగానే మిగలడంతో డీలాపడిన ఆ పార్టీ శ్రేణులకు రాష్ట్రంలోని ఫలితాలు కొంత ఊరటనిచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా 2014 ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో సీట్లు, ఓట్లు పెరగడంతో పార్టీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, బీజేపీ రూపంలో దూకుడుగా వస్తున్న ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుందనే సంకేతాలను కూడా ఈ లోక్‌సభ ఫలితాలు ఇవ్వడంతో పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలయింది. మొత్తం మీద ఓ వైపు కేంద్రంలో అధికార దక్కకపోవడం, తెలంగాణలో ఫలితాలు ఆశాజనకంగా ఉండటం, ప్రతిపక్ష స్థానం కోసం మరోపార్టీ ముందుకు వస్తుండటం... వెరసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈ లోక్‌సభ ఫలితాలు మోదంతో పాటు ఖేదాన్ని కూడా మిగిల్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో మెజార్టీ.. ఇప్పుడు ఢమాల్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది. ఈ 2 నియోజకవర్గాల్లోని మెజార్టీ అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారుమారు కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు లక్షపైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో గెలుపొందిన నల్ల గొండలో మళ్లీ గెలుపొందినా, నాగర్‌కర్నూల్‌లో ఓడిపోయారు. నల్లగొండలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 25వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందగా, నాగర్‌కర్నూల్‌లో దాదాపు 2 లక్షల ఓట్ల తేడాతో మాజీ ఎంపీ మల్లు రవి ఓడిపోవడం గమనార్హం. కమల వికాసంతో కలవరం... ఇక, కాంగ్రెస్ గెలుపోటముల మాట అటుంచితే రాష్ట్రంలో బీజేపీ రూపంలో మరో పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం ముంచుకొస్తుందన్న రీతిలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. తమ కంటే ఓ సీటు ఎక్కువే గెలుపొందిన కమలనాథులు అదే రీతిలో ఓట్లు కూడా సాధించి ఓ రకంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను సవాల్ చేసే స్థాయికి చేరుకున్నారు. పైగా, కేంద్రంలో బీజేపీకే మళ్లీ అధికారం దక్కడంతో ఆ పార్టీ నేతలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని, అదే జరిగితే తమ మనుగడ ఏమవుతుందోననే ఆందోళన కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ‘అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఫలితాలు మాకు ఊరటనిచ్చిన మాట వాస్తవమే. ముఖ్య నేతలు గెలుపొందడం శుభపరిణామం. అయితే, రాష్ట్రంలో బీజేపీ మాకు గట్టి ప్రత్యర్థిగా తయారవుతుందన్న విషయాన్ని మా పార్టీ నేతలు గ్రహించాలి. పార్టీ మనుగడ కొనసాగాలంటే, ప్రతిపక్ష స్థానం నిలబెట్టుకోవాలంటే కమలనాథులతో కచ్చితంగా పోటీ పడాల్సిందే’ అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద సంతోషంతో పాటు ఆందోళన కలిగించేలా వచ్చిన లోక్‌సభ ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తును ఎటు వైపునకు తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే. గతం కంటే నయమే... తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కేవలం 2 లోక్‌సభ స్థానాల్లోనే కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి నంది ఎల్లయ్య మాత్రమే గెలిచారు. అయితే, ఈసారి మాత్రం ఏకంగా 4 స్థానాల్లో విజయం సాధించడం, పార్టీలోని కీలక నేతలు గెలుపొందడం శ్రేణులకు ఉత్సాహాన్ని మిగిల్చింది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు పార్టీ ఫైర్బ్రాండ్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతుండటం పార్టీ భవిష్యత్తుపై సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయింది. సీట్లతో పాటు ఓట్ల శాతం పెరగడం, జహీరాబాద్ లాంటి టీఆర్ఎస్ కంచుకోటలో కూడా గట్టిపోటీ ఇవ్వడం ఆ పార్టీకి మంచి పరిణామమనే చెప్పాలి. -
డేంజర్ జోన్లో టీఆర్ఎస్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే 3 స్థానాల్లో గెలుపొందినా తాము సేఫ్ జోన్లో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లో బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడం వల్ల తమకేమీ నష్టం లేదని, టీఆర్ఎస్ మాత్రం డేంజర్ జోన్ లో పడిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ల రూపంలో మూడు పులులు విజయం సాధించాయని చెప్పారు. భవిష్యత్తులో తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లబోరని, టీఆర్ఎస్ నేతలే బీజేపీలోకి వెళతారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు పులులు అవసరం లేదని, వేదమంత్రాలు చదివే సాత్వికులు కావాలని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలకమైన నేతలు ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. గత లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేతగా ఉన్న ఎ.పి.జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. టీఆర్ఎస్ కీలకనేతగా గుర్తింపు ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ సీనియర్ ఎంపీగానూ ఉండేవారు. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల కవిత సైతం పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరుపున గెలిచిన 9 మంది ఎంపీలలో ఉన్న బి.బి.పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, దయాకర్, నామా నాగేశ్వర్‌రావులో ఒకరికి టీఆర్ఎస్ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యలు చెబుతున్నారు. వారంలోపే కొత్త ఎంపీలతో సమావేశం నిర్వహించి లోక్‌సభ పక్షనేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. -
అలసత్వమే ముంచింది!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు మిశ్రమ ఫలితాలను అందించాయి. 5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఇద్దరు స్వతంత్రులు, 11 మంది కాంగ్రెస్, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడింది. 6 నెలలైనా కాకముందే లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. టీఆర్ఎస్ క్యాడర్ ఒకరకమైన అతివిశ్వాసంలో ఉండిపోయింది. గెలుపు తమదే అన్న ధోరణితో పార్టీ క్యాడర్లో, కింద స్థాయి నేతల్లో అలసత్వం నెలకొంది. 16 సీట్లలో గెలుపు అనే టీఆర్ఎస్ నినాదానికి తగినట్లుగా జిల్లా, నియోజకవర్గాల నేతలు పని చేయలేకపోయారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీతో తమకు పోటీ లేనేలేదనే ధోరణితో వ్యవహరించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ బలం చూపెట్టాలనే ప్రయత్నంలో నిమగ్నమయ్యా యి. టీఆర్ఎస్ అభ్యర్థులు, మంత్రులు క్రీయాశీలకంగా పని చేసినా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు సమన్వయం కనిపించలేదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ గెలుపు కోసం మొదట వేర్వేరుగా పని చేశాయి. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ స్థానిక నేతలు వ్యూహం మార్చారు. బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ పార్టీలో బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన పార్టీ వారి కి మద్దతిచ్చి ఎక్కువ ఓట్లు పోలయ్యేలా పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కలిసిపోయినట్లు కనిపించినా టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం ఆశించినట్లు రాకపోవడానికి అధికార పార్టీలో నెలకొన్న అలసత్వమే కారణమని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో తమ క్యా డర్ ఒకింత నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని అం టున్నారు. కాంగ్రెస్, బీజేపీల వ్యూహాన్ని బట్టి ప్రతివ్యూహం అమలులో తమ పార్టీ నేతలు విఫలమయ్యారని చెబుతున్నారు. రెండు పార్టీలు కలసి పని చేయడం వల్లే పలు కీలక నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయని టీఆర్ఎస్ ముఖ్యులు నిర్ధారణకు వస్తున్నారు. మార్పులతో... లోక్‌సభ అభ్యర్థుల ఖరారులో టీఆర్ఎస్ వ్యూహం మిశ్రమ ఫలితాలనిచ్చింది. సిట్టింగ్ ఎంపీలను మా ర్చిన స్థానాల్లో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. కొత్త వారిని బరిలోకి దింపిన మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, చేవెళ్ల, పెద్దపల్లి స్థానాలను గెలుచుకోగా, నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలో ఓడిపోయింది. సిట్టింగ్ ఎంపీలు బరిలో దిగిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోగా.. మెదక్, వరంగల్, జహీరాబాద్‌లో గెలిచింది. -
18 స్థానాలు మైనస్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొందిన అధికార టీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ జోరును కొనసాగించలేకపోయిందని గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాలు చెపుతున్నాయి. ఈఫలితాల్లో 9 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతను కనబర్చగలిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత తగ్గిపోయిందని ఫలితాల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇతర పార్టీల విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ 22 చోట్ల, బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యతను కనబర్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కు 3చోట్ల అధికంగా మెజారిటీ రాగా, కేవలం ఒక్క స్థానం గెలిచిన బీజేపీ ఏకంగా 20 స్థానాలు ఎక్కువగా 21 చోట్ల ఆధిక్యత కనబర్చింది. మజ్లిస్ మాత్రం 6 చోట్ల తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 7 స్థానాలకు గాను ఆరింట మెజార్టీ నిలబెట్టుకున్న ఎంఐఎం, తాను పోటీ చేయని నాంపల్లి అసెంబ్లీ పరిధిలో టీఆర్ఎస్కు ఆధిక్యత తెచ్చిపెట్టింది. స్వల్ప నష్టమే కానీ.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో 18 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కోల్పోయింది. అయితే, గతం కన్నా పార్లమెంటు స్థానాలు కూడా తగ్గడం, తమ కంచుకోటల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఆధిక్యత రావడం ఆ పార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్, బాల్కొండ, సనత్‌నగర్, నిర్మల్ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కోల్పోగా, మంత్రులతో పాటు ఆ పార్టీ ముఖ్యులు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్ల, సిద్దిపేట, హుజూరాబాద్, పాలకుర్తి, మేడ్చల్, వనపర్తి, ధర్మపురి స్థానాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. కాగా, సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఆ పార్టీ మరోసారి భారీ మెజార్టీ దక్కించుకుంది. ఓడిన చోట్ల గెలుపు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబర్చిన 22 నియోజకవర్గాల్లో 17 చోట్ల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హుజూర్నగర్, నకిరేకల్, మునుగోడు, మంథని, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే ఈసారి కూడా మెజార్టీ సాధించింది. అయితే, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నియోజకవర్గమైన జగిత్యాల, ఉత్తమ్ పద్మావతి ఓడిపోయిన కోదాడ, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ నియోజకవర్గమైన కామారెడ్డిల్లో ఈసారి కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక, బీజేపీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గోషామహల్లో తన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి టీఆర్ఎస్ కంచుకోటలయిన చాలా నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించింది. ఉత్తర తెలంగాణలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ ఆధిక్యత సాధించడం విశేషం. పార్టీల వారీగా ఆధిక్యత స్థానాలు టీఆర్ఎస్ సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, సిర్పూర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్, పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పాలకుర్తి, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ (ఈస్ట్), వరంగల్ (వెస్ట్), వర్ధన్నపేట, తాండూరు, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, ముథోల్, నాంపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ (అర్బన్), బోధన్. కాంగ్రెస్ దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం, భువనగిరి, మంథని, రామగుండం, పరిగి, వికారాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, నిర్మల్, ఖానాపూర్, చేవెళ్ల, జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి. బీజేపీ కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, అంబ ర్‌పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, మక్తల్, మహబూబ్‌నగర్, గోషామహల్, ఆర్మూర్, నిజామాబాద్ (రూరల్), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల. మజ్లిస్ మలక్‌పేట, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహుదూర్‌పుర. -
స్పీడు తగ్గిన కారు
సాక్షి, హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆశించింది. టీఆర్ఎస్ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్‌కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ జి.నగేశ్‌పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చేవెళ్ల నుంచి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌పై భారీ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మంలో చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్‌పై 1,46,663 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 77,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిపై 1,89,748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ నేత.. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95,180 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్‌రావుపై 6,229 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఉనికి కాపాడుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఎ.రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమల వికాసం! తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్‌గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్‌ను బీజేపీ నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ ఇక్కడినుంచి విజయం సాధించగా.. ఈసారి బీజేపీ ఎంపీగా పోటీచేసిన పార్టీ సీనియర్‌నేత కిషన్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై గెలుపొందారు. అయితే.. కరీంనగర్లో బీజేపీ పోటీ ఇస్తుందని భావించినా.. అనూహ్యంగా బండి సంజయ్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించిన సోయం బాపూరావు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. -
పీసీసీ చీఫ్‌గా పులులు అవసరం లేదు..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే మూడు స్థానాల్లో గెలుపొందినా తాము సేఫ్ జోన్లో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడం వల్ల తమకేమీ నష్టం లేదని, టీఆర్ఎస్ మాత్రం డేంజర్ జోన్లో పడిందని ఆయన చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ల రూపంలో మూడు పులులు విజయం సాధించాయని చెప్పారు. బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో తమకు నష్టమేమీ లేదని, ప్రస్తుతం రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు 2023లో మూడు పార్టీల మధ్య జరుగుతాయని అన్నారు. భవిష్యత్తులో తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లబోరని, టీఆర్ఎస్ నేతలే బీజేపీలోకి వెళతారని చెప్పారు. నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ గెలుపొందడం ద్వారా ఖాళీ అయ్యే హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో కూడా తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు పులులు అవసరం లేదని, వేద మంత్రాలు చదివే సాత్వికులు కావాలని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్..!
సాక్షి, హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కాస్త పుంజుకుంది. ఒక్క చోట కూడా గెలుపు కష్టమే అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ మూడు చోట్ల విజయం సాధించి చేవెళ్లలో గెలుపు దిశగా వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుకొని తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ సీనియర్ నేతలను బరిలోకి దింపి విజయావకాశాలను మెరుగుపరుచుకుంది. టీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. దీంతో నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్లాన్ ప్రకారం సీనియర్లకు టికెట్ ఇవ్వడం, టీఆర్ఎస్ కొత్త వారికి బరిలోకి దింపడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్‌పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాజయం పొందారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మల్కాజ్గిరి లోక్‌సభ స్థానాన్ని కేటాయించారు. నగరంలో రేవంత్‌కు ఉన్న క్రేజీతో పాటు, అసెంబ్లీ ఎన్నికల ఓటమి సానుభూతి రేవంత్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని బరిలోకి దింపడం కూడా రేవంత్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నల్గొండ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటి చేసి గెలుపొందారు. హోరాహోరిగా సాగిన పోరులో కోమటిరెడ్డి సమీపీ టీఆర్ఎస్ ప్రత్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై 4వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత, సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఈ నియోజకవర్గ ఎంపీగా ఉండడం కోమటిరెడ్డికి కలిసొచ్చింది. నల్గొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటితో గెలుపొందారు. సమీపీ ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 20వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
భువనగిరిలో కోమటిరెడ్డి గెలుపు
సాక్షి, హైదరాబాద్ : భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి ప్రజలు ఈ విజయాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. -
తెలంగాణ లోక్ సభ : వారేవా బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి టీఆర్ఎస్కు గట్టి పోటీని ఇస్తున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి బాపురావు 48వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ 17వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్‌కుమార్ 70వేల ఓట్ల ఆధిక్యం, సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి 35వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
తెలంగాణ లోక్‌సభ: విజేతలు వీరే
► తెలంగాణాలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ 9 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది. విజేతలు వీరే: 1) అసదుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం)- హైదరాబాద్ 2) బండి సంజయ్(బీజేపీ)-కరీంనగర్ 3)నామా నాగేశ్వర రావు(టీఆర్ఎస్)-ఖమ్మం 4)మాలోతు కవిత(టీఆర్ఎస్)-మహబూబాబాద్ 5) మన్నె శ్రీనివాస్ రెడ్డి(టీఆర్ఎస్)-మహబూబ్‌నగర్ 6)కొత్త ప్రభాకర్ రెడ్డి(టీఆర్ఎస్)- మెదక్ 7) పోతుగంటి రాములు(టీఆర్ఎస్)- నాగర్ కర్నూల్ 8) ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్)-నల్గొండ 9) వెంకటేశ్ నేత బోర్లకుంట(టీఆర్ఎస్)- పెద్దపల్లి 10) జి. కిషన్ రెడ్డి(బీజేపీ)- సికింద్రాబాద్ 11) పసునూరి దయాకర్(టీఆర్ఎస్)- వరంగల్ 12) ధర్మపురి అరవింద్(బీజేపీ)- నిజామాబాద్ 13) ఎనుముల రేవంత్ రెడ్డి(కాంగ్రెస్)- మల్కాజ్గిరి 14) కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(కాంగ్రెస్)-భువనగిరి 15) సోయం బాపూరావు(బీజేపీ)-ఆదిలాబాద్ 16) బీబీ పాటిల్(టీఆర్ఎస్)-జహీరాబాద్ 17) జి.రంజిత్ రెడ్డి(టీఆర్ఎస్)- చేవెళ్ల ► జహీరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 5823 ఓట్ల ఆధిక్యతతో ముందంజ ఉన్నారు. ► నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి చెందారు. ► ఖమ్మం పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరీపై 1,66,429 ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్కు 5 లక్షల 63 వేల 625 ఓట్లు, కాంగ్రెస్‌కు 3,97,196 ఓట్లు, సీపీఎంకు 56,606 ఓట్లు, బీజేపీకి 20,327 ఓట్లు, జనసేనకు 19,245 ఓట్లు వచ్చాయి. ►మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు 2 లక్షల 68 వేల 428 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావుకు లక్షా 95 వేల 13 ఓట్లు వచ్చాయి. ప్రభాకర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్‌పై 3 లక్షల 11 వేల 559 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ►మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోరులో సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్‌పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అసెంబ్లీలో ఘోర పరాయం పాలైన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఊరట నిచ్చాయి. ► భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ► ఎన్నికల తర్వాత 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఆ దిశగా సాగడంలేదు. ఆ పార్టీ 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె ఓటమి దిశగా పయనిస్తుండటం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది. ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మూడుస్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► కరీంనగర్ పార్లమెంట్ 9వ రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన పొన్నం ప్రభాకర్ 69,570, టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1,58,374, బీజేపీ తరఫున పోటీ చేసిన బండి సంజయ్ 2,13,602 ఓట్లు సాధించారు. ► మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి 10వ రౌండ్లో 3177 ఆధిక్యంలో ఉన్నారు. ►ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి నామానాగేశ్వరరావు రెండో రౌండ్ పూర్తయ్యేసరికి సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఐదువేల పైచిలుకు మెజారిటీలో ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత మొదటిరౌండ్ పూర్తయ్యే సరికి 8500 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ►తెలంగాణ వ్యాప్తంగా జోరుమీదున్న టీఆర్ఎస్ నిజామాబాద్‌లో వెనకంజలో ఉంది. కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఈ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో కొనసాగుతున్నారు. 160 మందికిపైగా రైతులు ఇక్కడ పోటీ చేయడంతో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ► మెదక్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిదిన కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టమైన మెజారిటీ కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన 65 వేల పైచిలుకు మెజారిటీలో కొనసాగుతున్నారు. ► తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్, జహీరాబాద్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో టీఆర్ఎస్ ఆదిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం ఆదిక్యంలో ఉంది. ► తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్ 11న) పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.