మేమే ప్రత్యామ్నాయం! | Amit Shah to the state soon to fill Josh in cadre | Sakshi
Sakshi News home page

మేమే ప్రత్యామ్నాయం!

Published Sat, May 25 2019 1:56 AM | Last Updated on Sat, May 25 2019 1:56 AM

Amit Shah to the state soon to fill Josh in cadre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు సాధించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఇదే అనువైన తరుణంగా భావిస్తోంది. రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ను పక్కకునెట్టి రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే వ్యూహంపై కసరత్తు ప్రారంభించింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేడి తగ్గకముందే రాష్ట్రంలో పర్యటించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఇన్నాళ్లూ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర రాజకీయాలపై పట్టు కోల్పోరాదని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారని కాంగ్రెస్‌ లెక్కలు వేస్తోంది. మూడు లోక్‌సభ స్థానా ల్లో విజయం సాధించడంతోపాటు పటిష్టమైన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా చూసుకుంటే తెలంగాణలో భవిష్యత్తు తమకే ఉంటుందని భావిస్తోంది. 

అనూహ్యంగా పుంజుకున్న కమలం... 
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పదహారు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలుపొందారు. రాష్ట్రంలో పది శాతం లోపు ఓటు బ్యాంకు కలిగి ఉన్న మరో జాతీయ పార్టీ బీజేపీ మాత్రం అనూహ్యంగా పుంజుకొని ఏకంగా నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. మొదటి నుంచి బీజేపీకి పట్టు ఉన్న సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంతోపాటు టీఆర్‌ఎస్‌కు బలమైన నాయకత్వం, కేడర్‌ ఉన్న ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన బీజేపీ... నాలుగు చోట్ల గెలుపొందగా మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. మరో మూడు చోట్ల గణనీయంగా ఓట్లు సాధించింది. ప్రస్తుతం ఓటమి పాలైన లోక్‌సభ స్థానాల్లోనూ 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బీజేపీ అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతంపరంగా చూస్తే కమలదళం లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 8.7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ... 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7.07 శాతం ఓట్లతో నామమాత్ర ప్రభావాన్ని చూపింది. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్షాన కేవలం ఒక్క శాసనసభ్యుడే ఎన్నికయ్యారు. మరో పది అసెంబ్లీ స్థానాల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భారీగా పుంజుకున్న బీజేపీ ఏకంగా 19.45 ఓట్ల శాతంతో నాలుగు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది.  

మేమూ తీసిపోలేదంటున్న కాంగ్రెస్‌... 
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమవగా గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ 11 మంది దశలవారీగా అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అలాగే జహీరాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైనా పార్టీ బలమైన పోటీ ఇవ్వగలిగిందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని గాలివాటం గెలుపుగా అభివర్ణిస్తున్న కాంగ్రెస్‌.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే విశ్వాసంతో ఉంది. త్వరలో వెలువడే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గణనీయమైన ఫలితాలు సాధిస్తామనే ధీమాతో ఉంది. బలమైన కేడర్‌గల తాము దక్షిణ తెలంగాణలో పట్టు నిలుపుకోవడంతోపాటు ఉత్తర తెలంగాణలో తిరిగి పుంజుకుంటామనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనే అంశం ఆసక్తికరంగా మారనుంది.  

ఇక తెలంగాణలో కమలం దూకుడు... 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టి సీట్లపరంగా బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు కేంద్రంలో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో తమ ఎదుగుదలకు అనుకూల పరిస్థితి ఉందన్న అంచనాకు వస్తోంది. ఫలితాల వెల్లడికి ముందు టీఆర్‌ఎస్‌పట్ల కొంత మెతక ధోరణి అవలంబించిన బీజేపీ.. ఇకపై దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పార్టీ పక్షాన గెలుపొందిన నలుగురు ఎంపీలతో హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ తదితరులు చేసిన ప్రసంగాలు టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా తమ కార్యకలాపాలు ఉంటాయనే రీతిలో సాగాయి. ఓవైపు టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటూనే కాంగ్రెస్‌ను మరింత వెనక్కి నెట్టి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే వ్యూహం బీజేపీలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోని ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతలను పార్టీలోకి రప్పించాలనేది బీజేపీ వ్యూహం కాగా, కాంగ్రెస్‌కు పట్టున్న దక్షిణ తెలంగాణలో తమ ఎదుగుదలకు అనువైన పరిస్థితి ఉందని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement