సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ విషయంలో గతేడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ, తాజాగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. వాస్తవానికి ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. పార్లమెంటు కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర పోలీసులు మొత్తం 54 వేల మందికి తోడుగా కేంద్ర బలగాలు, అటవీ, విద్యుత్తు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులంతా కలిపి దాదాపు 80 వేల మందికిపైగా పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.
వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూంబింగ్ పార్టీలు నిత్యం అప్రమత్తంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా పొలిమేరలను కట్టుదిట్టంగా పహారా కాశారు. పోలింగ్ ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్ పేల్చివేత, పోలింగ్ తరువాత మహారాష్ట్రలో పోలీసుల కాన్వాయ్‌పై మెరుపు దాడితో మావోయిస్టులు హింసకు దిగి ప్రశాంతతను చెదరగొట్టారు. కానీ, తెలంగాణలో మావోయిస్టులకు అలాంటి అవకాశాలు ఏమాత్రం ఇవ్వలేదు. ఇక తెలంగాణలో మొత్తం 2,600 సంక్లిష్ట ప్రాంతాలు, 5749 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి సఫలమయ్యారు.
40 రోజులపాటు సుదీర్ఘ పహారా..
ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరపడంలో పోలీసులు సఫలమయ్యారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనం. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించారు. వీటికి 42 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కల్పించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్లతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా ఏకంగా 10,000 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
విరామం ఎరగకుండా..
ఏడాదిలోపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం సవాలే అయినా.. సమస్యల్లేకుండా ఎలాంటి విశ్రాంతి, సెలవులు తీసుకోకుండా తెలంగాణ పోలీసులు నిర్విరామంగా, సమర్థంగా విధులు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాతే సర్పంచి ఎన్నికలు, తరువాత పార్లమెంటు, అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment